కల్కిలో ఆ గెస్ట్ రోల్ కంటిన్యూ అయితే.. కిక్కే కిక్కు!

'కల్కి 2898 ఏడీ' చిత్రంతో దర్శకుడు నాగ్ అశ్విన్ పాన్ ఇండియా వరల్డ్ లో మంచి క్రేజ్ అందుకుంటున్నారు

Update: 2024-06-28 13:11 GMT

'కల్కి 2898 ఏడీ' చిత్రంతో దర్శకుడు నాగ్ అశ్విన్ పాన్ ఇండియా వరల్డ్ లో మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఆడియెన్స్ ను ఎలాంటి సీన్స్ తో మెప్పించాలో అతనికి బాగా అర్థమైనట్లు ఉంది. ఇక కల్కి సీక్వెల్ తో కూడా కిక్కిచ్చేలా అడుగులు వేయబోతున్నాడు. సినిమాలో అతిథి పాత్రలు ఎక్కువగా ఉండటమే కాకుండా, ప్రతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ పాత్రలను సర్‌ప్రైజ్‌గా ఉంచాలనుకున్నప్పటికీ, హీరో ప్రభాస్ అనుకోకుండా కొన్ని పాత్రలను లీక్ చేశారు.

ప్రభాస్, నాగ్ అశ్విన్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలకి థ్యాంక్స్ చెప్పడంతో ఈ ఇద్దరు నటులు సినిమాలో ఉన్నారని అప్పటికే అందరికి తెలిసిపోయింది. విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించగా, దుల్కర్ సల్మాన్ మరో కీలక పాత్రలో మెరిశారు. అయితే దుల్కర్ పాత్ర ఆ విధంగా ఉంటుందని అసలు ఎవరు ఉహించలేదు. అలాగే ఆ పాత్రపై ప్రేక్షకుల్లో కొంత అనుమానం కలిగింది.

ఇక ఆ అనుమానం సరైనదే అని సినిమా చూసిన తర్వాత తెలుస్తోంది. ఎందుకంటే, 'కల్కి' రాబోయే భాగాల్లో దుల్కర్ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందనేది టాక్. సినిమాలో చిన్నప్పుడు ప్రభాస్ పాత్రను పెంచిన పైలెట్ పాత్రలో దుల్కర్ నటించారు. ఈ క్యారెక్టర్ ప్రభాస్‌కి ఫైట్స్, జీవితపాఠాలు నేర్పించడం వంటివి చేయడంతో, ఈ పాత్రకు ముందు కూడా కథలో కీలకమైన విషయం ఉంటుందని తెలుస్తోంది.

ఇక మహాభారతంలోని పాత్రలను మళ్లీ పుట్టినట్లు కల్కిలో చూపించడంతో, దుల్కర్ సల్మాన్ కూడా పరశురాముడి పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్. పరశురాముడు చిరంజీవులలో ఒకడిగా ఉంటాడు. అయితే కల్కి పురాణం ప్రకారం, కల్కి అవతారానికి యుద్ధ విద్యలు నేర్పిన గురువు కూడా పరశురాముడే. దీన్ని బట్టి, ప్రభాస్ పాత్రకు విద్యలు నేర్పిన దుల్కర్ పాత్ర, పరశురాముడిగా మళ్లీ పుట్టినట్లు ఊహాగానాలు ఉన్నాయి.

ఇలా అయితే, భవిష్యత్తులో వచ్చే 'కల్కి' పార్ట్ 2లో, దుల్కర్ సల్మాన్ పాత్ర మరింత విస్తృతంగా చూపించబడే అవకాశం ఉంది. ఈ విషయాలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. కానీ ఇవి కేవలం ఊహాగానాలే. నిజంగా దుల్కర్ పరశురాముడిగా కనిపిస్తారో లేదో తెలుసుకోవాలంటే పార్ట్ 2 వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఇది ఈ ఊహాగానాలు నిజమైతే, 'కల్కి' సినిమా మరింత ఆసక్తికరంగా, మారుతుంది.

Tags:    

Similar News