రావిపూడికి పోటీగా రాజుగారు.. క్లాష్ తప్పట్లేదుగా?
అయితే ఈసారి అనిల్ రావిపూడి దిల్ రాజుతో కలిసి పని చేయడం లేదు.
సంక్రాంతి టైమ్ లో కంటెంట్ ఉన్న సినిమాలు కాస్త క్లిక్కయినా కాసుల వర్షం కురిపిస్తాయని ఇటీవల వెంకీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రుజువైంది. ఇక 2026 సంక్రాంతికి మరో ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరు జరుగనున్నట్లు కనిపిస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ హిట్ అందుకున్న దిల్ రాజు మరోసారి సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో అనిల్ రావిపూడి కూడా తన కొత్త ప్రాజెక్ట్‌ను సంక్రాంతికి తీసుకురాబోతున్నారు. అయితే ఈసారి అనిల్ రావిపూడి దిల్ రాజుతో కలిసి పని చేయడం లేదు.
అనిల్, మెగాస్టార్ చిరంజీవితో భారీ సినిమాను రూపొందిస్తుండగా, దీనికి నిర్మాతలుగా సాహు గారపాటి, కొణిదెల సుష్మిత వ్యవహరిస్తున్నారు. అనిల్ రావిపూడి గతంలో ఎక్కువ సినిమాలు దిల్ రాజు నిర్మాణ సంస్థలోనే చేశారు. ‘పటాస్’ తర్వాత వచ్చిన ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి సినిమాలు కూడా దిల్ రాజు బ్యానర్‌లోనే తెరకెక్కాయి. అయితే ఈసారి అనిల్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు దిల్ రాజు కాకుండా ఇతర నిర్మాతలను ఎంచుకున్నారు.
మెగాస్టార్‌తో అనిల్ రావిపూడి మాస్, కామెడీ, ఎమోషన్ ఎలిమెంట్స్ తో ఓ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. చిరంజీవికి అనిల్ మేకింగ్ విధానం చాలా కొత్తగా అనిపించనుంది. ఇక దిల్ రాజు పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో సంక్రాంతికి సిద్ధమవుతున్నారు. శతమానం భవతి సినిమా సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అయితే ఈ సినిమాను ఒరిజినల్ డైరెక్టర్ సతీష్ వేగేశ్నతోనే చేయిస్తారా? లేక మరొకరిని తీసుకొస్తారా? అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 2017లో విడుదలైన శతమానం భవతి సినిమా సంక్రాంతి బరిలో నిలిచి బిగ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కుటుంబ బంధాలు, గ్రామీణ నేపథ్యాన్ని హార్ట్ టచింగ్‌గా చూపించిన ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌తో మరోసారి ప్రేక్షకుల మనసులను గెలుచుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దిల్ రాజు సినిమాలు సాధారణంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తాయి. అయితే ఈసారి చిరంజీవి - అనిల్ రావిపూడి ప్రాజెక్ట్, దిల్ రాజు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎదురెదురుగా నిలుస్తాయన్న మాట. ఒకవైపు మాస్, కామెడీ, ఎమోషన్‌తో కూడిన చిరంజీవి సినిమా.. మరోవైపు కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఇచ్చే దిల్ రాజు సినిమా సంక్రాంతికి పోటీ పడబోతున్నాయి. మొత్తానికి 2026 సంక్రాంతికి ఈ ఇద్దరూ వేర్వేరు ఆయుధాలతో బాక్సాఫీస్‌ను కదిలించబోతున్నారు. మరి ఈ క్లాష్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.