భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని బడ్జెట్?
ఆదిత్య చోప్రా అండ్ టీమ్ టైగర్ వర్సెస్ పఠాన్ బడ్జెట్‌ను 600 కోట్ల మేర ఫిక్స్ చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
భారతీయ సినీపరిశ్రమల్లో 1000కోట్ల క్లబ్ ఇప్పుడు పాత మాట. బాహుబలి 2- దంగల్- కేజీఎఫ్ 2, పఠాన్ లాంటి చిత్రాలు ఈ అరుదైన ఫీట్ ని అందుకున్నాయి. జవాన్ 1000 కోట్ల క్లబ్ వైపు పయనిస్తోందన్న టాక్ ఉంది. మునుముందు 1000కోట్ల క్లబ్ లో చేరే సత్తా ఉన్న చిత్రాలు విడుదలకు వస్తున్నాయి. అయితే ఇవన్నీ 350 కోట్ల లోపు బడ్జెట్లతో తెరకెక్కిన సినిమాలు. కానీ ఇప్పుడు వీటన్నిటినీ తలదన్నేలా ఏకంగా 500-600 కోట్ల మధ్య బడ్జెట్ తో అత్యంత భారీ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.
ఈ సినిమా బాలీవుడ్ లో తెరకెక్కనుంది. బాలీవుడ్‌లో ఇటీవల అంతా సవ్యంగా కనిపిస్తోంది. హిందీ చిత్రాలు పెద్ద ఫ్లాప్‌లుగా మారకుండా బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు రాణిస్తున్నాయి. పోగొట్టుకున్న పూర్వవైభవాన్ని తిరిగి తెస్తున్నాయి. నిజానికి జవాన్- పఠాన్- భూల్ భూలయ్యా 2 వంటి చిత్రాలు తమ విజయాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పరిశ్రమలో ఎంతో ఉత్సాహం నింపింది. 2023లోనే మోస్ట్ అవైటెడ్ జాబితాలో కొన్ని భారీ చిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా YRF గూఢచారి విశ్వం నుండి వస్తున్న - టైగర్ Vs పఠాన్ ఇందులో ఒకటి.
టైగర్, వార్, పఠాన్ అనే మూడు ప్రధాన ఫ్రాంచైజీలను కలిపి గూఢచారి విశ్వాన్ని సృష్టించేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తోందనేది మనకు తెలుసు. వీటిలో ముగ్గురు ప్రముఖ హీరోలు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారూక్ ఖాన్ వరుసగా కథానాయకులు. ఇప్పుడు వీటన్నిటినీ మించి ' టైగర్ వర్సెస్ పఠాన్' మల్టీస్టారర్ తెరకెక్కనుంది. బాలీవుడ్‌లోని ఇద్దరు సూపర్‌స్టార్లు ఒకరికొకరు ఒకరు పోటా పోటీగా నిలిచే చిత్రమిది. ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటి వరకు చాలా విషయాలు వెల్లడి కాలేదు. బహుశా అభిమానులలో క్యూరియాసిటీని కొనసాగించే ఇతర విషయాలు ఉన్నాయి. వాటిలో బడ్జెట్ అత్యంత ప్రధానమైనది.
ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కనుంది. బడ్జెట్ ఆకాశమంత ఎత్తులో ఉంటుందని తాజాగా యష్ రాజ్ బ్యానర్ ప్రతినిధుల నుంచి లీకులు అందాయి. ఆదిత్య చోప్రా అండ్ టీమ్ టైగర్ వర్సెస్ పఠాన్ బడ్జెట్‌ను 600 కోట్ల మేర ఫిక్స్ చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో సుమారు 300 కోట్ల వరకూ ఇద్దరు హీరోలకు సమంగా పంచే అవకాశం ఉంది. మిగిలిన 300 కోట్లతో సరైన ఉత్పత్తిని అందించాలనేది ప్లాన్. ఇద్దరు అగ్ర హీరోలు లాభాల్లో వాటాను కూడా తీసుకుంటారు. సినిమా విషయానికొస్తే.. అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ అయింది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది మార్చిలో షూటింగ్ ని ప్రారంభించవచ్చని తెలుస్తోంది.
2.0 బడ్జెట్ ని మించి..?
భారతీయ సినిమా చరిత్రలో 350కోట్ల బడ్జెట్ తో సినిమాలు నిర్మించడం రెగ్యులర్ గా చూస్తున్నాం. మారిన ట్రెండ్ లో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టే వ్యూహంతో మన నిర్మాతలు అతి భారీ బడ్జెట్లతో సాహసాలు చేస్తున్నారు. ఇంతకుముందు సూపర్ స్టార్ రజనీకాంత్ - ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన 2.0 చిత్రానికి లైకా ప్రొడక్షన్స్ దాదాపు 500 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేసిందని ప్రచారమైంది. కానీ ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది.
భారీ వసూళ్లను సాధించినా కానీ, అధిక బడ్జెట్ వల్ల సినిమా పరాజయం పాలైంది. ప్రస్తుతం వైజయంతి మూవీస్ పతాకంపై ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే కోసం 400 కోట్ల మేర బడ్జెట్ ని కేటాయించారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన ఆదిపురుష్ చిత్రానికి 350కోట్లు మించి ఖర్చు చేసారని ప్రచారం ఉంది. కానీ ఇది ఫ్లాపైంది. ఇప్పుడు వీటన్నిటినీ మించి యష్ రాజ్ ఫిలింస్ సంస్థ టైగర్ వర్సెస్ పఠాన్ కోసం అత్యంత భారీ బడ్జెట్ ని కేటాయించడం ఆసక్తిని కలిగిస్తోంది.