16 రోజుల్లో 'గేమ్ ఛేంజ‌ర్' వ‌సూళ్లు

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం `గేమ్ ఛేంజ‌ర్` మిశ్ర‌మ స‌మీక్ష‌ల‌తో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

Update: 2025-01-27 06:00 GMT

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం `గేమ్ ఛేంజ‌ర్` మిశ్ర‌మ స‌మీక్ష‌ల‌తో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ త‌న స్థాయికి త‌గ్గ సినిమా తీయ‌లేద‌ని విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొన్నారు. అయినా రామ్ చ‌ర‌ణ్ స్టార్ ప‌వ‌ర్, అద్భుత న‌ట‌న‌ కార‌ణంగా ఈ చిత్రం భారీగా ఓపెనింగ్ డే వ‌సూళ్ల‌ను సాధించింది. మొద‌టి రోజు 50 కోట్ల క‌లెక్ష‌న్లు క‌లుపుకుని, ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రం 184కోట్ల మేర గ్రాస్ వ‌సూలు చేసింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

16 రోజుల్లో `గేమ్ ఛేంజర్` ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం రూ.154 కోట్లు వసూలు చేసింది. విదేశాల నుంచి మ‌రో 30 కోట్లు వ‌సూలైంది. గేమ్ ఛేంజ‌ర్ ప్రారంభ రోజున రూ.51 కోట్లు వసూలు చేయ‌గా, నెగెటివ్ స‌మీక్ష‌ల కార‌ణంగా వ‌సూళ్లు అనూహ్యంగా త‌గ్గిపోయాయని ట్రేడ్ విశ్లేషించింది. థియేటర్లలో మరో వారం మనుగడ సాగించడానికి తెలుగు - హిందీపై ఆధార‌ప‌డింది. త‌మిళ‌నాడులో ఆశించిన వ‌సూళ్లు ద‌క్క‌లేదని ట్రేడ్ చెబుతోంది. ప్ర‌ఖ్యాత‌ సాక్ నిల్క్ క‌థ‌నం ప్రకారం.. గేమ్ ఛేంజర్ 16వ రోజున‌ తెలుగులో 16ల‌క్ష‌లు, హిందీలో 7 ల‌క్ష‌లు ఆర్జించింది. ఈ చిత్రం శనివారం 24ల‌క్ష‌లు వసూలు చేసింది.

గేమ్ ఛేంజర్ చిత్రం 16 రోజుల్లో దేశీ బాక్సాఫీస్ వద్ద రూ.129.34 కోట్ల నెట్ వసూలు చేయగా, దాని నెట్ కలెక్షన్ రూ.153.92 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింద‌ని స‌మాచారం. దీనిలో తెలుగు వ‌సూళ్లు మొత్తం రూ.87.9 కోట్లు కాగా, హిందీలో ఈ చిత్రం రూ.32.57 కోట్లు ఆర్జించింది. ఈ చిత్రం తమిళంలో రూ.8.27 కోట్లు వసూలు చేసింది. మలయాళం, కన్నడలో 16రోజుల‌లో కోటి లోపు వ‌సూలు చేసింద‌ని స‌మాచారం. 16వ రోజు నాటికి, గేమ్ ఛేంజర్ ప్రపంచవ్యాప్తంగా రూ.184.17 కోట్లు వ‌సూలు చేసింది. ఇప్ప‌టికి తెలుగు, హిందీలో ఆడుతోంది. 200 కోట్ల క్ల‌బ్ లో చేరుతుందా లేదా? అంటే వ‌సూళ్లు అనూహ్యంగా పెర‌గాల్సి ఉంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

గేమ్ ఛేంజర్ సినిమా తొలి రోజు అంటే జనవరి 10న రూ.186 కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇవి ఫేక్ క‌లెక్ష‌న్స్ అంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే సాక్ నిల్క్ ప్రకారం.. విదేశాల నుంచి రూ.30.25 కోట్లు వసూలు చేసింది. గేమ్ ఛేంజ‌ర్ నిర్మాత దిల్ రాజు ఇల్లు ఆఫీస్ కార్యాల‌యాల‌పై ఐటీ దాడుల గురించి తెలిసిందే. ఐటీ సోదాలు రెగ్యుల‌ర్ గా జ‌రిగేవేన‌ని, అన్ని లెక్క‌లు అప్ప‌జెప్పామ‌ని దిల్ రాజు మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు.

Tags:    

Similar News