రీ-రిలీజ్ లో రికార్డు సృష్టించిన ఒకే ఒక్కడు!
మరి రీ-రిలీజ్ లో రికార్డు సృష్టించిన హీరో ఎవరు? అంటే మాత్రం ఆ ఘనత తలపతి విజయ్ కే దక్కుతుంది
టాలీవుడ్ లో మొదలైన రీ-రిలీజ్ ల ట్రెండ్ ఏ స్థాయికి చేరిందో చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలంతా తమ పాత్రల్ని ఏదో అకేషన్ సందర్భంగా రిలీజ్ చేస్తూ అభిమానులు ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు తెలుగు స్టార్ హీరోలంతా తమ సినిమాల్నీ రిలీజ్ చేసారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు మంచి ఫలితాలే సాధించాయి. చిరంజీవి.. బాలయ్య..పవన్ కళ్యాణ్..మహేష్..ఎన్టీఆర్.. ప్రభాస్..బన్నీ అంతా రీ-రిలీజ్ లు అయిన స్టార్లే. ఇంకా టైర్ -2 హీరోలు కూడా తమ సినిమాల్నీ రీ-రిలీజ్ చేసిన వారు ఉన్నారు.
మరి రీ-రిలీజ్ లో రికార్డు సృష్టించిన హీరో ఎవరు? అంటే మాత్రం ఆ ఘనత తలపతి విజయ్ కే దక్కుతుంది. ఇండియాలో రీ-రిలీజ్ ద్వారా భారీ వసూళ్లు సాధించిన హీరో అతనొక్కడే. టాలీవుడ్ రీ-రిలీజ్ ట్రెండ్ కొన్ని నెలల క్రితం కోలీవుడ్ లోనూ మొదలైంది. మనోళ్లని చూసే తంబీలు సైతం రీ-రిలీజ్ బాట పట్టారు. అలా విజయ్ నటించిన పాత చిత్రం `గిల్లీ` కూడా 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రీ- రిలీజ్ అయింది. ఈ సినిమా రీ-రిలీజ్ లో సైతం 23 కోట్ల వసూళ్లను సాధించింది.
ఈ రేంజ్ వసూళ్లను రీ-రిలీజ్ పరంగా ఏ హీరోకి ఇంతవరకూ దక్కలేదు. తెలుగు హీరోలు కూడా ఆ లెక్క దరిదాపుల్లో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఇండియాలో రీ-రిలీజ్ లో కూడా ట్రెండ్ సెట్టర్ అయింది విజయ్. అంతకు ముందు కోలీవుడ్ నుంచి రజనీకాంత్ నటించిన `బాబా`..ప్రభుదేవా నటించిన `ప్రేమికుడు` కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఇవేవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. త్వరలో కమల్ హాసన్ నటించిన `భారతీయుడు` కూడా రీ-రిలీజ్ అవుతుంది.
`ఇండియన్ -2` జులై 12 న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మొదటి భాగాన్ని 4కె పార్మెట్ లో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే `శివాజీ`, `బిల్లా` చిత్రాలు కూడా రీ-రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇవి గనుక సక్సెస్ అయితే మరిన్ని రీ-రిలీజ్ లు క్యూ కట్టడం ఖాయం.