ఏడాదిలో 777 సినిమాలు చూశాడు... ఉద్దేశ్యం గొప్పదే!

అవును... వారానికి ఒకటి రెండు సినిమాలూ చూడటమే గగనం అయిపోయిన ప్రస్తుత బిజీ జీవితాల్లో... ఏడాదిలో 777 సినిమాలు చూశాడూ ఒక వ్యక్తి

Update: 2023-09-20 05:02 GMT

కొంతమంది కావాలని కొన్ని రికార్డులు సృష్టిస్తుంటారు. వాటిలో కొన్ని కేవలం వారి ఆనందం కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో మాత్రమే కాకుండా... అందులో కాస్త సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఈ క్రమంలో ఇలాంటి రికార్డే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆపకుండా సినిమాలు చూసి ఆటిజం అవగాహన కల్పించాలని భావించాడు ఒక వ్యక్తి!

అవును... వారానికి ఒకటి రెండు సినిమాలూ చూడటమే గగనం అయిపోయిన ప్రస్తుత బిజీ జీవితాల్లో... ఏడాదిలో 777 సినిమాలు చూశాడూ ఒక వ్యక్తి. దీంతో పాతరికార్డులన్నీ చెరిపేసి సరికొత్త రికార్డును సృష్టించాడు. అయితే ఇది కేవలం సినిమాలంటే తనకున్న ఇష్టం మాత్రమే ఇందుకు కారణం కాదని చెబుతూ.. దాని వెనుకున్న అసలు కారణాన్ని చెప్పాడు.

వివరాళ్లోకి వెళ్తే... అమెరికాకు చెందిన జాక్ స్వోప్‌ (32)కు సినిమాలు అంటే ఎంతో ఇష్టం. దీంతో ఆ ఇష్టంతోనే వరల్డ్‌ రికార్డు సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఒక వైపు జాబ్ చేసుకుంటూనే ఈ ప్రపంచ రికార్డ్పై దృష్టి సారించాడు. ఇందులో భాగంగా ఉదయం 6.45 నుంచి మధ్యాహ్నం 2.45 దాకా ఆఫీసుకు వెళ్లడం.. అనంతరం డైలీ కనీసం మూడు సినిమాలు చూడటం చేసేవాడు.

ఇక హాలిడేస్ లోనూ, వీకెండ్స్ లోనూ అయితే చెప్పే పనేలేదు. ఆ నెంబర్ డబుల్ అయిపోయేది. కనీసం ఐదారు సినిమాలు చూసేవాడు. ఇలా అవిరామంగా సాగిన సినిమాలు చూడటం ఏడాది పూర్తయ్యే సరికి 777 కి చేరుకుంది. మే 2022 నుంచి - మే 2023 పూర్తయే సరికి ఏకంగా 777 సినిమాలు చూశాడు జాక్ స్వోప్!

ఇందులో భాగంగా... మే 2022న మొదటగా "మిలియన్స్‌: రైజ్‌ ఆఫ్ గ్రూ" అనే సినిమాతో ప్రారంభించి, మే 2023 న "ఇండియానా జోన్స్‌ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ"తో పూర్తి చేశాడు. దీంతో ప్రపంచంలోనే ఏడాది కాలంలో అత్యధిక సినిమాలు (777) చూసిన వ్యక్తిగా గిన్నిస్‌ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఈ సమయంలో ఈ రికార్డ్ పై స్పందించిన జాక్‌ స్వోప్‌... ఆటిజంపై అవగాహన పెంచడం కోసం ఈ పని చేసినట్లు తెలిపాడు. తాను ఆటిజం కారణంగా గతంలో ఆత్మహత్యాయత్నం చేశానని.. కానీ అది సరికాదని తెలుసుకున్నానని.. దాని నుంచి బయటపడడం కోసం సినిమాలు చూడడం ప్రారంభించి రికార్డు సాధించాలనుకున్నా అని.. తెలిపాడు.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... ఈ రికార్డును క్రియేట్‌ చేయడం కోసం స్వోప్‌ కొన్ని రూల్స్ ని పాటించాడు. సినిమా చూస్తున్నత సేపు ఆ పని తప్ప మరోపని చేయకూడదని ఫిక్సయ్యాడు. ఉదాహరణకు ఫోన్ చూడటం, నిద్రపోవడం తోపాటు తినడం, తాగడం వంటివి కూడ్దా స్వోప్ చేయలేదు.

దీంతో ఇంత స్ట్రిక్ట్ గా నిబంధనలన్నీ పాటించాడని నిర్ధారణ చేసుకున్న తర్వాతే గిన్నిస్‌ యాజమాన్యం జాక్‌ పేరును ఈ రికార్డ్ నమోదు చేసింది. ఇక గతంలో ఈ రికార్డు ఫ్రాన్స్‌ కు చెందిన విన్సెంట్‌ క్రోన్‌ అనే వ్యక్తి పేరు మీద ఉండేది. అతడు ఏడాదిలో 715 సినిమాలు చూసి ఈ రికార్డును సృష్టించాడు. అయితే భవిష్యత్తులో ఏడాదికి 800 సినిమాలు చూసి తన రికార్డును తానే తిరగరాయాలని భావిస్తున్నట్లు జాక్ చెప్పడం గమనార్హం.

అయితే ఆటిజంపై అవగాహన పెంచడం కోసం, ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఈ పని చేసినందుకు గానూ... అమెరికాలోని ఆత్మహత్య నివారణ సంస్థ జాక్‌ స్వోప్‌ కు 7,777.77 డాలర్లను (సుమారూ రూ.6 లక్షలు) బహుమతిగా ఇచ్చింది.

Tags:    

Similar News