'గుంటూరు కారం' బ్లాక్ బస్టర్ కాకపోవచ్చు.. కానీ: VK నరేష్
లాంగ్ గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ సినిమాపై ఆసక్తి నెలకొంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజ్ కు ముందు ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసుకుంది. లాంగ్ గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే రిలీజ్ తర్వాత సినిమాకి ఆశించిన రెస్పాన్స్ రాలేదు.
ఫ్యామిలీ ఆడియన్స్, మహేష్ ఫ్యాన్స్ ని తప్పితే మిగతా ఆడియెన్స్ లో అంచనాలు ఆదుకోవడంలో తడబడినట్లు కథనాలు వచ్చాయి. ఇక మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. సినిమాలో మహేష్ మాస్ లుక్, క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, డాన్స్.. అన్ని ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే, టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా ఇప్పటికే 200 కోట్లకి పైగా గ్రాస్ అందుకొని అత్యధిక కలెక్షన్స్ అందుకున్న రీజనల్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే గుంటూరు కారం రిజల్ట్ పై సీనియర్ నటుడు VK నరేష్ తాజా ఇంటర్వ్యూలో స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు." గుంటూరు కారం మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అది సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ కాకపోవచ్చు. కొంతమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వొచ్చు. కానీ మహేష్ జయాపజయాలకు అతీతం. అతను సూపర్ యాక్టర్. అతన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడతారు.
సినిమా అన్నాక హిట్, ప్లాప్స్ అనేవి సహజం. మహేష్ వాటన్నింటినీ దాటి వెళ్లిపోయాడని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. అది వరల్డ్ వైడ్ పెద్ద సంచలనం అవుతుందని నమ్ముతున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. దీంతో నరేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. కాగా మహేష్ బాబు ప్రెజెంట్ జర్మనీ టూర్ లో ఉన్నారు.
రాజమౌళి సినిమా కోసం ఫిట్నెస్ పై దృష్టి సారించేందుకు జర్మనీలోని ప్రముఖ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ సినిమా కోసం మహేష్ రెండు సంవత్సరాలు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ పనులు పూర్తయిపోయాయి. ఇదే ఏడాది ఏప్రిల్ నెలలో ఉగాది పండుగ రోజున సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు.