సందీప్ వంగా.. అతనిపై ఎంత నమ్మకమో..
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. తీసింది మూడు సినిమాలే అయినా.. మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు సొంతం చేసుకున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ దక్కించుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ నుంచే ఆ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇప్పటికే స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన సందీప్ వంగా.. త్వరలోనే షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఇటీవల మ్యూజిక్ వర్క్స్ ను కూడా స్టార్ట్ చేశారు. దీపావళి రోజు సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలిసి చేసిన మ్యూజిక్ సిట్టింగ్స్ వీడియోను షేర్ చేశారు. ఆ తర్వాత తమిళనాడులోని మహాబలిపురంలో వీరిద్దరూ కలిసి దిగిన పిక్ వైరల్ గా మారగా.. మంచి మ్యూజిక్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేశారు.
అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ విషయం వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు సందీప్ రెడ్డి తీసిన మూడు సినిమాలకు కూడా హర్షవర్ధన్ రామేశ్వరే సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు. మూడింటికీ అదిరిపోయే అవుట్ పుట్ అందించారు. యానిమల్ సినిమాకు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు స్పిరిట్ సినిమా కూడా ఆయనే వర్క్ చేస్తుండడంతో నెటిజన్లు, సినీ ప్రియులు స్పందిస్తున్నారు.
ప్రజెంట్ భారీ సినిమాల టైటిల్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్, దేవిశ్రీ ప్రసాద్, ఎస్ ఎస్ తమన్ లో ఎవరో ఒకరి పేరు కనిపిస్తుంది. అనౌన్స్మెంట్ అప్పుడే మేకర్స్ వారి పేరును ప్రకటించి సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. కానీ సందీప్ రెడ్డి వంగా మాత్రం.. ఇప్పుడు భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్పిరిట్ కు కూడా హర్షవర్ధన్ రామేశ్వర్ నే ఎంచుకున్నారు. దీంతో ఆయన తప్ప ఇంకెవరితో వర్క్ చేయరా అని అడుగుతున్నారు.
నిజానికి హర్షవర్షన్ రామేశ్వర్ టాలెంట్ ను తక్కువ అంచనా వేయక్కర్లేదు. సందీప్ మూవీస్ కాకుండా.. ఎన్నో సినిమాలకు వర్క్ చేశారు. సాక్ష్యం, డెవిల్ వంటి చిత్రాలకు అదిరిపోయే అవుట్ పుట్ అందించారు. వంగా మూవీస్ కు అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఓ రేంజ్ లో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అందుకే ఇప్పుడు స్పిరిట్ కోసం సందీప్.. ఆయననే ఎంచుకున్నారేమో. అదే సమయంలో వారి బాండింగ్ కూడా క్లియర్ గా తెలుస్తోంది.