10 మంది సౌత్ డైరెక్టర్లను కలిసాడు
అతడు దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అగ్ర దర్శకులతో కలిసి పనిచేయడానికి ప్లాన్ చేస్తున్నాడనేది తాజా సమాచారం.
కరణ్ జోహార్ దర్శకత్వం వహించి నిర్మించిన `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ`లో చివరిగా కనిపించిన రణ్‌వీర్ సింగ్ 2024లో సంజయ్ లీలా భన్సాలీ `బైజు బావ్రా` షూటింగ్‌ని ప్రారంభించాల్సి ఉంది. కానీ ఆ చిత్రం చివరికి వాయిదా పడింది. రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ నటించే తన తదుపరి చిత్రాన్ని ఇప్పుడు భన్సాలీ ప్రకటించారు. ఇంతలోనే రణవీర్ సింగ్ ప్లాన్ బిని అమలు చేసాడు. అతడు దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అగ్ర దర్శకులతో కలిసి పనిచేయడానికి ప్లాన్ చేస్తున్నాడనేది తాజా సమాచారం.
వాస్తవానికి ఇదివరకే చాలా మంది సౌత్ దర్శకులతో రణవీర్ సంభాషణలను ప్రారంభించాడు. అతడి కోసం `అట్లీ` జాబితాలో అగ్రస్థానంలో ఉన్నట్లు కథనాలొస్తున్నాయి. జవాన్ దర్శకుడు అట్లీతో రణవీర్ చాలాసార్లు ఫోన్ కాల్ లో మాట్లాడాడు. రానున్న వారాల్లో రణ్‌వీర్ సింగ్‌ను కలుస్తానని, కలిసి పని చేయడం గురించి చర్చిస్తానని అట్లీ హామీ ఇచ్చారని సమాచారం. రణ్‌వీర్ నెల్సన్ దిలీప్ కుమార్ ను కూడా రెండుసార్లు కలిశాడు. అయితే దిలీప్ కుమార్ తన హిందీ చలనచిత్ర అరంగేట్రం గురించి నిర్ణయించే ముందు `జైలర్ 2` చిత్రాన్ని రూపొందించాలని చూస్తున్నాడు. ఇంతలోనే గజినీ-హాలిడే చిత్రాలతో పాపులరైన AR మురుగదాస్ ఇటీవల రణవీర్ సింగ్‌ను కలుసుకుని అతడికి ఒక యాక్షన్ ఫిల్మ్ స్క్రిప్టును వినిపించాడని తెలుస్తోంది. రణవీర్‌కు ఆ సబ్జెక్ట్ నచ్చింది. అయితే మరిన్ని సమావేశాలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే రణవీర్ తన తదుపరి నిర్ణయం తీసుకుంటాడు. అతడు ప్రస్తుతానికి మురుగదాస్ ఆలోచనను మెచ్చుకున్నాడు. పక్షం రోజుల్లో మురుగదాస్‌తో మళ్లీ కలుస్తాడు.
హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మను రణ్‌వీర్ సింగ్ కలవనున్నాడని కథనాలొస్తున్నాయి. అయితే ప్రశాంత్ `జై హనుమాన్` సినిమా కోసం రణవీర్ ని సంప్రదిస్తున్నాడా లేదా అనే దానిపై వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో అతిధి పాత్ర గురించి చర్చించడానికి లోకేష్ కనగరాజ్‌ను కూడా రణవీర్ కలిశాడు.
సోనీ పిక్చర్స్ ఇండియాతో కలిసి `శక్తిమాన్` కోసం పని చేస్తున్న బాసిల్ జోసెఫ్‌ను కూడా రణవీర్ కలుస్తారని తెలిసింది. రణ్ వీర్ టైటిల్ పాత్రలో నటించే ఈ సినిమాను 2025 ద్వితీయార్థంలో ప్రారంభించాలని అనుకుంటున్నారు. కొత్త కథ గురించి ఆలోచించేందుకు జయంతిలాల్ గడా, శంకర్‌లతో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఒక రూమర్ ప్రకారం రణవీర్ తెలుగు అగ్ర దర్శకుడితో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి రోహిత్ శెట్టి `సింగం ఎగైన్`లో నటిస్తున్నాడు. తన సింబా పాత్రతో తిరిగి వస్తాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 10 మంది దక్షిణాది దర్శకులను కలిసాడు రణవీర్. చూస్తుంటే పాన్ ఇండియాలో గట్టిగా కొట్టాలనే కసి అతడిలో కనిపిస్తోంది. దీనికోసం సౌత్ డైరెక్టర్లే కరెక్ట్ అని భావిస్తున్నాడు.