కొన్నిసార్లు అంచనాలకు భయపడతాన‌న్న హిరాణీ

అయితే ఆరంభం క్రిటిక్స్ డంకీ సినిమా యావ‌రేజ్ అంటూ మార్క్ చేయ‌డం హిరాణీని నిరాశ‌ప‌రిచింది.

Update: 2023-12-30 06:55 GMT

ఈ క్రిస్మ‌స్ బ‌రిలో స‌లార్ వ‌ర్సెస్ డంకీ వార్ గురించి తెలిసిందే. తొలి నుంచి డంకీపై మాస్ యాక్ష‌న్ సినిమా స‌లార్ డామినేష‌న్ కొన‌సాగుతుంద‌ని అభిమానులు అంచ‌నా వేసారు. దానికి త‌గ్గ‌ట్టే స‌లార్ హ‌వా బాక్సాఫీస్ వ‌ద్ద కొన‌సాగింది. అయితే రాజ్ కుమార్ హిరాణీ రూపొందించిన డంకీ వ‌సూళ్లు తీసిక‌ట్టుగా ఏం లేవు. కేవ‌లం 80 కోట్ల బ‌డ్జెట్ (స్టార్ల పారితోషికాలు మిన‌హా) రూపొందించిన ఈ చిత్రం ఇప్ప‌టికే 300 కోట్లు వ‌సూలు చేసింది.

అయితే ఆరంభం క్రిటిక్స్ డంకీ సినిమా యావ‌రేజ్ అంటూ మార్క్ చేయ‌డం హిరాణీని నిరాశ‌ప‌రిచింది. విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు రావడంతో రాజ్ కుమార్ హిరాణీ ఖంగు తిన్నారు. అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమా మంచి వసూళ్లను సాధించ‌గా, ఇండియాలోను ఫ‌ర్వాలేద‌నిపించే వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోద‌గ్గ‌ వసూళ్లు రాబట్టింది. ఇటీవలి ఇంటర్వ్యూలో హిరాణీ మాట్లాడుతూ తాను కొన్నిసార్లు అంచనాలకు భయపడతానని అన్నారు.

రాజ్‌కుమార్ హిరాణీ మాట్లాడుతూ ``అంచనాలు ఎప్పుడూ ఉంటాయి. నేను కొన్నిసార్లు వాటికి భయపడతాను. గతంలో నేను చేసిన సినిమాలే చేయాలని జనాలు కోరుకుంటున్నారు. నేను మున్నాభాయ్ MBBS నుండి 3 ఇడియట్స్ నుండి PK నుండి సంజు వరకు ఇప్పుడు డంకీ వరకు విభిన్నమైన శైలి చిత్రాల‌ను రూపొందించడానికి ప్రయత్నించాను`` అని అన్నారు. డంకీ ప్రతిస్పందనతో నేను సంతోషంగా ఉన్నాను. మరికొందరు మాస్ సినిమాలు చేస్తున్న ఈ తరుణంలో డంకీ లాంటి కంటెంట్, మంచి క‌థ ఉన్న‌ చిత్రం చేయడానికి నేను ధైర్యంగా ముందుకొచ్చాను అని అన్నారు. ఇలా చేయ‌డం నాకు నిజంగా సంతోషాన్నిచ్చింది! అని హిరాణీ వ్యాఖ్యానించారు. షారూఖ్ ఖాన్ - రాజ్‌కుమార్ హిరానీల కలయికలో వచ్చిన మొదటి చిత్రం చ‌క్క‌ని విజ‌యం సాధించింది. 2023లో ప‌ఠాన్- జ‌వాన్ త‌ర్వాత ఖాన్ మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. స‌లార్ తో రాజ్ కుమార్ హిరాణీ డంకీని పోల్చ‌డం స‌రికాద‌న్న అభిప్రాయం కొంద‌రిలో ఉంది.

Tags:    

Similar News