టాక్సిక్‌లో హాలీవుడ్ స్టైల్ యాక్షన్.. వ్వాటే ప్లాన్
జే.జే. పెర్రీ గురించి చెప్పుకుంటే, "జాన్ విక్", "ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్" వంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల కోసం వర్క్ చేశారు.
కన్నడ స్టార్ హీరో యష్ క్రేజ్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్న యష్.. కేజీఎఫ్ 2 సక్సెస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ రెండు సినిమాలు అతనిని దేశంలోని ప్రముఖ స్టార్లలో ఒకరిగా మార్చేసాయి.
కాగా, ఇప్పుడు యష్ "టాక్సిక్" అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రముఖ మలయాళ నటి, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న టాక్సిక్ మొదటి నుంచి పాన్ ఇండియా మార్కెట్ లో హాట్ టాపిక్ గా నిలిస్తోంది.
ఈ సినిమా కోసం యష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తెచ్చేలా హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జే.జే. పెర్రీ టీమ్‌లో చేరడం మరింత హైప్ క్రియేట్ చేసింది. ఆయన ముంబై విమానాశ్రయంలో కనిపించడంతో టాక్సీక్ హంగామా మరింత పెరిగింది. జే.జే. పెర్రీ గురించి చెప్పుకుంటే, "జాన్ విక్", "ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్" వంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల కోసం వర్క్ చేశారు.
యాక్షన్ సన్నివేశాలను రియాలిస్టిక్‌గా, శక్తివంతంగా రూపొందించడంలో ఆయనకు అనుభవం ఉంది. టాక్సిక్ చిత్రంలో యష్‌కు తోడుగా ఈయన ఉండటంతో ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేలా ఉండబోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ప్రకారం, ప్రస్తుతం ముంబైలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ యాక్షన్ పార్ట్ కోసం ప్రత్యేకంగా ఒక భారీ సెట్ ఏర్పాటు చేశారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని, ఉత్కంఠను కలిగించేందుకు డిజైన్ చేయబడుతున్నాయట. జే.జే. పెర్రీ అనుభవం ఈ సన్నివేశాలకు అత్యున్నత స్థాయి యాక్షన్‌ను తెచ్చి పెట్టనుందని సమాచారం. "టాక్సిక్" చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ హాలీవుడ్ స్థాయి యాక్షన్ సమర్పణతో టాక్సిక్ చిత్రం పాన్ ఇండియా ప్రేక్షకుల కోసం ఒక భారీ విజువల్ ట్రీట్‌గా రాబోతుందని చిత్రబృందం నమ్మకంగా ఉన్నది.