హలీవుడ్ ను సమ్మె బాట పట్టించిన 'ఏఐ'.. అదెలానంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పదాన్ని ఈ మధ్యన తరచూ వింటున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావం ఎంత ఉంటుందన్న విషయంపై ఇప్పటికే పలు షాకింగ్ నివేదికలు.. కీలక వ్యాఖ్యలు వస్తున్నప్పటికీ.. రోజువారీ జీవితాన్ని అదెంత ప్రభావాన్ని చూపిస్తుందన్న దానిపై ఇప్పటికి స్పష్టమైన అవగాహన భారతీయులకు లేదనే చెప్పాలి. అదే సమయంలో ప్రముఖులు సైతం దీని ముప్పు గురించి పెద్దగా పట్టించుకుంటున్నది లేదు. కానీ.. ప్రాశ్చాత్య సమాజం మాత్రం ఏఐతో వచ్చి పడే సమస్యల్ని గుర్తించటమే కాదు.. హెచ్చరిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రపంచ సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే హాలీవుడ్ ఇప్పుడు సమ్మె బాట పట్టింది. 63 ఏళ్ల తర్వాత తొలిసారి నటీనటులు సమ్మె చేస్తున్నారు. వారికి జత కలిశారు రచయితలు.
ఇంతకూ వీరందరిని ఏకతాటి మీదకు తీసుకొస్తున్న కామన్ అంశం.. ఏఐ కావటం గమనార్హం. పలు డిమాండ్లతో హాలీవుడ్ నటీనటులు.. టెక్నిషియన్స్ సమ్మె బాట పట్టారు. వీరి డిమాండ్లలో ప్రధానమైనది ఏఐ వినియోగాన్ని చిత్ర నిర్మాణంలో తగ్గించాలని. అదే సమయంలో రెమ్యునరేషన్ విషయంలోనూ వారికి కొన్ని డిమాండ్లు ఉన్నాయి.
మిగిలిన డిమాండ్ల సంగతి ఎలా ఉన్నా.. ఏఐ సాంకేతికతను పరిమిత మోతాదులో మాత్రమే వినియోగించాలన్న దానిపై నిర్మాతలు మాత్రం నో చెప్పేస్తున్నారు. సమ్మే వేళ సీనియర్ యాక్టర్స్ గిల్ట్ అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్.. పొట్టిగా చెప్పాలంటే 'సాగ్ - ఆఫ్ట్రా'కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న ఫ్రాన్స్ డ్రెస్చర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొన్ని వారాలుగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాకు ఆమె సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ.. ఇప్పుడంతా ఏకతాటి మీద నిలబడకపోతే.. కచ్ఛితంగా యంత్రాలు మనల్ని రీప్లేస్ చేస్తాయన్నారు. నటీనటులు అణిచివేతకు గురవుతున్నారని.. వారికి తగిన గౌరవం దక్కటం లేదన్నారు. అన్ని రంగాల్లోని యజమానుల మాదిరే చిత్రపరిశ్రమకు చెందిన నిర్మాణ సంస్థలు.. నిర్మాతలు వ్యవహరిస్తున్నట్లుగా మండిపడ్డారు.
'మెషిన్లను నడిపించే కార్మికుల్ని మర్చిపోతున్నారు. వారి సేవల్ని గుర్తించటం లేదు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. సీఈవోలకు ఏకంగా వందల మిలియన్ల డాలర్లలో అధిక వేతనాలు ఇవ్వటం ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ బాధితులు కార్మికులే. వ్యాపారంలో ఉన్న వారు మా పట్ల వ్యవహరిస్తున్న తీరు షాకింగ్ గా ఉంది. ఏఐ వల్ల ముప్పే' అని పేర్కొన్నారు.
చిత్రనిర్మాణంలో ఏఐను తగ్గించాలన్న మాటను హాలీవుడ్ నిర్మాణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. నటీనటుల వేతనాల పెంపునకు సైతం నో చెప్పేస్తున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో తమ డిమాండ్లు నెరవేరే వరకు తగ్గేదెలే అన్నట్లుగా హలీవుడ్ నటీనటులు రియాక్టు అవుతున్నారు. మొత్తంగా చూస్తే మిగిలిన వారితో పోలిస్తే ఏఐ ముప్పును హలీవుడ్ ప్రాథమిక దశలోనే గుర్తించిందని చెప్పకతప్పదు.