వీళ్లు మారరు వీళ్లింతే.. నటి తీరని ఆవేదన
మోడ్రన్ డే సినిమాలో కొందరు దర్శకులు మాత్రమే కథానాయికల పాత్రలకు ప్రాధాన్యతను కల్పిస్తూ, అందంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు
సినిమాలు రెండు రకాలు. కథానాయికలను గ్లామరస్ గా ఆవిష్కరిస్తూ, కేవలం గ్లామ్ డాళ్స్ గా ఉపయోగించుకునే సినిమాలు తీయడం.... స్త్రీ ప్రాధాన్యతతో స్త్రీ కేంద్రీకృత సినిమాలను తీయడం... ఈ రెండు రకాల్లో మొదటి రకం సినిమాలే ఎక్కువ. దీనిపై కథానాయికల అసంతృప్తి చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. ఏవో రెండు పాటలు, నాలుగు సీన్లకే పరిమితం చేసి కేవలం తమను గ్లామర్ డాళ్స్ గా మాత్రమే ఉపయోగించుకుంటున్నారని అనాదిగా చాలా మంది కథానాయికలు తమ అసంతృప్తిని వెల్లగక్కుతూనే ఉన్నారు.
మోడ్రన్ డే సినిమాలో కొందరు దర్శకులు మాత్రమే కథానాయికల పాత్రలకు ప్రాధాన్యతను కల్పిస్తూ, అందంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా హీరోయిజాన్ని హైలైట్ చేస్తూ, హీరోయిన్ ని కేవలం సపోర్టివ్ రోల్ లో లేదా గ్లామర్ తో అలరించే డాళ్ గా మాత్రమే చూపిస్తున్నారు.
అయితే ఈ విషయంలో బాలీవుడ్ అందాల నటి హ్యూమా ఖురేషి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు. చిన్న లేదా పెద్ద బడ్జెట్లతో నిర్మించినా వాటిలో రెండు పాటలు, నాలుగు సన్నివేశాలకే కథానాయికలు పరిమితం చేస్తున్నారని హ్యూమా అన్నారు. అలాంటి పరిస్థితిలోను హీరోయిన్లు ఆ సినిమాలను తిరస్కరించలేరని వ్యాఖ్యానించారు. అయితే స్టార్ హీరోలు నాయికా ప్రధాన చిత్రాలలో కొద్ది సేపు మాత్రమే కనిపించే పాత్రలు ఎందుకు చేయలేరు? అని కూడా హ్యూమా నిలదీసారు. కాలక్రమేణా సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. కానీ సినిమాల్లో ఈ ధోరణి మారదు. ఇది ఎప్పటికీ కొనసాగుతుందని అన్నారు. నాయకా ప్రధాన చిత్రాలను నిర్మించాలని హ్యూమా ఖురేషి రచయితలు, దర్శకులను కోరారు.
హ్యూమా ఖురేషి రచించిన కొత్త పుస్తకం `జీబా - యాన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో` గురించి జరిగిన చర్చలో భాగంగా హ్యూమా పైవిధంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ లో పాల్గొన్న ఈ బాలీవుడ్ సుందరి తన పుస్తకం `జీబా` గురించిన చర్చలో పాల్గొంది. దీనిని దర్శకనిర్మాత, రచయిత మోహన కృష్ణ ఇంద్రగంటి మోడరేట్ చేశారు. ఈ కార్యక్రమంలో హ్యూమా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రస్తుతం హుమా ఖురేషి వరుసగా హిందీ చిత్రాల్లో నటిస్తోంది.