మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ దర్శకుడి మార్పు!
ఇళయరాజాకు 2010లో పద్మభూషణ్ .. 2018లో పద్మవిభూషణ్ సహా భారతదేశంలో అత్యున్నత పౌర గౌరవాలు కూడా లభించాయి.
భారతీయ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా చేసిన సేవలు అసమానం. ఐదు దశాబ్దాల విశిష్టమైన కెరీర్‌లో 1000 కంటే ఎక్కువ చిత్రాలకు 7000కు పైగా కదిలించే స్వరకల్పనలు చేసిన గొప్ప సంగీత దర్శకుడు ఆయన. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 20,000 పైగా కచేరీలలో ప్రేక్షకులను అలరించిన ఘనత ఆయన సొంతం. ఇళయరాజాకు 2010లో పద్మభూషణ్ .. 2018లో పద్మవిభూషణ్ సహా భారతదేశంలో అత్యున్నత పౌర గౌరవాలు కూడా లభించాయి.
ఇప్పుడు ఆయన బయోపిక్ కి సమయమాసన్నమైంది. గత కొంతకాలంగా స్వరమాంత్రికుడు ఇళయరాజా బయోపిక్ గురించి మీడియాలో కథనాలొస్తున్నాయి. ధనుష్ ప్రధాన పాత్రలో నటించే ఈ చిత్రానికి బాల్కీ దర్శకత్వం వహిస్తారని కథనాలొచ్చాయి. తాజా సమాచారం మేరకు.. బాలీవుడ్ దర్శకుడు బాల్కీ స్థానంలో తమిళనాడు స్థానికుడైన ప్రముఖ దర్శకుడిని నియమించనున్నట్లు తెలిసింది. ధనుష్ తెరపై ఐకానిక్ పాత్రను పోషిస్తున్నందున బయోపిక్‌కి లైఫ్‌ని తీసుకురావడానికి తమిళ సెన్సిబిలిటీని అర్థం చేసుకున్న గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన ప్రముఖ తమిళ దర్శకుడిని ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. దర్శకుడు మర్రి సెల్వరాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన పోటీదారులలో ఒకరిగా ఉన్నట్టు కథనాలొస్తున్నాయి.
హృదయాలను కదిలించే మెలోడీలను రూపొందించడంలో పాపులరైన సంగీత విద్వాంసుడు ఇళయరాజా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన మంత్రముగ్ధులను చేసే సంగీతం మరువలేని గౌరవం ప్రేమను తెచ్చిపెట్టింది. ఆయన జీవితాన్ని భావితరానికి తెలియజేసేందుకు ఈ బయోపిక్ రూపొందుతోంది.
నిజానికి ఈ బయోపిక్ కథ ఎక్కడ మొదలవుతుంది? అంటే... సంగీతకారుడు కాకముందు ఇళయరాజా ఏం చేసేవారు? అనేది కూడా తెరపై చూపించనున్నారని తెలిసింది. ఇళయరాజా బయోపిక్ ని అక్టోబరు 2024 నాటికి సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 2025 మధ్యలో విడుదల చేయాలనేది ప్లాన్. సంగీత దిగ్గజం ఇళయరాజా జీవితం.. ఆయన ప్రతిభ, సంగీత వారసత్వం గురించి లోతైన విషయాలను ఇందులో చూపిస్తారు. తాజా సమాచారం మేరకు... ధనుష్ కొంతమంది దర్శకుల పేర్లను సూచిస్తున్నారు.. అయితే ఫైనల్ కాల్ మాస్ట్రో ఇళయరాజాపై ఆధారపడి ఉంటుందని కూడా తెలిసింది.