ఈ రేంజ్ లోనా.. యానిమల్ వెయ్యి కోట్లు పక్కా..

తొలి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా దూసుకుపోతోంది.

Update: 2023-12-12 05:26 GMT

ఇప్పుడు దేశమంతా యానిమల్ మేనియా నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అంతగా ప్రేక్షకులను కట్టిపడేశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తన స్కిల్స్ తో థియేటర్లకు సినీ ప్రియులను రప్పిస్తున్నారు. వీకెండ్ అయినా వీక్ డేస్ అయినా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. 2023లో భారతీయ చిత్రసీమలో యానిమల్ సినిమా అరుదైన ఘనతలు సాధించినట్లే చెప్పొచ్చు.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం డిసెంబర్ ఒకటో తేదీన భారీ అంచనాలతో విడుదలైంది. తొలి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా దూసుకుపోతోంది. కేవలం పది రోజుల్లోనే రూ. 717 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మేకర్స్ కు కాసుల పంట పండిస్తోంది. అయితే ఈ సినిమాతో బాలీవుడ్ ను సందీప్ రెడ్డి ఏలుతున్నారు.

సాధారణంగా స్పెషల్‌ షోల మాట ఎక్కువగా మనం సినిమా విడుదలకు ముందు, విడుదలైన రోజు, సినిమా బాగుంటే ఆ వీకెండ్‌ వింటుంటాం. అయితే సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత.. అది కూడా పది రోజుల తర్వాత ఓ సినిమాకు స్పెషల్‌ షోలు పడ్డాయంటే నమ్ముతారా? కానీ మీరు నమ్మాల్సిందే. ముంబయితో పాటు పలు ఉత్తరాది నగరాల్లో ఆదివారం యానిమల్ సినిమా స్పెషల్ షోలు వేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కంటిన్యూగా వేస్తూనే ఉన్నారు షోలు.

ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ముంబయిలోని మల్టీప్లెక్స్‌లో సినిమా స్పెషల్‌ షో వేశారు. ఉదయం 4 దాకా షోలు పడ్డాయి అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఆ సమయంలో కూడా స్క్రీన్లు హౌస్‌ఫుల్‌ అవ్వడం. ఇదంతా చూస్తుంటే ఉత్తరాది ఆడియన్స్‌ ఈ సినిమాను ఎంతలా అభిమానించారో మీకు తెలుస్తోంది. ఇంత మూవీ మేనియాను షారుక్ ఖాన్‌, అమీర్ ఖాన్‌, సల్మాన్ ఖాన్‌ లాంటి స్టార్ల సినిమాల రిలీజ్‌ అప్పుడు కూడా చూడలేదు అని సినీ పండితులు అంటున్నారు.

అయితే బాక్సాఫీస్ వద్ద తొలివారం మొత్తం యానిమల్ సినిమాదే. రెండో వారం కూడా ఆ సినిమాకే అవకాశం. ఎందుకంటే సలార్‌, డంకీ మూడోవారానికి కానీ థియేటర్లకు రావు. ఈ జోరు కొనసాగితే షారుక్ పఠాన్ రికార్డులను యానిమల్‌ సినిమా బద్దలుకొట్టడం పక్కా. వీకెండ్ లో ఈ సినిమా రూ. 1000 కోట్లు వసూలు చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News