హొంబలే హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తుందా?
ప్రస్తుతం భారీ యాక్షన్ థ్రిల్లర్ సలార్ కూడా అదే సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
'కేజీఎఫ్'ప్రాంచైజీ తో పాన్ ఇండియాలో ఫేమస్ అయింది హోంబలే నిర్మాణ సంస్థ. అటుపై 'కాంతార' తో మరోసారి దేశ వ్యాప్తంగా హోంబలే పేరు మారు మ్రోగింది. అప్పటి నుంచి వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు ప్రకటిస్తూ దేశంలోనే భారీ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మారింది. నిర్మాణ సంస్థల్లో హొంబలే అంటే ఇప్పుడో బ్రాండ్ గా మారిపోయింది. ప్రస్తుతం భారీ యాక్షన్ థ్రిల్లర్ సలార్ కూడా అదే సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆ సంస్థ పేరు ప్రఖ్యాతలు మరింత రెట్టింపు అవుతాయని అంచనాలున్నాయి.
దానికి తగ్గట్టే హొంబలే భవిష్యత్ ప్రణాళికలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ అధినేత కిరగందూర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'భారతీయ సినిమాని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలన్నదే నా ఆలోచన. పదేళ్ల కిందట నేను ప్రయాణం మొదలు పెట్టినప్పుడు నిర్మాతగా నాకున్న పరిజ్ఞానాని కి..ఇప్పుడు నా ఆలోచనలకి చాలా తేడా ఉంది. నెట్ వర్క్ పెరిగింది. అయితే కథలు ప్రమాణాల విషయంలో నా ఆలోచనా విధానంలో ఎలాంటి మార్పులు రాలేదు.
మన సంస్కృతి సంప్రదాయాలు..భాషలు అన్ని వేర్వేరుగా ఉంటాయి. అవన్నీ కలిస్తేనే భారతీయత. మన కథల్ని..ప్రమాణాల్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలి అనే తపనతో పనిచేస్తున్నాను. ఇది తెలుగు సినిమా..తమిళ సినిమా..హిందీ సినిమా అంటూ ఇక్కడే ఆగిపోవడం ఇష్టం లేదు. 'కేజీఎఫ్' తర్వాత అన్ని భాషల్లోనూ మా సంస్థని చూసే విధానం మారిపోయింది. మాపైన ప్రేక్షకులు చూపుతున్న అభిమానం ...నమ్మకం మరింత బాధ్యతని పెంచాయి.
అందుకే వాళ్లకు నచ్చేలా మంచి సినిమాలు చేస్తూనే అంతర్జాతీయ స్థాయిలో భారతీయ పరిశ్రమకి ఇంచా మంచి పేరు తెచ్చే సినిమాలు అందించాలి. ఈ క్రమంలోనే సంస్థ నుంచి సినిమాలు రావడంలో ఆలస్యం అవుతుంది తప్ప అంతకు మించి వేరే కారణాలంటూ లేవు' అని అన్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో 'కాంతార' సీక్వెల్.. 'సలార్-2' తో పాటు ఇంకా నాలుగైదు సినిమాలు రెడీ అవుతున్నాయి.