మ‌రో సినీజంట విడాకులకు ద‌ర‌ఖాస్తు

ప్ర‌ముఖ పాప్ గాయ‌ని జెన్నిఫర్ లోపెజ్ త‌న భ‌ర్త నుంచి విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసారు. ఈ విష‌యాన్ని ప‌లు అంతర్జాతీయ మీడియాలు ధృవీకరించాయి.

Update: 2024-08-21 04:52 GMT

సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో వ‌ర‌స‌గా విడాకుల వార్త‌లు వినాల్సి వ‌స్తోంది. ఇప్పుడు మ‌రో సినీజంట విడిపోతున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌ముఖ పాప్ గాయ‌ని జెన్నిఫర్ లోపెజ్ త‌న భ‌ర్త నుంచి విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసారు. ఈ విష‌యాన్ని ప‌లు అంతర్జాతీయ మీడియాలు ధృవీకరించాయి.

నిజానికి ఈ జంట మ‌ధ్య క‌ల‌త‌లు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో విడిపోయారనే పుకార్లు మొద‌ల‌య్యాయి. వివాహ ఉంగరాలు లేకుండా కనిపించడం.. త‌మ ఇండ్ల‌ను విక్రయించడం.. ఒకరికొకరు దూరంగా వెళ్లడం .. విడాకుల పుకార్లకు కారణమయ్యాయి. పాపుల‌ర్ మీడియా TMZ ఇప్పుడు ఈ పుకార్లు నిజమని ధృవీకరించింది. ఈ జంట‌ విడిపోతున్నారు. అయితే జెన్నిఫ‌ర్ లోపేజ్ చివరకు విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేయడానికి అసలు కారణం కూడా ఉందని తాజాగా క‌థ‌నాలొస్తున్నాయి.

పీపుల్ మ్యాగజైన్ వివ‌రాల ప్రకారం.. జెన్నిఫ‌ర్ లోపెజ్ వైవాహిక బంధాన్ని కొన‌సాగించాలనుకుంటున్నారు. కానీ అఫ్లెక్ నుండి దానికి ఎటువంటి సంకేతం రాలేదు. వేచి చూసి విసిగిపోయిన జెన్నిఫ‌ర్ లోపేజ్ విడాకుల కోసం దాఖలు చేయాలని నిర్ణయించుకుంది. జెన్నిఫ‌ర్ ఇప్ప‌టికే చాలా నిరాశగా విచారంగా ఉంది. కానీ బెన్ త‌మ బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు ఆమెకు ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు! అని స‌న్నిహిత‌ వ్యక్తి ఒక‌రు పేర్కొన్నారు. క‌లిసి ఉండేందుకు జెన్నిఫ‌ర్ చాలా ప్రయత్నించింది. కానీ ప‌రిస్థితులు అధ్వాన్నంగా మారాయి. అయితే విడిపోయినా కానీ ఎప్ప‌టిలానే త‌మ‌ పిల్లలకు వారు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. జెన్నిఫ‌ర్ విడాకుల‌కు సిద్ధ‌మైంది. కానీ తాజా క‌థ‌నాల‌పై ఇంకా స్పందించలేదు.

చివ‌ర‌కు ఈ జంట రెండవ వివాహ వార్షికోత్సవం వేళ విడిపోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. 2022 ఆగస్టు 20న జార్జియాలో ఈ జంటకు వివాహం జ‌రిగింది. కాబట్టి జెన్నిఫ‌ర్ అదే రోజున విడాకుల‌ కోసం దాఖలు చేయడం యాధృచ్చికంగా అనిపించడం లేదని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

టిఎంజెడ్ వివ‌రాల‌ ప్రకారం.. జెన్నిఫర్ లోపెజ్ విడాకుల పత్రాలను దాఖలు చేసింది. దీన‌ర్థం ఆమె స్వ‌యంగా వాటిని కోర్టులో దాఖలు చేసింది... న్యాయవాది ద్వారా కాదు. డాక్యుమెంట్‌లలో విడిపోయిన తేదీ 26 ఏప్రిల్ 2024గా పేర్కొన్నారు. బెన్ -జెన్నిఫర్ వారి హాస్య చిత్రం గిగ్లీ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్న 20 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకున్నారు. సినిమా సెట్స్‌లో వారు స్నేహితులుగా మారడ‌మే గాక‌, చివరికి డేటింగ్ ప్రారంభించారని సమాచారం. ఈ జంట విడిపోయి ఇతర వ్యక్తులతో డేటింగ్ చేసారు. బెన్ అటుపై జెన్నిఫర్ గార్నర్‌ను వివాహం చేసుకున్నాడు. కానీ తిరిగి విడిపోయారు. ఆ త‌ర్వాత లోపేజ్ తో బెన్ సంబంధం కొన‌సాగింది.

Tags:    

Similar News