65 ఏళ్ల నటజీవితం... కమల్‌హాసన్ ది గ్రేట్!
ఉలగనాయగన్ కమల్ హాసన్ తమిళ చిత్రసీమలో నటుడిగా 65 ఏళ్ల కెరీర్‌ని పూర్తి చేసుకున్నారు
ఉలగనాయగన్ కమల్ హాసన్ తమిళ చిత్రసీమలో నటుడిగా 65 ఏళ్ల కెరీర్‌ని పూర్తి చేసుకున్నారు. బాలనటుడిగా మొదలై, హీరోగా అవతరించి, ఇంతింతై వటుడింతై అన్న తీరుగా ఎదిగిన కమల్ హాసన్ పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసారు. అతడు ఒక ప్రయోగశాల. సాంకేతిక ఉద్ధండుడు. 69 వయసులోను నటుడిగా అజేయంగా కెరీర్ ని సాగిస్తున్నారు. 1959లో వచ్చిన `కలత్తూరు కన్నమ్మ`లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన కమల్ ఇటీవల కల్కి 2989 ఎడి వరకూ అసాధారణమైన కెరీర్ ని సాగించారు. కల్కిలో ప్రతినాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మణిరత్నం `థగ్ లైఫ్`లో నటిస్తున్నాడు. కెరీర్ 65 సంవత్సరాల మైలురాయిని పురస్కరించుకున్న సందర్భంగా `థగ్ లైఫ్` మేకర్స్ ఆయనకు ఘనస్వాగతం పలుకుతున్న ఓ వీడియోని షేర్ చేసారు. రోడ్ కి ఇరువైపలా బారులు తీరిన చిత్రబృందం చప్పట్లు కొడుతూ ఆయనను స్వాగతించిన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. కళ కోసం జీవితాన్ని అంకితం చేసిన ఒక మహర్షి కమల్ హాసన్ అంటూ చిత్రబృందం ప్రశంసించింది. సోషల్ మీడియాలో ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
12 ఆగస్టు 1959న `కలత్తూర్ కన్నమ్మ` చిత్రంలో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించారు కమల్. దశాబ్దాల కెరీర్ లో ఆయన చేయని ప్రయోగం లేదు. నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, స్వరకర్త, రచయిత, గీత రచయిత, స్క్రీన్ రైటర్ గా బహుముఖ ప్రజ్ఞను కనబరిచారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని సెలబ్రేట్ చేస్తూ `థగ్ లైఫ్` నిర్మాతలు సెట్స్ నుండి విజువల్స్ ని షేర్ చేయగా సోషల్ మీడియాలో అది వేగంగా వైరల్ అయింది. 65 సంవత్సరాల క్రితం.. భవిష్యత్ సినిమా దిక్కూచి రాకను ప్రపంచం చూసింది. ఆయన ప్రవేశం పెద్ద పురోగతికి దారి తీసింది. దశాబ్దాలుగా కమల్ హాసన్ కళాత్మక ప్రక్రియల కోసం సరిహద్దులను విస్తరిస్తూనే ఉన్నారు అంటూ ప్రశంసించారు.
థగ్ లైఫ్ కమల్ హాసన్ -మణిరత్నం కలయికలో రెండో చిత్రం. నాయకన్ తర్వాత ఇది భారీ ప్రయత్నం. కమల్ హాసన్, శింబు, త్రిష, అశోక్ సెల్వన్, నాజర్, అభిరామి, జోజు జార్జ్, గౌతం కార్తీక్, ఐశ్వర్య లక్ష్మి, సన్యా మల్హోత్రా, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ తదితరులు నటిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత ఎఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.
నవతరం ఫిలింమేకర్స్ కి స్ఫూర్తి:
కమల్ హాసన్ తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ చిత్రాలలో నటించారు. దర్శకుడిగాను సత్తా చాటారు. ఆయన ఎందరో ఫిలింమేకర్స్ కి ఒక దిక్సూచి. పరిశ్రమలోని ఎందరో ప్రముఖులకు మార్గదర్శిగా ఉన్నారు. కమల్ హాసన్ `తేవర్ మగన్` స్క్రీన్ ప్లే రైటింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించిన మొదటి తమిళ చిత్రం. ఇది భారతీయ సినిమాలో సాంకేతిక పురోగతికి ఒక ఉదాహరణ. ప్రోస్తెటిక్ మేకప్, డిజిటల్ ఫిల్మింగ్ ఫార్మాట్‌లు, లైవ్ సౌండ్ రికార్డింగ్ సిస్టమ్‌ల వంటి ఆవిష్కరణలను కమల్ కోలీవుడ్‌కు పరిచయం చేశాడు. అధునాతన సాంకేతికతను పరిచయం చేయడం ద్వారా కమల్ హాసన్ తమిళ చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అంకితభావం దూరదృష్టి తరతరాల ఫిలింమేకర్స్ కి స్ఫూర్తి.