నిప్పుల కుంపటిపై కంగన.. విదేశీ ఉగ్రవాదులు వదిలిపెట్టరా?
కనీసం విదేశాల్లో అయినా సవ్యంగా విడుదల అయిందా? అంటే .. అక్కడ కూడా ఖలిస్తానీల నుంచి కంగన తీవ్ర నిరసనల సెగ ఎదుర్కొంటోంది.
క్వీన్ కంగన నటించిన `ఎమర్జెన్సీ` చాలా చిక్కుల్ని, అవాంతరాల్ని ఎదుర్కొని ఎట్టకేలకు విడుదల కాగా, రిలీజైన ఐదు రోజుల తర్వాత కూడా ఇప్పటికీ ఈ సినిమా వివాదాల్లో నలుగుతోంది. ముఖ్యంగా ఖలిస్తానీ శిక్కుల నుంచి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇంతకుముందు బ్రిటన్‌లోని పలు థియేటర్ల వద్ద ఖలిస్తానీల నిరసనల కారణంగా ఎమర్జెన్సీ ప్రదర్శన(షో)లు రద్దయ్యాయి. పంజాబ్ లోని లుథియానా సహా పలు నగరాల్లో ప్రదర్శనను ఆపేయడంతో అది కంగనకు చిత్రబృందానికి పెద్ద ఎదురు దెబ్బగా మారింది. అసలే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు అంతంత మాత్రంగా ఉండగా, ఈ నిరసనలు, వ్యతిరేకత మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతోంది.
కనీసం విదేశాల్లో అయినా సవ్యంగా విడుదల అయిందా? అంటే .. అక్కడ కూడా ఖలిస్తానీల నుంచి కంగన తీవ్ర నిరసనల సెగ ఎదుర్కొంటోంది. బ్రిటన్‌లో కొన్ని థియేటర్లలో సినిమాని ఆడనివ్వకుండా ఖలిస్తానీలు అడ్డుకోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తోచని స్థితిలో కంగన నేరుగా ఆ దేశ ప్రభుత్వాన్ని సంప్రదిస్తోంది.
మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా కంగనా రనౌత్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన `ఎమర్జెన్సీ` ప్రదర్శనలను బ్రిటన్ లో అడ్డుకుంటున్నారనే కథనాలు రాగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ యునైటెడ్ కింగ్‌డమ్ అధికారులను కంగన ప్రతినిధులు కొందరు సంప్రదించారని తెలిసింది. చాలా హాళ్లలో ప్రదర్శితమవుతున్న `ఎమర్జెన్సీ` చిత్రాన్ని ఎలా అడ్డుకుంటున్నారో మేం చూశాం. భారత వ్యతిరేక శక్తుల హింసాత్మక నిరసన, బెదిరింపుల ల గురించి మేం బ్రిటన్ అధికారుల వద్ద ఆందోళనలను లేవనెత్తుతున్నాము... వాక్ స్వాతంత్య్రం లేదా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను మేం ఉపయోగించుకోలేమా? అన్నది ప్రశ్నించినట్టు తెలుస్తోది.
షోలను అడ్డుకునే వారిని జవాబుదారీగా ఉంచాలి..బాధ్యులైన వారిపై UK ప్రభుత్వం తగిన చర్య తీసుకుంటుందని ఆశిస్తున్నామని వారు అన్నారు. లండన్‌లోని మా హైకమిషన్ థియేటర్ల భద్రత కోసం మా కమ్యూనిటీ సభ్యులతో సంప్రదింపులు జరుపుతోంది! అని కూడా వ్యాఖ్యానించారు.
కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మాన్ మాట్లాడుతూ...ఆదివారం నా నియోజకవర్గ ప్రజలు చాలా మంది హారో వ్యూ సినిమాస్‌లో `ఎమర్జెన్సీ` షో టికెట్లు కొనుక్కుని వెళ్లారు. దాదాపు 30 లేదా 40 నిమిషాల తర్వాత ముసుగు ధరించిన ఖలిస్తానీ ఉగ్రవాదులు లోపలికి చొరబడి, ప్రేక్షకులను బెదిరించి ప్రదర్శనను ఆపాలని బలవంతం చేశారు.. అని అన్నారు. యుకేలోని వోల్వర్‌హాంప్టన్, బర్మింగ్‌హామ్, మాంచెస్టర్ లాంటి చోట్ల రెండు థియేటర్ చైన్ వ్యవస్థల్లో షోలను ఆపేసారని కూడా నివేదికలు అందాయని ఆయన అన్నారు. నా నియోజక వర్గంలో ప్రజల భద్రత గురించి మాట్లాడుతున్నానని కూడా వ్యాఖ్యానించారు. మాస్క్ తొడిగిన ఖలిస్తానీ తీవ్రవాదుల పనే ఇది అని స్థానిక ప్రతినిధులు వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
సిక్కు ప్రెస్ అసోసియేషన్ వంటి కొన్ని బ్రిటిష్ సిక్కు గ్రూపులు సిక్కు వ్యతిరేక సినిమా అని నిరసనలు వ్యక్తం చేసాయని.. దీని ఫలితంగా కొన్ని నగరాల్లో షోలకు అంతరాయం కలిగిందని తెలిసింది. కంగన రనౌత్ నిర్మాతలలో ఒకరు.. సిక్కు సమాజాన్ని తప్పుగా చిత్రీకరించారని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించారని వారు ఆరోపించారు.
సెన్సార్ బోర్డు, కోర్టుల మధ్య నెలల తరబడి చర్చించాక, కొన్ని కోతలతో, కొన్ని వివాదాస్పద సంభాషణలను మ్యూట్ చేసాక నవంబర్ లో ఈ చిత్రానికి సెన్సార్ క్లియర్ అయింది. జనవరి 17న థియేటర్లలో విడుదలైంది.