మ్యాట్రిమోనీ ద్వారా కన్నడ నటి పెళ్లి.. తాజాగా సూసైడ్!
వీకెండ వేళ హైదరాబాద్ మహానగరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కన్నడ టీవీ.. సినీనటి శోభిత సూసైడ్ చేసుకుంది.
వీకెండ వేళ హైదరాబాద్ మహానగరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కన్నడ టీవీ.. సినీనటి శోభిత సూసైడ్ చేసుకుంది. కొండాపూర్ లోని తన ఫ్లాట్ లో ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తించారు. అయితే.. ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుక్కుగూడకు చెందిన సుధీర్ రెడ్డి గచ్చిబౌలిలో ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నారు. మ్యాట్రీమోనీ వెబ్ సైట్ ద్వారా వీరిద్దరు కలిశారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆమె.. తాజాగా ఆత్మహత్య చేసుకోవటం షాకింగ్ గా మారింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కర్ణాటకలోని హసన్ జిల్లా సకిలేష్ పూర్ కు చెందిన శోభిత పేద కుటుంబానికి చెందిన అమ్మాయిగా పేర్కొన్నారు. వారు నలుగురు అక్కాచెల్లెళ్లు.. ఒక సోదరుడు ఉన్నారు. తండ్రి లేరు. కష్టపడి తల్లే కుటుంబాన్ని పోషించింది. పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న శోభిత కొంతకాలం కన్నడ టీవీ సీరియల్స్ లో నటించింది.
కొంతకాలం క్రితం మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ అప్ లోడ చేసిన శోభితకు.. ఐటీ ఉద్యోగి సుధీర్ రెడ్డి ప్రొఫైల్ నచ్చింది. ఆన్ లైన్ లో పరిచయమైన వీరు.. ఒకరికొకరు నచ్చటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే.. శోభిత సీరియల్స్ లో నటిస్తున్న విషయం సుధీర్ రెడ్డికి తెలియదు. భర్త ఐటీ ఉద్యోగి కావటంతో ఆమె తనయాక్టింగ్ కెరీర్ ను వదిలేసుకొని గత ఏడాది మేలో సుధీర్ రెడ్డిని వివాహం చేసుకున్నారు.
వీరిద్దరు కలిసి కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలోని ఒక అపార్టుమెంట్ ప్లాట్ లో ఉంటున్నారు. పెళ్లి తర్వాత సుధీర్ రెడ్డికి ఆమె నటి అన్న విషయం తెలిసింది. కొద్దిరోజుల క్రితం గోవాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ కు శోభిత వెళ్లి వచ్చినట్లుగా పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి పది గంటల వేళలో డిన్నర్ చేసిన శోభిత ఒక బెడ్రూంలో పడుకోగా.. తన ఆఫీస్ వర్కు చేసుకున్న తర్వాత సుధీర్ రెడ్డి మరో బెడ్రూంలో పడుకున్నారు. ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలు అవుతున్నా.. శోభిత తన బెడ్రూం తలుపు తీయలేదు.
దీంతో.. ఇరుగు, పొరుగు వారి సాయంతో బెడ్రూం తలుపు బద్ధలుకొట్టి చూడగా.. చీరను ఫ్యాన్ కు ఉరి వేసుకొన్న శోభిత విగత జీవిగా కనిపించింది. దీంతో వారు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శోభిత కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన పోలీసులకు భార్యభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవన్న విసయాల్ని వెల్లడించారు. అలాంటప్పుడు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇక. శోభిత సూసైడ్ నోట్ కూడా లభించలేదు. అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తన భార్య ఎందుకు సూసైడ్ చేసుకుందో తనకు అర్థం కావట్లేదని భర్త సుధీర్ రెడ్డి చెబుతున్నారు. శోభిత కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు లభించే వీలుందని భావిస్తున్నారు. ఇప్పటికైతే నటి శోభిత ఆత్మహత్య మిస్టరీగా మారింది. ఆమె ఆత్మహత్యకు కారణం తేలాల్సి ఉంది.