గ్రామాల నుంచి వస్తే వారి ఆశల్ని ఆదిలోనే తుంచేస్తున్నారు! ఖుష్బూ
మలయాళం ఇండస్ట్రీని జస్టిస్ హేమ కమిటీ నివేదిక షేక్ చేస్తోన్న వేళ నటి, జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలు ఖుష్పూ వేదికగా ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ సంచలన పోస్ట్ పెట్టారు.
మలయాళం ఇండస్ట్రీని జస్టిస్ హేమ కమిటీ నివేదిక షేక్ చేస్తోన్న వేళ నటి, జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలు ఖుష్పూ వేదికగా ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ సంచలన పోస్ట్ పెట్టారు. `చిత్ర పరిశ్రమలో మహిళలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరం. దీని గురించి స్పందించడానికి ధైర్యంగా ముందుకొచ్చిన మహిళల్ని మెచ్చుకోవాలి. వేధింపులు బయట పెట్టడానికి హేమ నివేదిక ఎంతో ఉపయోగపడింది.
కెరీర్ లో రాణించాలనుకునే మహిళలు ప్రతీ రంగంలో లైంగిక వేధింపులు ఎదుర్కుంటున్నారు. పురుషు లకు ఇలాంటి పరిస్థితులుంటాయి. కానీ పురుషుల కంటే మహిళలే ఎక్కువగా బాధితులుగా తెరపైకి వస్తున్నారు. జరిగిన అన్యాయం గురించి చెబితేనే దర్యాప్తుకు సహాయపడుతుంది. బాధితులకు అందరి సహాకారం అవసరం. వారి బాధను విని మానసికంగా ధైర్యాన్ని ఇవ్వాలి. సమస్య ఎదురైనప్పుడే? ఎందుకు మాట్లాడలేదని కొందరు అడుగుతున్నారు.
కానీ బయటకు వచ్చి చెప్పే ధైర్యం అందరికీ ఉండదు. తండ్రి వేధింపుల గురించి ఎందుకు సమయం తీసుకున్నావ్? అని నన్ను అడుగుతున్నారు. అందులో తప్పులేదు. నేను ముందే మాట్లాడాల్సి ఉంది. అది నా కెరీర్ విషయంలో చోటు చేసుకున్నది కాదు. నన్ను రక్షించాల్సిన వ్యక్తి నుంచే వేధింపులు ఎదుర్కున్నా. చాలా మంది మహిళలకు కుటుంబం నుంచి సరైన మద్దతు దక్కడం లేదు.
ఈ విషయాన్ని చాలా మంది అర్దం చేసుకోవాలి. గ్రామాల నుంచి ఎంతో మంది ఎన్నో ఆశలతో సినిమాల్లోకి వస్తారు.వారి ఆశల్ని ఆదిలోనే తుంచేస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే బాధిత మహిళలకు అడ్డంగా నిలవాలి. ఈ నివేదిక అందరిలో మార్పు తీసుకురావాలి` అని అన్నారు. ఇప్పటికే ఈ నివేదిక నేపథ్యంలో చాలా మంది మలయాళ నటీమణులు తమకు జరిగిన అన్యాయంపై మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఖుష్బూ పోస్ట్ తో మరింత సంచలనంగా మారింది.