'కోటబొమ్మాళి పీఎస్' మూవీ రివ్యూ

Update: 2023-11-24 10:55 GMT

'కోటబొమ్మాళి పీఎస్' మూవీ రివ్యూ

నటీనటులు: శ్రీకాంత్- రాహుల్ విజయ్- శివాని రాజశేఖర్- వరలక్ష్మీ శరత్ కుమార్- బెనర్జీ తదితరులు

సంగీతం: రంజిన్ రాజ్- మిథున్ ముకుందన్ (లింగిడి లింగిడి)

నేపథ్య సంగీతం: రంజిన్ రాజ్

ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి

కథ: షాహిన్ కబీర్

మాటలు: నాగేంద్ర కాశీ

నిర్మాతలు: బన్నీ వాసు-విద్య కొప్పినీడి

దర్శకత్వం: తేజ మార్ని

రెండేళ్ల కిందట మలయాళంలో సంచలన విజయం సాధించిన చిత్రం.. నాయట్టు. ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి.. శ్రీకాంత్-రాహుల్ విజయ్-శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో 'కోటబొమ్మాళి పీఎస్' పేరుతో తెరకెక్కించింది గీతా ఆర్ట్స్ సంస్థ. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రామకృష్ణ (శ్రీకాంత్) శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని ఒక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్. 20 ఏళ్లు గ్రే హౌండ్స్ లో పని చేసి అనేక ఎన్ కౌంటర్లలో భాగమైన రామకృష్ణకు డిపార్టుమెంట్లో మంచి పేరుంటుంది. అదే స్టేషన్లో రవి (రాహుల్ విజయ్).. కుమారి (శివాని రాజశేఖర్) కానిస్టేబుళ్లు. టెక్కలిలో ఉప ఎన్నిక వచ్చి రాష్ట్ర హోం మంత్రి పోటీ చేస్తుండటంతో ఆ ఎన్నికలకు ఎక్కడలేని ప్రాధాన్యం ఏర్పడుతుంది. అదే సమయంలో రామకృష్ణ.. రవి.. కుమారి ఒక యాక్సిడెంట్ కేసులో నిందితులవుతారు. ఎన్నికల టైంలో ఈ వివాదం పెద్దదిగా మారి ఎన్నికల ఫలితాల మీదే ప్రభావం చూపే స్థాయికి చేరడంతో రాష్ట్రం మొత్తం ఆ కేసు మీద దృష్టిసారిస్తుంది. తమను బలిపశువులు చేయబోతున్నారని అర్థమై ఈ ముగ్గురూ తప్పించుకుని పారిపోతారు. మరి వారిని పోలీసులు పట్టుకున్నారా.. ఈ కేసుతో ఆ ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

రీమేక్.. ఈ మాటెత్తితే ఇటు ఇండస్ట్రీ జనాలు.. అటు ప్రేక్షకులు బెంబేలెత్తిపోతున్నారు. ఎంత మంచి సినిమాను రీమేక్ చేసినా ఆశించిన ఫలితం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఈ రోజుల్లో. ఓటీటీల్లో అన్ని భాషల కంటెంట్ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో మరో భాషలో సంచలనం రేపిన సినిమాను రీమేక్ చేసి ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టమవుతోంది. మెజారిటీ జనాలు ఓటీటీల్లో ఒరిజినల్ చూసేస్తుండడంతో.. వాళ్లు రీమేక్ చూసి ఏముంది జిరాక్స్ కాపీ తీశారు అనో.. మాతృకను చెడగొట్టారు అనో.. పెదవి విరుపు కామెంట్లు రాకుండా తప్పించుకోవడం సవాలే. అదే సమయంలో ఒరిజినల్ చూడని వాళ్లతో ఇది మన కథ అనిపించి మెప్పించడమూ తేలిక కాదు. ఇలాంటి సమయంలో అరుదుగా కొన్ని చిత్రాలు మాత్రం మాతృక చూడని వాళ్లనే కాక.. చూసిన వాళ్లనూ మెప్పిస్తాయి. ఆ కోవకు చెందిన సినిమానే.. కోటబొమ్మాళి పీఎస్. ఇదొక రీమేక్ అన్న సంగతి పక్కన పెట్టి ఓపెన్ మైండ్ తో చూస్తే.. 'కోటబొమ్మాళి పీఎస్' హృదయాలకు బలంగా తాకే సినిమా. ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ.. ఆలోచన రేకెత్తించే ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. రెండు గంటల పాటు ప్రేక్షకులను ఒక రకమైన మూడ్ లో ఉంచే 'కోటబొమ్మాళి పీఎస్'.. థియేటర్ల నుంచి బయటికి వచ్చాక కూడా వెంటాడుతుంది.

రాజకీయ నాయకుల చేతిలో బందీగా మారిన వ్యవస్థ గురించి అనేక ప్రశ్నలు రేకెత్తించే.. ఆలోచన కలిగించే సినిమా 'కోటబొమ్మాళి పీఎస్'. నేతల చేతుల్లో పోలీసులు ఎలా పావులుగా మారుతారో ఇందులో చాలా బలంగా చూపించారు. ఎంత మంచి పేరున్న పోలీసులనైనా.. రాజకీయ నాయకులు తమ అవసరం కోసం ఎలా బలి చేస్తారన్నది ప్రధానాంశంగా కథ నడుస్తుంది. చిన్న చిన్న సంఘటనల ఆధారంగా ఇందులో మూల కథను అల్లిన విధానం మెప్పిస్తుంది. ఎన్నికల సమయంలో జరిగే కుల రాజకీయాలు.. రాజకీయ నాయకులు ఆడే గేమ్స్ ఎలా ఉంటాయో సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టేలా 'కోటబొమ్మాళి'లో చూపించారు. 'కోటబొమ్మాళి'లో లీడ్ క్యారెక్టర్లకు ప్రత్యేకమైన ఇంట్రోలు.. ఎస్టాబ్లిష్మెంట్లు.. ఎలివేషన్లు అంటూ ఏమీ కనిపించవు. నేరుగా కథను ఓపెన్ చేసి అందులో పాత్రలు ఒక్కొక్కటిగా సాధారణంగానే పరిచయం అవుతాయి. ప్రేక్షకుల దృష్టంతా కథ మీదే ఉండేలా ఆసక్తికర సన్నివేశాలతో కథనాన్ని నడిపించాడు దర్శకుడు. కథలో కీలక మలుపుకి దారి తీసే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆసక్తి రేకెత్తిస్తాయి. ఆ మలుపు తర్వాత కథనం మరింత పరుగులు పెడుతుంది.

పోలీసులు ఒక యాక్సిడెంట్ కేసులో చిక్కుకుంటే తప్పించుకోవడం చాలా సులువు అనిపిస్తుంది. కానీ ఇందులో ముగ్గురు పోలీసులు ఇరుక్కుపోతారు. అందుకు కారణాలు కన్విన్సింగ్ గా అనిపిస్తాయి. అలాగే ఒక జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం బరిలోకి దిగితే.. పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోతున్న ముగ్గురు పోలీసులను పట్టుకోవడం కష్టం అనిపించదు. కానీ ఇందులో ఆ ముగ్గురూ తప్పించుకుంటారు. అదీ కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. మాతృకలో ఉన్న ఈ బలమైన సన్నివేశాలను.. ఇంకొంచెం మెరుగుపరిచి ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. నిందితులను పట్టుకోవాలని పోలీసాఫీసర్ వేసే ఎత్తులు.. వాటికి హీరో వేసే పై ఎత్తులు ఆసక్తి రేకెత్తిస్తాయి. దీని వల్ల కథనం సినిమా చాలా వరకు బోర్ కొట్టకుండా సాగిపోతుంది. ఇక సినిమాను మరో స్థాయిలో నిలబెట్టేవి ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ ఎపిసోడ్లు. మాతృకను అనుసరించే ఇందులో కీలక మలుపు వస్తుంది. తమకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రను అడ్డుకోవడానికి హీరో ఏం చేశాడన్నది తెరపైనే చూడాలి. ఆ సన్నివేశం హృదయం ద్రవించేలా చేస్తుంది.

మలయాళంలో అనేక ప్రశ్నలు రేకెత్తిస్తూ ఒక రకమైన నిరాశకు గురిచేసేలా సినిమా ముగుస్తుంది. తెలుగులోనూ ప్రిక్లైమాక్స్ కన్నీళ్లు పెట్టించినప్పటికీ.. చివరికి కొంత ఆశాభావంతో సినిమా ముగిసేలా చేస్తుంది. ఈ మార్పు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ.. అది మన ప్రేక్షకుల కోణంలో చూస్తే సరైందే అని చెప్పాలి. వ్యవస్థ గురించి పతాక సన్నివేశాల్లో మురళీ శర్మతో చెప్పించిన సీన్.. తెలుగులో మరో మంచి అడిషన్. మాతృకతో పోలిస్తే ఇక్కడ అన్ని పాత్రల టోన్.. డైలాగ్స్ డిఫరెంటుగా ఉంటాయి. ఒరిజినల్ స్టోరీని కొంచెం కమర్షియలైజ్ చేశారు ఇక్కడ. శ్రీకాంత్ పాత్రకు కొంచెం హీరోయిక్ ఎలివేషన్ కూడా దక్కింది. మొత్తంగా చూస్తే 'నాయట్టు'లోని ఆత్మను పట్టుకుని.. దాన్ని మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు 'కోటబొమ్మాళి పీఎస్' టీం బాగానే తీర్చిదిద్దింది. కాకపోతే కథ ప్రధానంగా పూర్తిగా సీరియస్ గా సాగే ఈ సినిమాకు రీచ్ ఎంత ఉంటుందన్నదే సందేహం. కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్నందుకుంటుందన్నది పక్కన పెడితే 'కోటబొమ్మాళి పీఎస్' ఒక మంచి సినిమా అనడంలో సందేహం లేదు.

నటీనటులు:

'కోటబొమ్మాళి పీఎస్'కు శ్రీకాంత్ పాత్ర.. తన నటన అతి పెద్ద బలం. సినిమాను అతను తన భుజాల మీద మోశాడు. సంఘర్షణతో కూడిన పాత్రలో శ్రీకాంత్ పరిణతితో నటించాడు. తన నటన పాత్రకు తగ్గట్లు.. కొలిచినట్లు సాగింది. క్యారెక్టర్లో ఉన్న బలానికి శ్రీకాంత్ నటన కూడా తోడై అది ఉత్తమ స్థాయిలో నిలిచింది. చివరికొచ్చేసరికి శ్రీకాంత్ పాత్ర కన్నీళ్లు పెట్టిస్తుంది. రాహుల్ విజయ్.. రవి పాత్రకు సరిపోయాడు. అప్పుడే ఉద్యోగం చేరిన కుర్రాడి పాత్రలో బాగానే నటించాడు. శివాని రాజశేఖర్ ను కథానాయికలా కాకుండా ఒక మామూలు మహిళా కానిస్టేబుల్ లాగా చూపించారు. తన లుక్ పాత్రకు సరిపోయింది కానీ.. స్క్రీన్ ప్రెజెన్స్.. నటన సాధారణంగా అనిపిస్తాయి. మురళీ శంకర్ సగటు రాజకీయ నాయకుడి పాత్రలో అదరగొట్టాడు. తన హావభావాలు.. టిపికల్ డైలాగ్ డెలివరీ ఆ పాత్రకు ప్రత్యేకత తెచ్చాయి. హీరో ఎత్తులకు పై ఎత్తులు వేసే పోలీసాఫీసర్ రజియా అలీ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా బాగా చేసింది. మిగతా నటీనటులందరూ ఓకే.

సాంకేతిక వర్గం:

మలయాళ సంగీత దర్శకుడు రంజిన్ రాజ్.. సినిమాలోని డ్రామాకు ఉత్కంఠకు తగ్గట్లుగా నేపథ్య సంగీతం సమకూర్చాడు. ఆర్ఆర్ ప్రేక్షకులను సినిమాలో ఇన్వాల్వ్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. సినిమాలో ఉన్న ఒక్క పాట (లింగిడి లింగిడి)ని మిథున్ ముకుందన్ కంపోజ్ చేశాడు. ఆడియో హిట్టయిన ఈ పాట తెర మీద కూడా బాగుంది. జగదీష్ చీకటి ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. పరిమిత బడ్జెట్లోనే క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చారు. నాగేంద్ర కాశీ మాటలు కొన్ని చోట్ల తూటాల్లా పేలాయి. పోలీసుల పరిమితులను శ్రీకాంత్ చెప్పే డైలాగ్.. వ్యవస్థ గురించి మురళీ శర్మ చెప్పే డైలాగ్.. బలంగా తాకుతాయి. డైరెక్టర్ తేజ మార్ని.. మాతృకను చెడగొట్టకుండా.. దాని ఆత్మను పట్టుకుని మన నేటివిటీకి తగ్గట్లుగా నరేట్ చేశాడు. మార్పులు చేర్పుల మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ.. మన ప్రేక్షకులకు అభిరుచికి తగ్గట్లుగా సినిమాను తీర్చిదిద్దాడు. దర్శకుడిగా అతను మంచి పనితనమే చూపించాడు.

చివరగా: కోటబొమ్మాళి పీఎస్.. గట్టిగా.. హృదయాన్ని తాకేలా

రేటింగ్- 2.75/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater

Tags:    

Similar News