మంచి ప‌ద్ధ‌తి కాదు.. థియేటర్‌లో పెళ్లిపై కృష్ణ‌వంశీ క్లాస్

అయితే దీనిని చిత్ర‌ద‌ర్శ‌కుడు కృష్ణ వంశీ తీవ్రంగా ఖండించారు. ''ఇది మంచి పద్దతి కాదని.. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల్ని మంట కలపకండి.. చెడొగొట్టకండి

Update: 2024-08-11 07:54 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేష్ కెరీర్ మిడ్‌లో 'మురారి' (2001) లాంటి క్లాసిక్ మూవీలో న‌టించాడు. మ‌హేష్-సోనాలి బింద్రే నాయ‌కానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రానికి కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ర‌మ‌ణ గోగుల చార్ట్ బ‌స్ట‌ర్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్ర‌ధాన అస్సెట్ గా నిలిచింది.

ఫిబ్రవరి 2001లో విడుదలైన మురారి, ఆ సంవత్సరంలో అతిపెద్ద హిట్‌లలో ఒకటి. ఇప్పుడు 4కెలో రీమాస్ట‌రింగ్ చేసిన కొత్త వెర్ష‌న్ ని రిలీజ్ చేయ‌గా... దీనికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమా రీరిలీజ్ ముందే అడ్వాన్స్‌గా 1 లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ -తెలంగాణా అంతటా శుక్రవారం థియేటర్లలో తిరిగి విడుదల కాగా.. మురారి ఆడుతున్న థియేట‌ర్‌లో ఒక ప్రేమ జంట పెళ్లి చేసుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది.

అయితే దీనిని చిత్ర‌ద‌ర్శ‌కుడు కృష్ణ వంశీ తీవ్రంగా ఖండించారు. ''ఇది మంచి పద్దతి కాదని.. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల్ని మంట కలపకండి.. చెడొగొట్టకండి.. అవమానించకండి'' అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్‌ను కృష్ణ వంశీ అభ్య‌ర్థించారు. యువ‌త‌రం ఇలా బాధ్య‌తారాహిత్యంగా ఉంటే త‌ల్లిదండ్రుల‌కే క‌దా ఆ క‌ష్టం క‌న్నీళ్లు. అందుకే జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

మురారి చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో నాటి తన జ్ఞాపకాల్లోకి వెళ్లారు. ముఖ్యంగా మురారి మొదటి షెడ్యూల్‌ని గుర్తు చేసుకుంటూ.. ఉదయం 7 గంటలకు షూట్ ప్రారంభించి, తెల్లవారుజామున 2 గంటల వరకు టీమ్ షెడ్యూల్‌ను ఎలా సాగించిందో నందిని రెడ్డి గుర్తు చేసుకున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు ప్యాకప్ చెప్పి, 4 గంటలకు ఇంటికి తిరిగి వెళ్లేవాళ్ల‌ము. మళ్ళీ ఉదయం 5 గంటలకే షూటింగ్ లొకేష‌న్ కి బ‌య‌ల్దేరాల్సి ఉంటుంది.. అని తెలిపారు. నాలుగో రోజుకే డైరెక్ష‌న్ టీమ్ వెల‌వెల‌బోయార‌ని కూడా నందిని రెడ్డి తెలిపారు. దర్శకుడు కృష్ణ వంశీని ''మొదట్లోనే ఇంత కఠినమైన షెడ్యూల్ ఎందుకు?'' అని అడిగారు. దానికి కృష్ణ వంశీ ''దాదాపు ఒక సంవత్సర కాలంగా టీమ్ ప‌ని చేయ‌లేదు క‌దా?'' అని కూల్ గా తిరిగి ప్ర‌శ్నించారు! అని నందిని గుర్తు చేసుకున్నారు. కృష్ణ‌వంశీ ట్రేడ్ మార్క్ అంటే అదీ అని కూడా అన్నారు.

Tags:    

Similar News