ర్యాంప్ వాక్ చేస్తూ ఏడ్చేసిన సీతమ్మ!
ఈ సందర్బంగా కెరీర్ ఆరంభం నాటి రోజుల్ని, సినిమాల్లోకి ఎలా వచ్చింది వంటి విషయాలు గుర్తు చేసుకుంది.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కెళ్లి సక్సెస్ అయిన కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. `వన్` తో తెలుగులో లాంచ్ అయిన అమ్మడు అటుపై రెండు, మూడు సినిమాలు చేసి ముంబైకె ళ్లిపోయింది. అక్కడ మాత్రం బాగానే కలిసొచ్చింది. వరుస విజయాలతో వేగంగా స్టార్ లీగ్ లో చేరింది. అటుపై జాతీయ ఉత్తమ నటిగానూ అవార్డు..రివార్డు అందుకుంది. దీంతో అమ్మడి రేంజ్ అంతకంతకు రెట్టింపు అయింది.
లేడీ ఓరియేంటెడ్ చిత్రాలకు సైతం ప్రమోట్ అయింది. ఇటీవలే 'ది క్రూ'తో మరో సక్సస్ ఖాతాలో వేసుకుంది. అలాగే బాలీవుడ్ లో దశాబ్ధ ప్రయాణం పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా కెరీర్ ఆరంభం నాటి రోజుల్ని, సినిమాల్లోకి ఎలా వచ్చింది వంటి విషయాలు గుర్తు చేసుకుంది. `ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలోమోడలింగ్ పై ఆసక్తి పెరిగింది. అందులోకి ఎంటర్అయిన కొన్నిరోజులకే ఓ యాడ్ చేసాను.
కెమెరా ముందు నిలబడినప్పుడు కలిగే ఆనందాన్ని అప్పుడే పొందా. అప్పుడే సినిమాల్లోకి ఎందుకు వెళ్లకూడదు? అనిపించింది. చిత్రాల్లో చూపించినంత నటన యాడ్స్ కోసం అవసరం ఉండదు. కానీ నేను యాడ్స్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన దర్శకులు నా నటనలో సహజమైన నటన ఉందని, సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించారు. అప్పుడే సినిమాల్లోకి వెళ్లాలని బలంగా నిర్ణయించుకుని ముందడుగు వేసాను.
నేను మొదటి సారి ర్యాంప్ వాక్ చేసిన రోజు ఇంకా గుర్తుంది. అది ఢిల్లీలో జరిగింది. ఇలాంటి షోలో ఎత్తైన చెప్పులు వేసుకుని నడవడం అదే తొలిసారి. అందరి ముందు నడవడానికి భయమేసింది. దీంతో కాసేపు నడుస్తూనే ఏడ్చేసాను. ఆ సమయంలో అంతా ఎందుకు ఏడుస్తుందని? మరింత ఆశ్చర్యంగా చూడటం మొదలు పెట్టారు. కానీ ఆ రోజులు చాలా మంచి పాఠాలు నేర్పించాయి` అని తెలిపింది.