స్టార్ హీరోలకి షాక్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్!
సూపర్ స్టార్లే లోకేష్ కోసం క్యూలో
'ఖైదీ'..'విక్రమ్' హిట్ తో కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియాలో ఎంత సంచలనమయ్యాడో చెప్పాల్సిన పనిలేదు. అన్ని భాషల హీరోలు లోకేష్ తో పనిచేయడానికి రెడీగా ఉన్నారు. ఆయన ఊ కోట్టాలే గానీ వచ్చి వాలిపోవడానికి సిద్దంగా ఉన్నారు.
సూపర్ స్టార్లే లోకేష్ కోసం క్యూలో ఉన్నారంటే? అతనికి మార్కెట్ లో ఏ రేంజ్ లో డిమాండ ఉందో చెప్పొచ్చు. ఇప్పుడు లోకేష్ ని లాక్ చేస్తే మరో రెండు..మూడేళ్ల తర్వాతైనా సినిమా చేయోచ్చన్నది మరికొంత మంది హీరోల ప్లాన్.
ఇక నిర్మాతలైతే ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎన్నికోట్లైనా అడ్వాన్సులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇలా ఇంత క్రేజ్ ఉన్న దర్శకుడు తాజాగా సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. 10 సినిమాలు చేసిన తర్వాత ఇండస్ట్రీని వదిలేస్తానని వెల్లడించాడు. కోలీవుడ్ స్టార్ విజయ్ 49వ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లోకేష్ ఈ విషయాన్ని తెలిపాడు.
'నాకు ఇక్కడ ఎక్కువ కాలం ఉండాలని లేదు. దీర్ఘ కాలీక ప్రణాళికలు లేవు. డైరెక్టర్ అనే స్థానాన్ని ఎక్కువ కాలం పట్టుకుని ఉండాలనుకోవడం లేదు. ప్రశాంతమైన జీవితాన్నే కోరుకుంటున్నా. సినిమా అనేది ఎంత కష్టమైన పనో ఇక్కడున్న అందరికీ తెలుసు. మరెందుకు సినిమాల్లోకి వచ్చారనే సందేహం మీకు ఉంటుంది. సినిమాల్లో ప్రయత్నం చేయాలనుకున్నా. అందుకే షార్ట్ ఫిల్మ్ తీసా.
అవి బాగా రావడంతో దర్శకత్వం చేసే అవకాశాలిచ్చారు. అందుకే కొన్నాళ్ల పాటు ఈ వృత్తిలో కొనసాగుతాను. మహా అయితే పది సినిమాలు చేస్తాను' అని అన్నారు. ఇది నిజంగా హీరోలకు పిడుగు లాంటి వార్తే.
లోకేష్ తో ఎన్నో ప్రయోగాలు చేయాలని కొంత మంది హీరోలు ఓ ప్లానింగ్ తో ఉన్నారు. ఇప్పుడు వాళ్లందరి ప్లానింగ్ పై నీళ్లు జల్లినట్లే అవుతుంది. ప్రస్తుతం విజయ్ హీరోగా లోకేష్ 'లియో' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత లోకేష్ సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.