2024లో కోలీవుడ్ నెం.1 హీరో ఎవరంటే?
భారీ అంచనాలతో వచ్చిన స్టార్ హీరోల సినిమాలేవీ ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయాయి.
2024లో టాలీవుడ్ సక్సెస్ రేట్ తక్కువే ఉన్నప్పటికీ, హిట్టయిన సినిమాల వరకూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. 'కల్కి 2898 AD', 'పుష్ప 2: ది రూల్' లాంటి తెలుగు చిత్రాలు ₹1000 కోట్ల క్లబ్ లో చేరగా.. 'దేవర 1' మూవీ ₹500 కోట్లను అధిగమించింది. 'హను-మాన్' లాంటి మీడియం బడ్జెట్ మూవీ ₹300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అయితే తమిళ చిత్ర పరిశ్రమకు ఈ సంవత్సరం పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. భారీ అంచనాలతో వచ్చిన స్టార్ హీరోల సినిమాలేవీ ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయాయి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా కనీసం ₹500 కోట్ల మార్క్ ను టచ్ చేయలేకపోయింది.
తమిళ అగ్ర హీరో విజయ్ నటించిన 'ది గోట్' (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్).. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కోలీవుడ్ సినిమాగా నిలిచింది. ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ₹456 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. టాక్ తో సంబంధం లేకుండా ఈ రేంజ్ నంబర్స్ రావడం దళపతి స్టార్ డమ్ కి నిదర్శనం అనుకోవచ్చు. తెలుగు మార్కెట్ లో మాత్రం ఈ సినిమా పూర్తిగా నిరాశ పరిచింది.
'అమరన్' సినిమాతో శివకార్తికేయన్ సంచలనం సృష్టించాడు. సాయి పల్లవితో కలిసి ఆయన నటించిన ఈ చిత్రం.. ₹340 కోట్ల కలెక్షన్స్ తో ఈ ఏడాది అత్యధిక గ్రాస్ రాబట్టిన రెండవ తమిళ మూవీగా నిలిచింది. నివేదికల ప్రకారం కొన్ని ఏరియాలలో ఈ సినిమా 'గోట్' కలెక్షన్లను కూడా క్రాస్ చేసింది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'వేట్టయన్' మూవీ ₹260 కోట్ల గ్రాస్‌తో మూడవ స్థానంలో నిలిచింది. తలైవా స్టార్ డమ్, ఆయన గత చిత్రాల రికార్డులతో కంపేర్ చేసి చూస్తే డిజప్పాయింట్ చేసిందనే అనుకోవాలి.
విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇండియాలో 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం.. చైనా బాక్సాఫీస్ దగ్గర అనూహ్యమైన వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ గా అన్నీ కలుపుకొని దాదాపు ₹170 కోట్ల వసూళ్లు సాధించి, ఈ ఏడాది టాప్-4 తమిళ్ గ్రాసర్ గా నిలిచింది. ధనుష్ నటించిన తన మైలురాయి 50వ చిత్రం 'రాయన్' మంచి విజయం సాధించింది. సుమారు ₹160 కోట్లు వసూళ్లతో 5వ స్థానానికి చేరుకుంది.
ఇలా పైన చెప్పుకున్న 5 సినిమాలు అత్యధిక వసూళ్లు చేసిన కోలీవుడ్ చిత్రాల జాబితాలో టాప్ లో ఉన్నాయి. 'ఇండియన్ 2' సినిమా ₹150 కోట్లు.. 'కంగువ' చిత్రం ₹100 కోట్లు రాబట్టినప్పటికీ, బడ్జెట్ తో పోల్చి చూస్తే ఇది రెండూ భారీ డిజాస్టర్లు అనే చెప్పాలి. అయితే 'అరణ్మనై 4' సినిమా ₹100 కోట్ల క్లబ్ లో చేరి అందర్నీ ఆశ్చర్య పరిచింది. 'డెమోంటే కాలనీ 2' మూవీ ₹85 కోట్ల వరకూ రాబడితే, 'తంగలాన్' ₹75 కోట్లు వసూలు చేసింది.
ఓవరాల్ గా బాక్సాఫీస్ కలెక్షన్ల ఆధారంగా 2024లో కోలీవుడ్ లో విజయ్ అగ్రస్థానంలో ఉన్నారు. శివకార్తికేయన్ ఈ ఏడాది రజనీకాంత్‌ను మించిపోయాడు.. బిగ్ లీగ్‌లోకి ప్రవేశించాడు. చాలా కాలం తర్వాత విజయ్ సేతుపతి బాక్సాఫీస్ వద్ద చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. వచ్చే సంవత్సరం తమిళ్ నుండి పలు క్రేజీ మూవీస్ రాబోతున్నాయి. మరి 2025లో అయినా కోలీవుడ్ ఇండస్ట్రీ ఇండియన్ సినిమాలో డామినేషన్ చూపిస్తుందేమో చూడాలి.