మూవీ రివ్యూ : లక్కీ భాస్కర్

Update: 2024-10-31 04:01 GMT

'లక్కీ భాస్కర్' మూవీ రివ్యూ

నటీనటులు: దుల్కర్ సల్మాన్-మీనాక్షి చౌదరి-రాంకీ-రాజ్ కుమార్ కసిరెడ్డి-మానస చౌదరి-సచిన్ ఖేద్కర్-టిను ఆనంద్-సాయికుమార్-సర్వదామన్ బెనర్జీ- శివన్నారాయణ-జబర్దస్త్ మహేష్ తదితరులు

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

ఛాయాగ్రహణం: నిమిష్ రవి

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి

మహానటి.. సీతారామం చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించిన మలయాళ నటుడు.. దుల్కర్ సల్మాన్. 'తొలి ప్రేమ'.. 'సర్' చిత్రాలతో దర్శకుడిగా వెంకీ అట్లూరి కూడా తన ప్రతిభను చాటాడు. వీళ్లిద్దరి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం.. లక్కీ భాస్కర్. ఆసక్తికర టీజర్.. ట్రైలర్లతో అంచనాలను పెంచిన ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఇది 1980-90 దశకాల మధ్య నడిచే కథ. భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబయిలో మగధ అనే ప్రైవేటు బ్యాంకులో జూనియర్ అసిస్టెంటుగా పని చేస్తుంటాడు. అతడికి కుటుంబంలో చాలా బాధ్యతలుంటాయి. జీతం సరిపోక అప్పులు చేస్తూ వాటిని తీర్చలేక సతమతం అవుతుంటాడు. బ్యాంకులో ఉద్యోగంతో పాటు చిన్న పార్ట్ టైం పని చేసినా ఆదాయం సరిపోదు. కష్టపడి పని చేసినా ఉద్యోగంలో పదోన్నతి కూడా పొందలేకపోతున్న అతను ఒక రోజు అనూహ్య నిర్ణయం తీసుకుంటాడు. బ్యాంకులో డబ్బుతో ఒక ఇల్లీగల్ బిజినెస్ మొదలుపెడతాడు. దాని ద్వారా బాగానే డబ్బులు సంపాదిస్తాడు. రిస్కుతో కూడుకున్న ఈ పని వల్ల భాస్కర్ జీవితంలో అనూహ్య మార్పులు వస్తాయి. ఒక దశలో సీబీఐ అధికారుల కన్ను భాస్కర్ మీద పడుతుంది. అతను సంపాదించిన డబ్బుల లెక్క చూసి అధికారులు షాకవుతారు. ఇంతకీ అధికారులు భాస్కర్ గురించి తెలుసుకున్న విషయాలేంటి.. చివరికి ఈ స్కాం నుంచి భాస్కర్ బయటపడ్డాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

సినిమా తీసిన ప్రతి ఒక్కరూ తమ చిత్రం గురించి చాలా గొప్పగానే చెప్పుకుంటారు. విడుదల ముంగిట పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంటారు. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సైతం ఇటీవల 'లక్కీ భాస్కర్' గురించి ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చాడు. తమ సినిమాలో మిస్టేక్స్ అంటూ ఏమీ లేవని.. అలా ఉన్నాయని కనిపెడితే పార్టీ ఇస్తా అంటూ సవాలు విసిరాడు. సినిమా అన్నాక తప్పులుండవా.. లోపాలు ఎంచలేమా అని చాలామంది 'లక్కీ భాస్కర్' థియేటర్లలో కూర్చుంటారు కానీ.. శుభం కార్డు పడే సమయానికి నాగవంశీ మాటల్లో అతిశయోక్తి లేదని అంగీకరించాల్సిందే. ఈ సినిమా ఎన్ని వసూళ్లు సాధిస్తుంది.. ఈ జానర్ అందరికీ నచ్చుతుందా.. కమర్షియల్ గా దీని రీచ్ ఏ స్థాయిలో ఉంటుంది.. ఈ అంశాలన్నీ పక్కన పెడితే తాను ఎంచుకున్న జానర్లో 'పర్ఫెక్ట్' అనిపించే సినిమా తీశాడు వెంకీ అట్లూరి. తెలుగులో ఫైనాన్షియల్ క్రైమ్స్ మీద వచ్చిన థ్రిల్లర్స్ ఆల్ టైం బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటిగా 'లక్కీ భాస్కర్' నిలుస్తుంది.. ఈ జానర్లో దీన్నొక బెంచ్ మార్క్ లాగా చూస్తారు అనడంలో సందేహం లేదు. బాలీవుడ్ వాళ్లు మాత్రమే తీయగలరు అనుకునే కథాంశంతో తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే సినిమాను అందించాడు వెంకీ. 'స్కామ్ 1992' వెబ్ సిరీస్ చూసి స్ఫూర్తి పొందాడో ఏమో.. అందులో ఒక ఉపకథలా అనిపించే స్టోరీతో అంతకుమించి జనరంజకంగా సినిమా తీశాడీ యువ దర్శకుడు.

బ్యాంకుల్ని కొల్లగొట్టి.. స్టాక్ మార్కెట్లో మాయాజాలం చేసి.. 80-90 దశకాల్లోనే వేల కోట్లు ఆర్జించి.. చివరికి చట్టానికి దొరికిపోయిన హర్షద్ మెహతా కథను 'స్కామ్ 1992'లో అద్భుతంగా ఆవిష్కరించింది హన్సల్ మెహతా టీం. ఆ సిరీస్ చూసిన వాళ్లకు ఇలాంటి కాంప్లికేటెడ్ కథల్ని అంత ఆసక్తికరంగా తీయడం బాలీవుడ్ వాళ్లకే చెల్లు అనుకుని ఉంటారు. ఇలాంటి స్టోరీని తెలుగు తెరపై అస్సలు ఊహించలేం. కానీ వెంకీ అట్లూరి ఇలాంటి సాహసోపేత కథనే ఎంచుకుని.. దాన్ని ఇంకా జనరంజకంగా చూపించాడు 'లక్కీ భాస్కర్'లో. ఫైనాన్షియల్ స్కామ్స్ జరిగే తీరును ఇంకా సరళంగా.. అందరికీ అర్థమయ్యేలా.. ఆసక్తి రేకెత్తించేలా చూపించడమే కాక.. ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్స్.. దీనికి తోడు హీరోతో ఫైట్లు చేయించకుండానే విజిల్స్ కొట్టే హీరోయిక్ మూమెంట్స్ అందిస్తూ.. బలమైన ఫ్యామిలీ ఎమోషన్లను కూడా పండించి 'లక్కీ భాస్కర్'ను అన్ని వర్గాలూ చూడదగ్గ సినిమాగా మలిచాడు. తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలో ఇన్వాల్వ్ చేయించే 'లక్కీ భాస్కర్'.. ఎక్కడా బిగి సడలకుండా.. చివరికి వరకు అదే టెంపోను కొనసాగించి ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వదు.

'లక్కీ భాస్కర్' ప్రత్యేకత ఏంటంటే.. ఇది లెక్కలేసుకుని తీసిన సినిమా కాదు. హీరో ఇంట్రో ఇలా ఉండాలి.. ఎలివేషన్లు పడాలి.. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో పాటలు రావాలి.. అక్కడక్కడా హీరో ఫైట్లు చేయాలి.. ఇంటర్వెల్ బ్యాంగ్ పేలిపోవాలి.. సెంటిమెంట్ వర్కవుట్ చేయాలి.. క్లైమాక్స్ భారీతనం ఉండాలి.. ఇలా ఏ లెక్కలూ కనిపించవు. కానీ ఇందులో హీరోకు అదిరిపోయే ఎలివేషన్ చూస్తాం. ఎమోషన్లకు ఢోకా లేదు. ప్రేక్షకులు అడుగడుగునా ఉత్కంఠకు గురవుతారు.. కానీ ఏవీ కూడా కథను దాటి.. పనిగట్టుకుని పెట్టినట్లు అనిపించవు. వెంకీ అట్లూరి నీట్ గా ఓ కథను చెప్పాడు. కథను అనుసరించే ఏదైనా చేశాడు. అందులో భాగంగానే అన్ని ఎమోషన్లూ పండాయి. హర్షద్ మెహతా కథేంటో మనకు తెలుసు. అతనంత పెద్ద స్కామ్ చేయడానికి తెర వెనుక చాలామందే సహకరించే ఉంటారు. అలాంటి ఓ వ్యక్తి కల్పిత కథను 'లక్కీ భాస్కర్'లో చూస్తాం. ఆ వ్యక్తి జర్నీని ప్రతి ప్రేక్షకుడూ కనెక్ట్ అయ్యేలా చాలా ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు. సమాజంలో అత్యధికంగా కనిపించేది మధ్య తరగతి మనుషులే. అలాంటి ఓ మనిషి కథను ఎక్కువమంది రిలేటయ్యేలా చెప్పాడు వెంకీ. బాధ్యతల వలయంలో చిక్కుకుపోయిన ఓ మామూలు మధ్యతరగతి వ్యక్తి నిస్సహాయ స్థితికి చేరుకున్న స్థితిలో తనకు దొరికిన ఓ చిన్న అవకాశాన్ని పట్టుకుని ఎలా పైకి ఎదిగాడు.. ఆ ఎదుగుదలలో వ్యక్తిగా పతనం అయిపోతున్న దశలో తన తప్పు తెలుసుకుని దాన్ని ఎలా సరిదిద్దుకుని తనకు కథకు గొప్ప ముగింపు ఇచ్చుకున్నాడో ఇందులో చూస్తాం.

80, 90 దశకాల నాటి కాలంలో ముంబయి నేపథ్యంలో సాగే ఈ కథకు అథెంటిసిటీ తీసుకొచ్చేలా పర్ఫెక్ట్ సెటప్ సిద్ధం చేసుకోవడంతో చాలా త్వరగా ఆ వాతావరణంలోకి వెళ్లిపోతాం. ఇక భాస్కర్ ప్రపంచంలోకి వెళ్లిపోయి తనతో పాటు ట్రావెల్ చేయడానికి కూడా ఎంతో సమయం పట్టదు. బ్యాంకు కార్యకలాపాల్లో లొసుగులు.. అక్కడ జరిగే మోసాల నేపథ్యంలో కథను నడిపించడం అంటే కొంచెం బోరింగ్ వ్యవహారమే కానీ.. దాన్ని వెంకీ అట్లూరి దాన్ని రసవత్తరంగా చూపించాడు. హీరో పాత్ర తప్పు చేస్తున్నా దాన్ని ప్రేక్షకుడు నిరాకరించని విధంగా ఆ పాత్ర చుట్టూ పరిస్థితులను కల్పించడం ద్వారా తర్వాత వచ్చే సన్నివేశాలను జస్టిఫై చేశాడు. హీరో చేసే స్కామ్ తాలూకు వ్యవహారమంతా చాలా థ్రిల్లింగ్ గా నడుస్తుంది. చాలా సన్నివేశాలు విజిల్స్ కొట్టిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిపోతుంది. ద్వితీయార్ధంలో కథకు ఎక్కువ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు వెంకీ. హీరోయిన్ పాత్రను బలంగా తీర్చిదిద్దిన అతను.. కథలో కీలక మలుపుకు ఆ పాత్రను ఉపయోగించుకున్నాడు. హీరోలో రియలైజేషన్ వచ్చే సన్నివేశాలు బాగా పండాయి. హీరో ఓడిపోయినట్లుగా చూపించడంతో ఒక దశలో సినిమా భారంగా మారి ప్రేక్షకుడు డల్ అవుతారు. కానీ కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని క్లైమాక్సులో మాంచి జోష్ ఇచ్చాడు వెంకీ. అలా అని కథనూ పక్క దారి పట్టించలేదు. కథ చెడకుండా.. కమర్షియల్ సినిమాల్లో ఉండే హై ఇవ్వడం ద్వారా వెంకీ అట్లూరి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తెలుగులో కథను కథగా చెప్పరు అనే కంప్లైంట్స్ చేసేవాళ్లు 'లక్కీ భాస్కర్'పై ఓ లుక్కేయాల్సిందే. అదే సమయంలో కమర్షియల్ సినిమాల నుంచి ఆశించే కిక్కు కూడా ఇందులో దొరుకుతుంది. 'స్కామ్ 1992' చూసిన వాళ్లకు ఇది కొత్తగా అనిపించకపోవచ్చు. కమర్షియల్ గా దీని రీచ్ ఎంత వరకు ఉంటుందనే సందేహాలు కలుగుతాయి. కానీ ట్రైలర్ చూసి ఆసక్తి ప్రదర్శించిన వారికి మాత్రం 'లక్కీ భాస్కర్' విందు భోజనం లాంటి సినిమా.

నటీనటులు:

దుల్కర్ సల్మాన్ ఫిల్మోగ్రఫీ చూస్తే.. అతను ఆషామాషీగా ఏ కథనూ ఒప్పుకోడని అర్థమవుతుంది. మలయాళంలో కల్ట్ మూవీస్ చేసిన అతను తెలుగులో సినిమా చేశాడంటే అందులో చాలా ప్రత్యేకత ఉంటుందనే భావించాలి. మహానటి.. సీతారామం చిత్రాల్లో ఆ ప్రత్యేకత చూడవచ్చు. పర భాషా నటుడు అనే ఫీలింగ్ రాకుండా ఆ చిత్రాల్లో అద్భుతంగా తన పాత్రలను పోషించిన దుల్కర్.. 'లక్కీ భాస్కర్'తో ఇంకొన్ని మెట్లు ఎక్కేశాడు. భాస్కర్ అనే పాత్ర తప్ప దుల్కర్ కనిపించడు ఈ చిత్రంలో. అంత బాగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ప్రేక్షకులను ఆ పాత్రతో పాటు ట్రావెల్ చేయించాడు. తన లుక్.. బాడీ లాంగ్వేజ్.. హావభావాలు అన్నీ కూడా పర్ఫెక్ట్ గా కుదిరాయి భాస్కర్ పాత్రకు. తన కెరీర్లో 'ది బెస్ట్' క్యారెక్టర్లలో ఇదొకటిగా నిలిచేలా అద్భుతంగా ఆ పాత్రను పండించాడు. మీనాక్షి చౌదరిని ఒక గ్లామర్ డాల్ లాగా చూస్తున్న ప్రేక్షకులకు తనలోని మంచి నటి ఈ సినిమాతో పరిచయం అవుతుంది. ఒక వ్యక్తిత్వం ఉన్న మధ్య తరగతి ఇల్లాలిగా ఆమె చాలా బాగా నటించింది. కథలో కీలక మలుపులకు దారి తీసే సన్నివేశాల్లో మీనాక్షి నటన స్టాండౌట్ గా నిలుస్తుంది. ఈ సినిమా తర్వాత మీనాక్షిని చూసే దృష్టికోణమే మారిపోవచ్చు. రాంకీ తక్కువ సేపే కనిపించినా తన పాత్రకు వెయిట్ తీసుకొచ్చాడు. రాజ్ కుమార్ కసిరెడ్డి హీరో ఫ్రెండు పాత్రలో రాణించాడు. సీరియస్ గా సాగే సినిమాలో అతను అక్కడక్కడా కొంచెం కామెడీ టచ్ ఇచ్చాడు. టిను ఆనంద్.. సచిన్ ఖేద్కర్ తమ పాత్రల పరిధిలో బాగా చేశారు. సీబీఐ అధికారి పాత్రలో సాయికుమార్ కూడా ఓకే. శివన్నారాయణ.. మానస చౌదరి.. ఇతర క్యారెక్టర్ రోల్స్ చేసిన ఆర్టిస్టులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం:

జి.వి.ప్రకాష్ కుమార్ ఇలాంటి ఇంటెన్స్ సినిమాలకు అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తాడని పేరును మరోసారి నిలబెట్టుకున్నాడు. తన బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో.. కథలో ఉత్కంఠను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. జి.వి. పాటలు కూడా బాగున్నాయి. అవి కథలో ఇమిడిపోయాయి. నిమిష్ రవి ఛాయాగ్రహణం చాలా బాగుంది. ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి విజువల్స్. ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగా చేశారు. ఈ విషయంలో బాలీవుడ్ సినిమాల్లో కనిపించే పర్ఫెక్షన్ చూడొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. రచయితగా.. దర్శకుడిగా వెంకీ అట్లూరి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని.. ప్రేక్షకులకూ కొత్త అనుభూతిని పంచాడు. అతడిలో ఇంత డెప్త్ ఉందా అనిపించేలా చేస్తుంది 'లక్కీ భాస్కర్'. తన కథకు 'స్కామ్ 1992' స్ఫూర్తి కావచ్చేమో కానీ.. అందులోంచే తీసుకున్న ఒక ఉపకథలా అనిపించే 'లక్కీ భాస్కర్' దాన్ని మించిన ఎంటర్టైనర్ గా మారింది. మంచి బిగితో కథ రాసుకుని.. బలమైన పాత్రలు డిజైన్ చేసుకుని.. రేసీ స్క్రీన్ ప్లేతో.. షార్ప్ డైలాగులతో సినిమాను పరుగులు పెట్టించాడు వెంకీ. తన కెరీర్లో ఇది బెస్ట్ వర్క్ అనడంలో మరో మాట లేదు. ఇక ముందు కూడా అతను ఇంత పర్ఫెక్ట్ గా కథ రాయగలడా.. సినిమా తీయగలడా అన్నది చూడాలి.

చివరగా: లక్కీ భాస్కర్.. ది విన్నర్

రేటింగ్- 3/5

Tags:    

Similar News