'బాహుబలి 2'ని బీట్ చేసిన మహారాజ..!
అయితే చైనా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్.. లేటెస్టుగా మరో అరుదైన ఫీట్ సాధించింది.
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ''మహారాజ''. గతేడాది కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ సినిమా.. తెలుగులోనూ మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల చైనాలో రిలీజ్ అయింది. పొరుగు దేశంలో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చూసి చైనీయులు కన్నీరు మున్నీరవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే చైనా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్.. లేటెస్టుగా మరో అరుదైన ఫీట్ సాధించింది.
'మహారాజ' మూవీ చైనాలో ఇప్పటి వరకూ రూ. 91.55 కోట్ల వసూళ్లను రాబట్టి, 100 కోట్ల మైల్ స్టోన్ మార్క్ దిశగా పయనిస్తోంది. తద్వారా గడిచిన ఐదేళ్ళలో చైనా దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అవతరించింది. ఈ విషయాన్ని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్ వేదికగా వెల్లడించారు. ఇక తూర్పు లడఖ్ లో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ముగిసిన తర్వాత చైనాలో రిలీజైన మొదటి భారతీయ చిత్రం ఇదే కావడం గమనార్హం.
ఇదిలా ఉంటే చైనాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్-10 సినిమాల లిస్టులో చేరిన ఒకే ఒక్క సౌత్ మూవీగా రికార్డులకు ఎక్కింది. అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' సినిమా 1480 కోట్ల వసూళ్లతో చైనాలో అత్యధిక వసూళ్లు అందుకున్న ఇండియన్ సినిమాగా అగ్ర స్థానంలో నిలిచింది. 'సీక్రెట్ సూపర్ స్టార్' (840 కోట్లు), 'అందాదున్' (368 కోట్లు), 'భజరంగీ భాయ్ జాన్' (323 కోట్లు), 'హిందీ మీడియం' (238 కోట్లు), 'హిచ్కీ' (170 కోట్లు), 'పీకే' (134 కోట్లు), 'మామ్' (130 కోట్లు), 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ' (108 కోట్లు) తో ఉన్నాయి. ఇప్పుడు 'మహారాజా' సుమారు 92 కోట్ల వసూళ్లతో 10వ స్థానంలో నిలిచింది.
దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి 2' సినిమా చైనాలో రూ. 80 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా 'మహారాజా' సినిమా దాన్ని క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. 'బాహుబలి' సినిమా చైనాలో 50 కోట్లు వసూలు చేస్తే, RRR మూవీ 40 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. ఈ సినిమాతో కంపేర్ చేసి చూస్తే మహారాజ సినిమాకి చైనాలో విశేషమైన ఆదరణ దక్కిందనే చెప్పాలి. ఇది త్వరలోనే 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
'మహారాజ' చిత్రానికి నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు. ఇది విజయ్ సేతుపతి కెరీర్ లో మైలురాయి 50వ చిత్రం. దీంట్లో అనురాగ్ కశ్యప్, అభిరామి, మమతా మోహన్‌దాస్, భారతీరాజా, నట్టి సుబ్రహ్మణ్యన్, దివ్య భారతి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. బి. అజనీష్ ;లోక్ నాథ్ సంగీతం సమకూర్చగా.. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. 2024 జూన్ 14న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. 20 కోట్ల బడ్జెట్ తో తీస్తే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు చైనా వసూళ్లతో కలిపి వరల్డ్ వైడ్ గా 190 కోట్ల మార్క్ ను అధిగమించింది.