'మహారాజ' మూవీ రివ్యూ

ఇప్పుడతను నటుడిగా 50వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే.. మహారాజ. తెలుగులోనూ మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

Update: 2024-06-14 07:09 GMT

'మహారాజ' మూవీ రివ్యూ

నటీనటులు: విజయ్ సేతుపతి-అనురాగ్ కశ్యప్-వినోద్ సాగర్-నటరాజన్ సుబ్రహ్మణ్యం-మమత మోహన్ దాస్-మునీష్ కాంత్-అభిరామి-దివ్యభారతి తదితరులు

సంగీతం: అజనీష్ లోకనాథ్

ఛాయాగ్రహణం: దినేష్ పురుషోత్తమన్

నిర్మాతలు: సుధన్ సుందరం-జగదీష్ పళనిస్వామి

రచన-దర్శకత్వం: నిదిలన్ సామినాథన్

విజయ్ సేతుపతిని కేవలం తమిళ నటుడిగా ఎవ్వరూ చూడరు. విలక్షణ పాత్రలతో బహు భాషల్లో అతను పేరు సంపాదించాడు. ఇప్పుడతను నటుడిగా 50వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే.. మహారాజ. తెలుగులోనూ మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: మహారాజ (విజయ్ సేతుపతి) ఒక సెలూన్ షాప్ నడిపే మధ్య తరగతి వ్యక్తి. అతను ఒక రోజు ఒంటి మీద గాయాలతో పోలీస్ స్టేషన్లో అడుగు పెడతాడు. తనను ముగ్గురు వ్యక్తులు కొట్టి తన ఇంట్లో ఉన్న లక్ష్మిని తీసుకెళ్లిపోయారని కంప్లైంట్ చేస్తాడు. లక్ష్మి అంటే అమ్మాయి అని అంతా అనుకుంటారు. కానీ అది ఒక చెత్త డబ్బా అని తెలిసి పోలీసులు షాకవుతారు. ఆ చెత్త డబ్బా వెతికి పెడితే ఏడు లక్షల డబ్బు కూడా ఇవ్వడానికి అతను సిద్ధపడతాడు. ఇంతకీ ఆ చెత్త డబ్బా కథేంటి.. నిజంగా దాని కోసమే మహారాజ పోలీస్ స్టేషన్ కు వచ్చాడా.. అతడి కథేంటి.. తన లక్ష్యమేంటి.. దాన్ని అతను నెరవేర్చుకున్నాడా.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే.. మహారాజ.

కథనం-విశ్లేషణ: పూర్తిగా ఓ కొత్త కథను సృష్టించి.. దాన్ని ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్దడం సామాన్యమైన విషయం కాదు. ఇది అరుదుగా జరుగుతుంటుంది. అది అందరికీ సాధ్యం కాదు కూడా. ఐతే ఎంచుకున్నది పాత కథ అయినా.. దాన్ని కొంచెం భిన్నమైన స్టయిల్లో చెప్పడం ద్వారా ప్రేక్షకులను మెప్పించవచ్చు. ఇలా కూడా దర్శకుడిగా బలమైన ముద్ర వేయొచ్చు. కొత్త దర్శకులు చాలామంది చేసే పనే ఇది. ఇప్పుడు కోలీవుడ్ డెబ్యూ డైరెక్టర్ నిదిలన్ సామినాథన్ కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నాడు. 'మహారాజ'లో కథగా చెప్పుకోవడానికి ఏ ప్రత్యేకంగా ఏమీ లేదు. తన కూతురికి అన్యాయం చేసిన వ్యక్తుల మీద ప్రతీకారం తీర్చుకునే సామాన్యుడి కథ ఇది. ఈ లైన్ చెబితే.. ఏముంది ఇందులో అనేస్తారు. కానీ ఆ పాత కథనే భిన్నమైన కథనంతో.. ఎంగేజింగ్ నరేషన్ తో ఆసక్తి రేకెత్తించేలా తెరపై ప్రెజెంట్ చేయడంలో నిదిలన్ విజయవంతమయ్యాడు. విజయ్ సేతుపతి లాంటి పెర్ఫామర్ చేయడం వల్ల హీరో పాత్రకు.. అనురాగ్ కశ్యప్ లాంటి రొటీన్ కు భిన్నమైన నటుడు చేయడం వల్ల విలన్ పాత్రకు చేకూరిన ప్రత్యేకత కూడా ఈ సినిమాకు బలం చేకూర్చాయి.

తన చెత్త డబ్బా పోయిందని హీరో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 'మహారాజ' కథ మొదలవుతుంది. హీరో చేసిన ఫిర్యాదుకు పోలీసులే కాదు.. ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతారు. ప్రేక్షకుల్లో ఈ క్యూరియాసిటీ రేకెత్తించడం ద్వారా త్వరగానే కథలో ఇన్వాల్వ్ చేయగలిగాడు దర్శకుడు. హీరో అసలు ఉద్దేశం వేరని అర్థమవుతున్నా.. తన ప్లానేంటి అని.. తనేం చేయబోతున్నాడు.. తన గతమేంటి అనే ఆసక్తి కలుగుతుంది. తన చెత్త డబ్బాను వెతికి పెట్టమంటూ స్టేషన్ చుట్టూ తిరుగుతూ.. పోలీసులతో చీవాట్లు-దెబ్బలు తినే సన్నివేశాలు కొంచెం రిపిటీటివ్ గా.. సాగతీతగా అనిపించినా.. కథ విషయంలో క్యూరియాసిటీ మాత్రం కొనసాగుతుంది. వర్తమానంలో వచ్చే సన్నివేశాలు మామూలుగా అనిపించినా.. గతంలోకి వెళ్లి విలన్ పాత్ర నేపథ్యాన్ని.. మరోవైపు హీరో కథను సమాంతరంగా చూపిస్తూ స్క్రీన్ ప్లేలో బిగి సడలకుండా చూశాడు దర్శకుడు. వేర్వేరు చోట్ల నడిచే కథ కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించినా.. సన్నివేశాలైతే ఆసక్తికరంగా అనిపిస్తాయి.

సెలూన్ షాప్ నడుపుకునే హీరో.. ఒంటరి మహిళలున్న ఇళ్లను టార్గెట్ చేసుకుని అక్కడ దొంగతనం చేసి అదే ఇంట్లో వంట చేసుకుని భోజనం కూడా చేసి వచ్చే విలన్.. ఇలా ప్రధాన పాత్రలను కొంచెం భిన్నంగా తీర్చిదిద్దుకోవడంలోనే దర్శకుడి ప్రత్యేకత కనిపిస్తుంది. దాని వల్ల సన్నివేశాలు కొంచెం భిన్నంగా అనిపిస్తాయి. విలన్లోని ప్రతికూల కోణాన్ని చూపిస్తూనే అతడిలోని హ్యూమన్ యాంగిల్ ను కూడా ఎలివేట్ చేయడం ద్వారా తన పాత్రకు ప్రత్యేకత తీసుకొచ్చాడు దర్శకుడు. ప్రథమార్ధం కొంచెం సాగతీతగా అనిపించినా.. ద్వితీయార్ధంలో కథలో వచ్చే మలుపులు.. గుండెలు పిండేసే ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. ఇక క్లైమాక్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. అక్కడ వచ్చే ట్విస్టే సినిమాకు ప్రాణం. ముందు కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. చివరి అరగంటలో భావోద్వేగాలు సినిమా గ్రాఫ్ ను పెంచుతాయి. హీరో ప్రతీకారాన్ని ప్రేక్షకులు కూడా ఫీలయ్యేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. దీంతో పతాక సన్నివేశాల్లో ఎమోషన్ బాగా వర్కవుట్ అయింది. ముగింపులో మంచి మార్కులు కొట్టేసే 'మహారాజ' ప్రేక్షకులను సంతృప్తిగా బయటికి వచ్చేలా చేస్తుంది. సినిమాలో కొంచెం తమిళ ఫ్లేవర్ ఉన్నప్పటికీ.. ఈ కథలోని ఎమోషన్ మాత్రం యూనివర్శలే. కొన్ని లోపాలున్నప్పటికీ.. 'మహారాజ' ఒకసారి చూడ్డానికి ఢోకా లేని చిత్రమే.

నటీనటులు: విజయ్ సేతుపతి సినిమా అంటే తన పెర్ఫామెన్స్ మీద ఎక్కువ అంచనాలు పెట్టుకుంటాం. కానీ ఈ చిత్రంలో అతను తన ప్రత్యేకతను చాటుకునే సన్నివేశాలు తక్కువే. చాలా వరకు మూడీగా ఉంటూ తన పాత్రను నడిపించేశాడు. సేతుపతి చేయడం వల్ల పాత్రకు ఒక నిండుదనం వచ్చింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ కు తిరుగులేదు. కానీ ఈ పాత్రలో పెర్ఫామెన్స్ స్కోప్ మాత్రం తక్కువే. సేతుపతి బాగా చేయలేదు అనేమీ లేదు కానీ.. ఇంకా తన నుంచి ఎక్కువ ఆశిస్తాం. అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో ప్రత్యేకంగా అనిపిస్తాడు. హీరోను మించి సినిమాలో అతనే హైలైట్ అయ్యాడు. ఇది తన సినిమాలా అనిపిస్తుంది. మమత మోహన్ దాస్ మరీ నామమాత్రమైన పాత్ర చేసింది. అందులో ఎవరైనా సహాయ నటి ఉన్నా ఓకే. సీఐ పాత్రలో నటరాజన్ బాగా చేశాడు. ప్రి క్లైమాక్స్ లో తన పాత్ర విజిల్స్ కొట్టిస్తుంది. వినోద్ సాగర్.. మునీష్ కాంత్.. అభిరామి... మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతిక వర్గం: కన్నడ టాలెంటెండ్ మ్యూజిక్ డైరెక్టర్ 'మహారాజ'కు అజనీష్ లోకనాథ్ మంచి స్కోర్ అందించాడు. ఎమోషనల్ సీన్లలో నేపథ్య సంగీతం బాగా పండింది. పాటలకు ఇందులో ప్రాధాన్యం లేదు. దినేష్ పురుషోత్తమన్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. దర్శకుడు నిదిలన్ సామినాథన్ బలమైన ముద్రే వేశాడు. ఎంచుకున్న కథ సాధారణమే అయినా.. దాన్ని డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో నడిపించాడు. డ్రామాను.. ఎమోషన్లను అతను బాాగా పండించాడు. చివరి అరగంటలో.. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో దర్శకుడి ప్రతిభ స్పష్టంగా తెలుస్తుంది.

చివరగా: మహారాజ.. రివెంజ్ డ్రామా కొత్త స్టయిల్లో

రేటింగ్-3/5

Tags:    

Similar News