గుంటూరు కారం.. టెన్షన్ తీర్చేసిన మహేష్
గుంటూరు కారం సంక్రాంతికి వస్తుందా అని అడిగితే.. కచ్చితంగా ఆ పండక్కే ఈ చిత్రం రిలీజవుతుందని.. అందరినీ ఆనందంలో ముంచెత్తుతుందని మహేష్ ధీమా వ్యక్తం చేశాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం గుంటూరు కారం గురించి ఇప్పటిదాకా ఎన్ని నెగెటివ్ న్యూస్‌లు వచ్చాయో.. రూమర్లు వినిపించాయో లెక్కే లేదు. స్క్రిప్టు.. ఆర్టిస్టులు.. టెక్నీషియన్లు..షెడ్యూళ్లు.. ఇలా పలు విషయాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. షూటింగ్ అనుకున్నట్లుగా ముందుకు సాగకపోవడంతో ఈ సినిమా అనుకున్నట్లుగా సంక్రాంతి రిలీజవుతుందా అనే విషయంలో చాలా సందేహాలున్నాయి.
చిత్ర బృందం కూడా ఈ విషయంలో మౌనం వహిస్తుండటం.. సినిమా గురించి నెగెటివ్ న్యూస్‌లు వచ్చినపుడు ఖండించకపోవడంతో అనుమానాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో స్వయంగా మహేషే రిలీజ్ విషయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి అభిమానుల ఆందోళనకు తెరదించాడు.
తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బిగ్-సి సంస్థ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రెస్ మీట్లో పాల్గొన్న మహేష్.. సినిమా సంబంధిత ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చాడు. గుంటూరు కారం సంక్రాంతికి వస్తుందా అని అడిగితే.. కచ్చితంగా ఆ పండక్కే ఈ చిత్రం రిలీజవుతుందని.. అందరినీ ఆనందంలో ముంచెత్తుతుందని మహేష్ ధీమా వ్యక్తం చేశాడు.
మహేష్ వీడియోపై నిర్మాత నాగవంశీ కూడా స్పందిస్తూ. . జనవరి 12న తమ చిత్రం రిలీజవుతుందని ధ్రువీకరించాడు. ఇక తరచుగా మహేష్ విదేశీ పర్యటనలకు వెళ్లడం.. గుంటూరు కారం షెడ్యూల్స్ ఆగిపోవడం గురించి రకరకాల ప్రచారాలు జరగ్గా.. దీని గురించి మహేష్‌ను అడిగితే.. తాను హాలిడేకు వెళ్లినపుడు ఫొటోలు పెడుతున్నా కాబట్టే అందరికీ విషయం తెలుస్తోందని.. ఇందులో దాపరికం ఏమీ లేదని.. అయినా తాను హాలిడేకు వెళ్తే వేరే వాళ్లు సంతోషించడానికి, బాధ పడటానికి ఏముందని మహేష్ ఎదురు ప్రశ్నించాడు.