ఒణికిపోతూనే రొమాన్స్ చేసాం: మాళ‌విక‌

ఒక అద్భుత శృంగార డ్రామాతో తన బాలీవుడ్ కలను నెరవేర్చుకోవ‌డంపై త‌న ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Update: 2024-09-14 19:30 GMT

మాళవిక మోహనన్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. విజయ్ 'మాస్ట‌ర్' సినిమాలో న‌టించింది. ఇటీవ‌ల ప్ర‌భాస్ రాజా సాబ్ లో న‌టిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. రాజా సాబ్ 2025 లో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా విడుద‌ల కానుంది. ఈలోగానే సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి యాక్షన్ థ్రిల్లర్ `యుధ్రా`తో మాళ‌విక‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రం నుంచి రొమాంటిక్ ట్రాక్ `సాథియా`లో ఈ జంట‌ కెమిస్ట్రీ అంద‌రి దృష్టిని ఆకర్షించింది. అయినప్పటికీ గడ్డకట్టే మంచులో రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించడం ఒక సవాల్ గా మారింద‌ని మాళవిక వెల్లడించింది. అడ్డంకులు ఉన్నప్పటికీ యాక్షన్ సన్నివేశాలలో సిద్ధాంత్ అంకితభావాన్ని మెచ్చుకుంది. ఒక అద్భుత శృంగార డ్రామాతో తన బాలీవుడ్ కలను నెరవేర్చుకోవ‌డంపై త‌న ఆనందాన్ని వ్యక్తం చేసింది.

అంద‌మైన‌ త‌మిళ‌మ్మాయి యువ‌హీరో సిద్ధాంత్ చతుర్వేదితో రొమాన్స్ చేయ‌డం గ‌మ్మ‌త్తుగా ఉంద‌ని అంది. రవి ఉద్యవార్ యుధ్ర‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిర్మాతలు ఈ చిత్రం నుండి ట్రైలర్, పాటను విడుదల చేయగా వాటికి చ‌క్క‌ని స్పంద‌న వ‌స్తోంది. ఇటీవల విడుదల చేసిన `సాథియా` పాటలో ఈ అంద‌మైన జంట‌ కెమిస్ట్రీ హైలైట్ గా నిలుస్తోంది. అయితే మాళ‌విక మీడియాతో మాట్లాడుతూ.. ఈ మూవీ కోసం సన్నిహిత సన్నివేశాలను చిత్రీకరించడంలో ప‌లు స‌వాళ్లు ఎదుర‌య్యాయ‌ని వెల్ల‌డించింది. అక్క‌డ ఉన్న వాతావ‌ర‌ణ‌ ప‌రిస్థితుల్లో సాన్నిహిత్యాన్ని కొన‌సాగించ‌డం కష్టమని తెలిపింది. అయితే సెట్‌లో సీన్ విష‌యంలో సమన్వయకర్తలు ఉండటం వల్ల ప‌ని వేగంగా పూర్తి చేయ‌గ‌లిగామ‌ని అంది. అయితే సాథియా పాటను చిత్రీకరించడం ఊహించనంత‌ సవాల్ గా మారింది. షూట్ సమయంలో చల్లని గ‌డ్డ‌క‌ట్టే వాతావరణంలో ఇంటిమేట్ సన్నివేశాలను చేయ‌డం క‌ష్ట‌త‌రంగా మారింద‌ని మాళవిక వెల్లడించింది. తాము గడ్డకట్టే చ‌లితో ఒణికిపోయామ‌ని వెల్ల‌డించింది.

దీంతో రొమాన్స్ పై దృష్టి పెట్టడం చాలా గమ్మత్తుగా మారింది. మేం అలలకు వ్యతిరేకంగా ఉన్నాము.. పూర్తిగా తడిసిపోయాము.. అక్క‌డ అంతా గడ్డకట్టింది! అని మాళ‌విక‌ వెల్ల‌డించింది. చివ‌రి ముద్దు స‌న్నివేశం కూడా క‌ష్టంగానే షూట్ చేసామ‌ని వెల్ల‌డించింది. అంతేకాదు షూట్‌లో చాలా స‌మ‌యం నవ్వులతో నిండిపోయింద‌ని.. తెరవెనుక అనుభవాన్ని కూడా మాళ‌విక వినోదభరితంగా వివరించింది. క‌ష్ట‌ప‌డి చేసిన‌ ఈ పాట ఒక అద్భుతమైన రొమాంటిక్ గీతంగా నిలుస్తుంద‌ని తెలిపింది. ఇది సుందరమైన బీచ్ సెట్టింగ్‌లు.. డ్ర‌మ‌టిక‌ల్ స్లో-మోషన్ షాట్‌లతో సంపూర్ణంగా అంద‌రూ మెచ్చేలా రూపొందింద‌ని పేర్కొంది. ఆమె తన కలను సాకారం చేసుకోవడం కోసం తాను చూస్తూ పెరిగిన రొమాంటిక్ చిత్రాలను గుర్తుకు తెచ్చే సన్నివేశంలో భాగం కావడంపై ఎగ్జ‌యిట్ మెంట్ ని షేర్ చేసింది.

మాళవిక తన సహనటుడు సిద్ధాంత్ చతుర్వేది యాక్షన్‌ని మెచ్చుకుంది. ఫేక్ కిక్‌లు.. పంచ్‌లు చేయాల్సిన క్లిష్టమైన సన్నివేశాలున్నా అత‌డు చాలా అద్భుతంగా చేసాడ‌ని చెప్పింది. అతడు ఒకే షాట్‌లో 10-15 మూవ్‌లు చేయడం నేను చూశాను అని వెల్ల‌డించింది.

Tags:    

Similar News