హుస్సేన్ సాగర్ లో తగలబడిన 2 బోట్లు.. కారణం ఇదే
ఇప్పటివరకు ఎప్పుడూ జరగని అనూహ్య దుర్ఘటన హైదరాబాద్ మహానగర నడి బొడ్డున ఉండే హుస్సేన్ సాగర్ లో చోటు చేసుకుంది.
ఇప్పటివరకు ఎప్పుడూ జరగని అనూహ్య దుర్ఘటన హైదరాబాద్ మహానగర నడి బొడ్డున ఉండే హుస్సేన్ సాగర్ లో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి 9 గంటల వేళలో జరిగిన ఒక కార్యక్రమం ఈ ప్రమాదానికి కారణమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒకరు మరణించగా.. మరో నలుగురు గాయాలపాలైనట్లుగా తెలుస్తోంది. ఇంతకూ సాగర్ లో అగ్నిప్రమాదం జరగటం ఏమిటి? రెండు బోట్లు తగలబడిపోవటం ఏమిటి? అన్న అంశంలోకి వెళితే..
మహా హారతి పేరుతో బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమం ఈ ప్రమాదానికి కారణమైంది. హుస్సేన్ సాగర్ కు హారతి సందర్భంగా హుస్సేన్ సాగర్ మధ్యలో రెండు బోట్లలో భారీ బాణసంచాను పేల్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉత్సాహభరితంగా టపాసుల్ని కాలుస్తున్న వేళ.. నిప్పు రవ్వలు బోటులోని క్రాకర్స్ మీద పడటంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణరాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత అక్కడి నుంచి వారు వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఒక జెట్టీలో బాణసంచాను ఉంచి.. వాటిని పేల్చేందుకు ఐదుగురు సహాయకులు అందులో ఎక్కారు. ఈ జెట్టీని మరో బోటుకు కట్టి సాగర్ లోకి తీసుకెళ్లి బాణసంచాను పేల్చటం మొదలు పెట్టారు. రాకెట్ పైకి విసిరే క్రమంలో అది అక్కడే ఉన్న బాణసంచాపై పడి పేలటంతో మంటలు చెలరేగాయి. గణపతి అనే వ్యక్తి వందశాతం కాలినట్లుగా తెలుస్తోంది. అపస్మారక స్థితిలో చేరిన ఆయన్ను సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. మరో నలుగురికి గాయాలు కాగా.. వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో రెండు బోట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన జరిగిన విషయాన్ని తెలుసుకున్నంతనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. హుస్సేన్ సాగర్ మధ్యలో ఈ ఘటన చోటు చేసుకోవటంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.