వెండితెరపైకి మైఖేల్ జాక్సన్ బయోపిక్
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ జీవితం వెండితెరకెక్కుతోంది. 'మైఖేల్' అనేది బయోపిక్ టైటిల్
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ జీవితం వెండితెరకెక్కుతోంది. 'మైఖేల్' అనేది బయోపిక్ టైటిల్. లయన్స్ గేట్ స్టూడియోస్ - యూనివర్శల్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సంచలన జీవితకథను సినిమాగా నిర్మిస్తున్నాయి. సంచలన దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చారిత్రక 'బోహేమియన్ రాప్సోడీ' వెనుక ఉన్న మేధావి గ్రాహం కింగ్ కథను ఆయన తెరకెక్కించారు. 'మైఖేల్' కేవలం బయోపిక్ అనేదాని కంటే అంతకుమించి అనిపించే విధంగా చిత్రీకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పాప్ సంగీత ప్రపంచంలో ఉద్విగ్న చరిత్ర కలిగిన గొప్ప ప్రతిభావంతుడు మైఖేల్ జాక్సన్ జీవితకథను అతడి ఆత్మలోకి లీనమయ్యేలా తీర్చిదిద్దాలనే ప్రయత్నం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 18 ఏప్రిల్ 2025న విడుదల కానుందని తాజాగా ప్రకటించారు.
టైటిల్ పాత్రధారిని కూడా ఇప్పటికే ఎంపిక చేసారు. మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్.. దిగ్గజ పాప్ సంచలనం స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ప్రధాన పాత్రలో తెరంగేట్రం చేయనున్నాడు. ప్రఖ్యాత హాలీవుడ్ మీడియా వెరైటీ అందించిన కథనం ప్రకారం.. ఈనెల 22 న ఈ బయోపిక్ చిత్రీకరణను ప్రారంభించనున్నారు. మైఖేల్ అసాధారణ జీవితకథలో ఉన్న లోతుపాతుల్ని తెరపై చూడాలని అభిమానులలో ఎంతో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ బయోపిక్ విపరీతమైన అంచనాలను సృష్టిస్తోంది. మైఖేల్ అనేది కేవలం పాప్ కింగ్‌గా ఎదిగిన వ్యక్తి కథ మాత్రమే కాదు.. అతడి జీవితంలో ఎన్నోసంక్లిష్ఠ దశలు ఉన్నాయి. ఈ కథను నిజాయితీతో చిత్రీకరించాల్సి ఉందని దర్శకుడు అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో జాక్సన్ విజయాలు విషాదాలను చూపనున్నారు. మైఖేల్ జాక్సన్ వ్యక్తిగత పోరాటాల నేపథ్యం రక్తి కట్టించనుంది.
జాక్సన్ వ్యక్తిగత పోరాటాలు .. అసాధారణ సృజనాత్మక ప్రజ్ఞ.. అత్యంత ఐకానిక్ ప్రదర్శనలను తెరపై ఆవిష్కరిస్తారు. అయితే మైఖేల్ జాక్సన్ జీవితంలో వివాదాలు ఎన్నో ఉన్నాయి. మైఖేల్ జాక్సన్ బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిని బయోపిక్ లో చూపిస్తారా లేదా? అన్నది వేచి చూడాలి. జాక్సన్ ఎస్టేట్‌ను నిర్వహించే జాన్ బ్రాంకా, జాన్ మెక్ క్లైన్ కథనాన్ని ప్రభావితం చేయవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ చిత్రానికి వారే నిర్మాతలు కావడం కూడా ఈ అంశం చుట్టూ ఉన్న సందిగ్ధతకు కారణమవుతున్నాయి. మైఖేల్ జాక్సన్ న్యాయ పోరాటాలు.. అంతిమంగా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం సహా పాప్ స్టార్ గా జీవితంలోని సంక్లిష్ట అంశాలను తెరపై ఎలా ఆవిష్కరిస్తారో వేచి చూడాల్సి ఉంది. 'మైఖేల్' కేవలం సినిమా మాత్రమే కాదు.. ఇది ఒక సాంస్కృతిక కార్యక్రమం.. దీని ప్రభావం తరతరాలుగా అందరి గుండెల్లో ప్రతిధ్వనించే కళాకారుడికి నివాళి. 18 ఏప్రిల్ 2025కి కౌంట్‌డౌన్ ప్రారంభం అయింది. మైఖేల్ జాక్సన్ పాప్ ప్రపంచపు రారాజుగా ఏలిన కాలాన్ని తెరపై ఎలా చూపిస్తారో చూడాలన్న తపన అభిమానులకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా జాక్సన్ వీరాభిమానులు ఎంతో ఉత్కంఠగా వేచి చూసే తరుణమిది.