47 ఏళ్లుగా ఆదరిస్తున్న వారికి నా బహుమానం

మోహన్‌లాల్‌ మాట్లాడుతూ... తన 47 ఏళ్ల సినీ కెరీర్‌లో 360 సినిమాల్లో నటించాను. ఒకానొక సమయంలో ఏడాదిలో 36 సినిమాలు చేశాను.

Update: 2025-01-08 23:30 GMT

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ 47 ఏళ్ల సినీ కెరీర్‌లో మొదటి సారి 'బరోజ్‌' సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ 47 ఏళ్లలో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో ఆయన నటించారు. మొదటి సారి మెగా ఫోన్‌ పట్టి 'బరోజ్‌' సినిమాను రూపొందించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బరోజ్‌ సినిమాతో దర్శకుడిగానే కాకుండా నటుడిగా మరోసారి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. దర్శకుడిగా ఇన్నేళ్లు చేయకుండా ఇప్పుడే చేయడానికి కారణం ఏంటి అంటూ కొందరు ప్రశ్నించిన సమయంలో మోహన్‌ లాల్‌ నుంచి ఆసక్తికర సమాధానం వచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మోహన్‌ లాల్‌ తన సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మోహన్‌లాల్‌ మాట్లాడుతూ... తన 47 ఏళ్ల సినీ కెరీర్‌లో 360 సినిమాల్లో నటించాను. ఒకానొక సమయంలో ఏడాదిలో 36 సినిమాలు చేశాను. సినిమాపై నాకు ఉన్న ఆసక్తి కారణంగానే అన్ని సినిమాలు చేయగలిగాను. సినిమా ఇండస్ట్రీలో ఎన్నేళ్లు ఉన్నా నాకు ఆసక్తి తగ్గదు. సినిమా ఇండస్ట్రీలో నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ప్రేక్షకులు. వారి ప్రోత్సహంతోనే సినిమాలు చేశాను. ఇన్నాళ్ల సినీ ప్రస్థానం లో ఎన్నో సినిమాల్లో నటించాను. ఆ సినిమాలకు ప్రేక్షకుల నుంచి దక్కిన మద్దతు ఎప్పుడూ మరచి పోలేదు. విశ్రాంతి తీసుకోకుండా సినిమాల్లో నటించడమే నాకు ఇష్టం అందుకే ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటానని అన్నారు.

ప్రేక్షకులు సుదీర్ఘ కాలంగా నన్ను ఆదరిస్తూ వస్తున్నారు. వారికి నా వంతు ఏమైనా ఇవ్వాలనే ఉద్దేశంతో బరోజ్ సినిమాకి దర్శకత్వం వహించాను. సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా తనకు మద్దతుగా నిలుస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు బహుమతిగా బరోజ్ సినిమాను చేశాను. బరోజ్‌ సినిమా కథ గురించి విన్న వెంటనే నచ్చింది. ఒక కొత్త కథను నేనే డైరెక్ట్‌ చేస్తే బాగుంటుంది. తనను అభిమానించే ప్రేక్షకులకు ఇదో మంచి బహుమతిగా నిలుస్తుందని భావించాను. అందుకే బరోజ్‌ సినిమాకి చాలా కష్టపడ్డాను. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ ఆ సినిమా కోసం తాను చాలా కష్టపడ్డట్లుగా మోహన్‌ లాల్‌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

సినిమా ఇండస్ట్రీలో వచ్చిన మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ వచ్చానని, ముందు ముందు మరిన్ని సినిమాలు చేసే విధంగా కెరీర్‌ ప్లాన్‌ చేసుకుంటానంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పాన్‌ ఇండియా సినిమాలకు మంచి స్పందన ఉంది. ఒక్క భాషలో సినిమాను రూపొందించి అన్ని భాషల్లో విడుదల చేయడం అనేది మంచి పరిణామం. అన్ని భాషల్లోనూ ఒక సినిమాకు ఆధరణ లభిస్తే కమర్షియల్‌గా మంచి ఫలితాలు నమోదు అవుతాయి. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు. అయితే మంచి కంటెంట్‌ ఉంటేనే, పాన్‌ ఇండియా మార్కెట్‌కి తగ్గట్లుగా కథ ఉంటేనే కమర్షియల్‌గా విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అనే అభిప్రాయాన్ని మోహన్‌ లాల్‌ వ్యక్తం చేశారు.

Tags:    

Similar News