'చంద్రబాబు- మోహన్ బాబు' స్నేహం రీబూట్
ఏపీ-తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు వరదలకు మునకలు వేయడంతో, చాలామంది ప్రముఖులు ముఖ్యమంత్రుల నిధులకు విరివిగా విరాళాలు ఇచ్చారు
ఏపీ-తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు వరదలకు మునకలు వేయడంతో, చాలామంది ప్రముఖులు ముఖ్యమంత్రుల నిధులకు విరివిగా విరాళాలు ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు చిత్రసీమ నుంచి మెగా కుటుంబం భారీ ఎత్తున డొనేషన్లు ఇచ్చింది. ఈ ఒక్క కుటుంబం నుంచి హీరోలంతా కలిసి 8కోట్లు పైగానే సీఎం నిధులకు జమ చేసారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిధికి వారు విరివిగా విరాళాలు ప్రకటించారు. అలాగే నందమూరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సహా అగ్ర హీరోలందరూ ఏకతాటిపై వరద బాధితుల సంరక్షణ కోసం బాధ్యతగా విరాళాల్ని అందించారు.
ఇది గడిచి కొన్ని వారాలు అవుతోంది. అయితే ఆ సమయంలో మంచు కుటుంబ హీరోలు స్పందించకపోవడం ఆశ్చర్యపరిచింది. ఎట్టకేలకు మంచు మోహన్ బాబు- విష్ణు బాబు కలిసి నేడు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి రూ.25లక్షల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేసారు.
అయితే వారు అందించిన చెక్కు కంటే ఇప్పుడు ఆ ఇరువురి కలయిక గురించే ప్రజలు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. కొన్నేళ్లుగా చంద్రబాబు- మోహన్ బాబు నడుమ సరైన సఖ్యత లేదు. కానీ ఇప్పుడు ఏపీ వరదలను దృష్టిలో ఉంచుకుని ప్రజా శ్రేయస్సు కోసం మంచు కుటుంబ హీరోలు స్పందించి విరాళాన్ని అందించడడం హర్షనీయం. ఇంతకుముందు మోహన్ బాబు కల్తీ తిరుమల లడ్డూపై రాసిన లేఖలో టీడీపీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడును ``నా ఆత్మీయుడు.. మిత్రుడు`` అని సంబోధించడం ఆసక్తిని కలిగించింది. ఇంతలోనే విరాళం చెక్కుతో నేరుగా చంద్రబాబును కలిసారు. బాబుతో మోహన్ బాబు, విష్ణు కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోలలో చంద్రబాబు ముఖంలోను కొత్త వెలుగు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. చంద్రబాబుతో మంచు మోహన్ బాబు కలవడంతో తిరిగి వారి స్నేహం రీబూట్ అవుతోందంటూ అభిమానులు ముచ్చటించుకుంటున్నారు.