మంచు విష్ణు `కన్నప్ప` డైరెక్టర్ `మహాభారతం`?
పురాణేతిహాసాలు రామాయణం, మహాభారతం కథలు బిలియన్ డాలర్ బాక్సాఫీస్ కలెక్షన్లు తెచ్చే సరంజామాను కలిగి ఉన్నాయి.
పురాణేతిహాసాలు రామాయణం, మహాభారతం కథలు బిలియన్ డాలర్ బాక్సాఫీస్ కలెక్షన్లు తెచ్చే సరంజామాను కలిగి ఉన్నాయి. ఈ పౌరాణిక కథలు దర్శకనిర్మాతలను ఎప్పుడూ ఊరిస్తూనే ఉన్నాయి. రామాయణంపై ఇప్పటికే పలువురు దర్శకనిర్మాతలు సినిమాలు తీసారు. కానీ మహాభారతాన్ని పూర్తి స్థాయిలో పెద్ద తెరపై చూపించడం అనేది అసాధ్యంగా కనిపిస్తోంది.
ఇంతకుముందు రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సహాయంతో బాలీవుడ్ నిర్మాత, హీరో అమీర్ ఖాన్ 1000 కోట్ల బడ్జెట్ తో 5 భాగాలుగా మహాభారతం సిరీస్ ని తెరకెక్కించాలని ప్లాన్ చేసారు. దీనిపై ప్రకటనలు కూడా వెలువడ్డాయి. కానీ ఎందుకనో ఆ తర్వాత ప్రాజెక్టును వదులుకున్నారు. ఆ తర్వాత బాహుబలి తో ఘనవిజయం అందుకున్న దర్శకధీరుడు రాజమౌళి మహాభారతాన్ని వెండితెరకెక్కించాలనుందని వ్యాఖ్యానించడంతో అతడు ముందుకు వెళతాడనే భావించారు. కానీ అది జరగలేదు.
కానీ ఇప్పుడు అమీర్ ఖాన్, రాజమౌళికి సాధ్యం కాని దానిని తాను సాధించి చూపిస్తానని అంటున్నాడు ప్రముఖ సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్. అతడు ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్పకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది రిలీజ్ కావడానికి ఇంకా సమయం ఉంది. ఇంతలోనే తాజా ఇంటర్వ్యూలో భారతాన్ని మూడు భాగాలుగా వెండితెరకెక్కిస్తానని అతడు వెల్లడించారు. అతడు `మహాభారత్` టీవీ సీరియల్ దర్శకుడు కావడంతో ఈ గొప్ప ఇతిహాసాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తారని అభిమానులు భావిస్తున్నారు. బుల్లితెరపై ఇప్పటికే మహా భారతం ఘనవిజయం సాధించింది. దర్శకుడు ముఖేష్ కి గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. దీనివల్లనే కన్నప్ప అవకాశం కూడా అతడిని వరించింది.
2013 టెలివిజన్ ధారావాహిక మహాభారత్ వెనుక దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ కృషి పట్టుదల తెలిసిన వారంతా ఇప్పుడు వెండితెరపైనా ఈ ఇతిహాసాన్ని పెద్ద సక్సెస్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. తాజాగా ఆయన పెద్ద తెరకు అనుగుణంగా కథాంశాన్ని మలిచే ప్రణాళికలున్నాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ 2025లో ప్రొడక్షన్‌ను ప్రారంభించనుంది. ఇటీవలి `కన్నప్ప` లాంటి పాన్ ఇండియా చిత్రాన్ని ముఖేష్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం అంకితమైన నటీనటులను ఎంపిక చేయాల్సి ఉందని మేఖేష్ అన్నారు.
పాత్రల విలువను పెంచే .. ప్రాజెక్ట్‌కు పూర్తిగా కట్టుబడి ఉండే నటులను ఎంపిక చేయాల్సి ఉందని సింగ్ తన కోరికను వ్యక్తం చేశాడు. మహాభారతం చాలా విస్తారమైన పురాణ గాథ. దాని సారాంశాన్ని కేవలం మూడు భాగాలలో చిత్రీకరించడం దాదాపు అసాధ్యం..అని అన్నారు. 2013 బుల్లితెర భారతంలో నటించిన నటీనటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారో లేదో అతడు చెప్పలేదు. మహాభారతం టీవీ సీరియల్ కి ఇప్పటికే సీక్వెల్ ప్లాన్ చేసినట్లు దర్శకుడు ముఖేష్ సింగ్ వెల్లడించాడు.
హిందూ పురాణాలు, చరిత్రపై ముఖేష్ సింగ్‌కు లోతైన అవగాహన, ఆసక్తి ఉంది. దానివల్లనే బిగ్ స్క్రీన్‌కి మహాభారతాన్ని మార్చాలనే సింగ్ నిర్ణయం అందరినీ ఆకర్షించింది. వచ్చే అక్టోబర్‌లో ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మూడు భాగాలుగా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాను అని ఆయన స్వయంగా చెప్పడంతో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మరోవైపు ముఖేష్ సింగ్ తాజా చిత్రం- కన్నప్పను అత్యంత భారీగా రూపొందిస్తున్నారు. విష్ణు మంచు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మధు, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు సహా భారీ తారాగణం ఇందులో నటిస్తున్నారు. డిసెంబర్ 2024లో కన్నప్ప విడుదల కానుందని సమాచారం.