'కథ, స్క్రీన్‌ప్లే, తొక్కా తోలు' కామెంట్స్.. నిర్మాత వివరణ ఇదే!
సినిమా టికెట్ రేట్లు తక్కువే అంటూ ఆయన చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు.
ఇటీవల కాలంలో సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతోంది. సినిమా టికెట్ రేట్లు తక్కువే అంటూ ఆయన చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. అలానే స్టార్ హీరోల సినిమాల్లో హై ఎలివేషన్స్, హీరోయిజం, డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ ఉంటే చాలు.. కథ, కథా బలం, స్క్రీన్ ప్లే, దాని తొక్కా తోలు ఎవరూ పట్టించుకోరని నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడటం కొన్ని రోజులపాటు హాట్ టాపిక్ గా నడిచింది. దీనిపై నిర్మాత తాజాగా స్పందించారు.
'లక్కీ భాస్కర్' విడుదల నేపధ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నాగవంశీ మాట్లాడుతూ.. స్టార్ హీరోల సినిమాలు కథ అవసరం లేదనే తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అదే స్టార్ హీరోలకు అడ్వాంటేజ్ అని, మంచి కథ చెప్తేనే వారి సినిమాలు చూస్తున్నామా? అని ఎదురు ప్రశ్నించారు. దీన్ని ఉదహరిస్తూ ‘వార్’ సినిమాలో హృతిక్ రోషన్ హెలికాఫ్టర్ దిగి ఇండియన్ ఫ్లాగ్ పక్కన నడుస్తూ వస్తారు.. ఒక ఆడియన్ గా నా లెక్క ప్రకారం, నేను పెట్టే 150 రూపాయల టికెట్ డబ్బులు ఆ ఒక్క సీన్ కు సరిపోతాయి అని వంశీ వివరించారు.
"పెద్ద హీరోని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు, మనకు హై ఇచ్చే హీరోయిక్ సీన్స్ కొన్ని ఉంటాయి. 'దేవర' మూవీలో ఇంటర్వెల్ లో ఎన్టీఆర్ అందరినీ నరికేసిన తర్వాత, సముద్రపు నీళ్ళల్లో ఆ కత్తిని కడుగుతారు.. అప్పుడు అనిరుధ్ ఒక ఇంగ్లీష్ పాట వేశాడు. అది కొత్త ఎక్స్పరిమెంట్. పిచ్చ హై వచ్చింది. పెద్ద హీరోల సినిమాల్లో అలాంటి కొన్ని మూమెంట్స్ ఉంటాయి. అవి కథను రిలేటెడ్ గా ఉండవు. కానీ అలాంటివి సినిమాకి హై తీసుకురాగలుగుతాయి" అని నాగ వంశీ చెప్పారు.
సాధారణ ప్రేక్షకులు కథ గురించి ఆలోచిస్తారు కదా అని అడిగితే.. "కామన్ ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు. ఖర్చు పెట్టిన డబ్బులకు వాళ్ళను రెండున్నర గంటలపాటు బోర్ కొట్టకుండా కూర్చోబెట్టారా లేదా అనేది చూస్తారు తప్పితే, కొలతలు వేసుకొని సినిమా చూడరు. వాళ్లకు కావల్సింది ఇచ్చామా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తారు." అని సితార వంశీ తెలిపారు. స్టార్ హీరోల సినిమాలకు స్టోరీ అవసరం లేదనే తన మాట మీదే నిలబడి ఉన్న నాగవంశీ.. చిన్న సినిమాలు, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు మాత్రం మౌత్ టాక్ కీలకమని అభిప్రాయ పడుతున్నారు.
ఇదిలా ఉంటే నాగవంశీ నిర్మించిన 'లక్కీ భాస్కర్' సినిమా దీపావళి కానుకగా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వచ్చేసింది. ఒక రోజు ముందుగానే రెండు తెలుగు స్టేట్స్ లో పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. రాబోయే రోజుల్లో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్ నుంచి పలు క్రేజీ ప్రాజెక్ట్స్ విడుదల కాబోతున్నాయి.