బాలయ్య బాబుకు పద్మభూషణ్ ఫిక్స్ అయినట్లేనా ?

బాలయ్య ఇటీవలనే తన సినీ జీవితానికి సంబంధించి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆయన 1974 నుంచి నటుడుగా కొనసాగుతున్నారు

Update: 2024-10-20 14:02 GMT

నందమూరి అందగాడు, ఎన్టీఆర్ నట వారసుడు అయిదు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా తెలుగు సినీ సీమకు అంకితం అయి హీరోగానే నటిస్తూ ఇప్పటికీ అన్ స్టాపబుల్ గా కొనసాగుతున్న టాలీవుడ్ సీనియర్ హేరో నందమూరి బాలక్రిష్ణకు పద్మభూషణ్ అవార్డు 2025 గణతంత్ర వేడుకలలో దక్కనుందా అంటే ఎక్కువగానే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

బాలయ్య ఇటీవలనే తన సినీ జీవితానికి సంబంధించి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆయన 1974 నుంచి నటుడుగా కొనసాగుతున్నారు. ఏ ఒక్క ఏడాది ఆయన నటుడిగా సినిమాలను ఆపలేదు. పైగా ఆయన హీరోగానే ఇన్నేళ్ల కెరీర్ ని కొనసాగించడం విశేషం.

ఈ రోజుకీ టాప్ స్టార్ గా ఉంటూ బ్లాక్ బస్టర్ హిట్లు అందిస్తున్నారు. అంతే కాదు సాంఘిక చారిత్రాత్మక, పౌరాణిక, జానపద సినిమాలు నటించి అన్ని జానర్లలో తన నటనను పండించారు. గత రెండు దశాబ్దాలుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ హోదాలో సామాజిక సేవ చేస్తున్నారు.

అదే విధంగా రాజకీయ రంగంలో కూడా ఆయన సత్తా చాటుతున్నారు. ఆయన హిందూపురం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గి తన తండ్రి ఎన్టీఆర్ రికార్డుని సమం చేశారు. అదే విధంగా ఆయన ఈ రోజుకీ తనదైన శైలిలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు.

దాంతో బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రచారంలో ఉన్న విషయం ఏంటి అంటే సీనియర్ నటుడిగా ఉన్న బాలయ్యకు పద్మభూషణ్ అవార్డుని ఇవ్వాలని కోరుతూ ఏపీలో కూటమి ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసిందని అంటున్నారు.

బాలయ్య వివిధ రంగాలలో చేసిన సేవలకు గుర్తింపుగా పద్మ భూషణ్ అవార్డు ఇవ్వాలని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేసింది అని అంటున్నారు. అదే విధంగా మరో సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ పేరుని కూడా పద్మభూషణ్ పురస్కారానికి సిఫార్సు చేసినట్లుగా తెలిసింది. ఆయన కూడా నటుడిగా అయిదు దశాబ్దాల కాలం పూర్తి చేశారు. సామాజిక రాజకీయ రంగాలలో రాణించారు

దాంతో ఈ ఇద్దరి పేర్లను ఏపీలోని కూటమి ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. కేంద్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వం ఉండడంతో కచ్చితంగా ఏపీ ప్రభుత్వం సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంటారు అని అంటున్నారు.

దాంతో బాలయ్య అభిమానులకు కొత్త ఏడాది శుభవార్త వినిపిస్తుందని అంటున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా పద్మ పురస్కారాల గ్రహీతల జాబితాను జనవరి 26న ప్రకటిస్తుంది. ఆ తరువాత రాష్ట్రపతి చేతులో మీద వీరందరికీ దశల వారీగా పురస్కారాలు రాష్ట్రపతి భవన్ లో అందిస్తారు.

గత ఏడాది మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. అంతకంటే ముందు ఆయనకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. దాంతో చిరంజీవి సమకాలీనుడు అయిన బాలయ్యకు ఇంతవరకూ పద్మ పురస్కారాలు దక్కలేదని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. బహుశా వచ్చే ఏడాది వారికి ఈ లోటు తీరవచ్చునని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News