బాలయ్య రెడీ... ఆయనదే ఆలస్యం!
నందమూరి బాలకృష్ణ వరుసగా అఖండ, వీర సింహా రెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ దక్కించుకున్నాడు
నందమూరి బాలకృష్ణ వరుసగా అఖండ, వీర సింహా రెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ దక్కించుకున్నాడు. బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా కచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఫ్యాన్స్ ఆ సినిమాపై కూడా చాలా నమ్మకం పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.
ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా బాలయ్య తదుపరి సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఆ తదుపరి సినిమాకు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు. బోయపాటి తో బాలయ్య తదుపరి సినిమా చేయాల్సి ఉంది. కానీ అంతకు ముందు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయాలని బాలయ్య నిర్ణయించుకున్నాడని వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య, ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమాకు సంబంధించి ఇప్పటికే చర్చలు జరిగాయి. హనుమాన్ విడుదలకు ముందే వీరిద్దరు కలిసి అన్ స్టాపబుల్ టాక్ షో కోసం వర్క్ చేశారు. ఆ సమయంలోనే ప్రశాంత్ వర్మ వర్కింగ్ స్టైల్ నచ్చి బాలయ్య సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది.
హనుమాన్ సినిమా విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బాలకృష్ణ అతడితో సినిమా చేయాలని భావిస్తున్నాడట. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ను మరో రెండు నెలల్లో ముగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.
బాబీ సినిమా తర్వాత ఎన్నికల నేపథ్యంలో ఒకటి లేదా రెండు నెలల పాటు బాలకృష్ణ సినిమాలకు బ్రేక్ తీసుకుంటాడని తెలుస్తోంది. ఆ వెంటనే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాకు రెడీ అన్నట్లుగా ఆయన నుంచి ఇప్పటికే ప్రశాంత్ వర్మకు సమాచారం వెళ్లిందట. అయితే ఇప్పుడు స్క్రిప్ట్ రెడీ చేసే విషయంలో ప్రశాంత్ వర్మ దే ఆలస్యం అన్నట్లుగా తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ ఇప్పటికే బాలయ్య కోసం ఒక స్టోరీ లైన్ ను అనుకున్నాడు. ఆ స్టోరీ లైన్ ను స్క్రిప్ట్ గా మార్చేందుకు కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రశాంత్ వర్మదే ఆలస్యం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి కాంబో సినిమా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.