నాని మాస్ దెబ్బకు బాక్సాఫీస్ శివతాండవమే..

ఇక సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం మొదలైంది.

Update: 2024-08-29 11:26 GMT

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'సరిపోదా శనివారం' థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మొదటి రోజే మంచి స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ముందుగానే రచ్చ స్టార్ట్ చేసింది. ఇక సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం మొదలైంది. ప్రతి షోకు క్రమంగా ప్రేక్షకుల రీచ్ పెరుగుతూ ఉండటం విశేషం.

నాని నటనపై ప్రేక్షకులు మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో, నాని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా స్పందిస్తూ, సినిమా చూసిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ‘‘మీరు చూపిస్తున్న ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. సినిమా బాక్సాఫీస్ వద్ద శివ తాండవమే..’’ అంటూ ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా నాని సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటించగా, విలన్ పాత్రలో ఎస్. జె. సూర్య అలరించారు. జేక్స్ బెజోయ్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా యాక్షన్ ఘట్టాలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి.

ప్రస్తుతం ట్రెండ్ బట్టి చూస్తే, మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ‘సరిపోదా శనివారం’ రికార్డ్ స్థాయిలో షేర్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోజు గడుస్తున్నకొద్దీ ఈవెనింగ్, నైట్ షోల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వేగంగా పెరుగుతుండటంతో కలెక్షన్లు మరింతగా పెరగనున్నాయి. మొత్తం మీద, నాని మరోసారి తన మాస్ క్రేజ్‌ను నిరూపించుకుంటూ, సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

కానీ, ముందు చూపిన అంచనాలను మించి సినిమాకు మరింత జోష్ రావాలంటే, తదుపరి రోజుల్లో ట్రెండ్ మరింత పుంజుకోవాల్సి ఉంది. శుక్రవారం అలాగే వీకెండ్ బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది. నాని కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందించే సినిమాగా సరిపోదా శనివారం నిలవనుంది. ఇక వీకెండ్ అనంతరం కూడా అదే తరహాలో కొనసాగితే నాని కెరీర్ లో 100 కోట్ల మార్క్ ను అందుకోవచ్చు. మరి సినిమా రాబోయే రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ను అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News