ధనుష్‌ Vs నయనతార.. విబేధాలను బయటపెట్టిన ఓపెన్ లెటర్!

ఈ మేరకు ఆయనకు సుదీర్ఘమైన మూడు పేజీల బహిరంగ లేఖ రాసింది.

Update: 2024-11-16 09:55 GMT

దక్షిణాది అగ్ర కథానాయిక నయనతార జీవితంపై డాక్యుమెంటరీ మూవీ తీసిన విషయం తెలిసిందే. ఆమె సినీ కెరీర్, వ్యక్తిగత జీవితంలోని కీలకమైన విషయాలతో రూపొందించిన ఈ ఫిల్మ్.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. అయితే ఈ డాక్యుమెంటరీలో ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ (నేను రౌడీనే) పాటలు ఉపయోగించుకోడానికి అవకాశం ఇవ్వలేదంటూ ఆ సినిమాని నిర్మించిన హీరో ధనుష్ పై నయన్ తీవ్ర విమర్శలు చేసింది. ఈ మేరకు ఆయనకు సుదీర్ఘమైన మూడు పేజీల బహిరంగ లేఖ రాసింది.

డియర్ మిస్టర్ ధనుష్ కె రాజా, S/o కస్తూరి రాజా, B/o సెల్వరాఘవన్ అని పేర్కొన్న నయనతార.. అనేక తప్పుడు విషయాలను సరిదిద్దడానికే మీకు ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నట్లుగా తెలిపింది. ''మీ నాన్నగారి ఆశీస్సులతో, ఏస్ డైరెక్టర్ అయిన మీ సోదరుడి సపోర్ట్ తో ఇండస్ట్రీలో యాక్టర్ గా స్థిరపడిన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. సినిమా అనేది నాలాంటి వ్యక్తుల మనుగడ కోసం పోరాటం అని మనందరికీ తెలుసు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేని నేను సెల్ఫ్ మేడ్ ఉమెన్ గా ఈ స్థాయికి రావడానికి ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది. నా పనికి, నన్ను ఆరాధించే అభిమానులకు ప్రేక్షకులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇందులో ఎలాంటి దాపరికం లేదు''

''నా జీవితం మీద రూపొందిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రిలీజ్ కోసం నేను మాత్రమే కాదు, నా అభిమానులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఎదురుచూస్తున్నారు. మాకు ఎదురైన అన్ని ఇబ్బందులను అధిగమించి, ఆత్మీయ బృందం సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసాం. మీరు సినిమాపై, నాకూ నా భాగస్వామికి వ్యతిరేకంగా పెంచుకున్న ప్రతీకారం.. మమ్మల్ని మాత్రమే కాకుండా ఈ ప్రాజెక్ట్ కోసం తమ కృషిని, సమయాన్ని వెచ్చించిన ఎంతోమంది వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. నా జీవితం, నా ప్రేమ, పెళ్లి, పరిశ్రమలో ఉన్న నా శ్రేయోభిలాషులు పంచుకున్న జ్ఙాపకాల క్లిప్పింగ్స్ తో ఈ ట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిద్ధమైంది. కానీ నా జీవితంలో ఎంతో ముఖ్యమైన, ప్రత్యేకమైన ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ మాత్రం ఇందులో భాగం కాకపోవడం చాలా బాధాకరం''

''సినిమాలోని ఫొటోలు, పాటలు, విజువల్ కట్స్ ఉపయోగించుకోవడానికి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం దాదాపు రెండు సంవత్సరాల పాటు మీతో ఫైట్‌ చేసాం. నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ రిలీజ్‌ నేపథ్యంలో మీ ఆమోదం కోసం ఎదురుచూశాం. మీరు అనుమతించడానికి నిరాకరించినందున చివరకు మేము ఆశలు వదులుకోవాలని నిర్ణయించుకున్నాం. పాటలు, ఫోటోలు వాడుకోవడానికి మీరు పర్మిషన్‌ ఇవ్వకపోవడంతో రీఎడిట్‌ చేశాం. ‘నానుమ్ రౌడీ దాన్’ పాటలు ఇప్పటికీ ప్రశంసించబడటానికి కారణం.. అందులో అద్భుతమైన సాహిత్యం. ఆ పాటల్లోని సాహిత్యాన్ని మా డాక్యుమెంటరీలో ఉపయోగించుకునే అవకాశం మాకు ఇవ్వడానికి మీరు నిరాకరించడం నా హృదయాన్ని ముక్కలు చేసింది''

''మీరు ఒప్పుకోకపోవడానికి వ్యాపారపరమైన ఇబ్బందులు, లావాదేవీల సమస్యలు ఉంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మీరు తీసుకున్న ఈ నిర్ణయం మాపై మీ వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్లగక్కడం కోసం మాత్రమేనని భావిస్తున్నాం. మీరు ఉద్దేశపూర్వకంగానే ఆమోదం ఇవ్వకపోవడం బాధాకరం. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదలైన తర్వాత మీరు లీగల్ నోటీస్‌ పంపంచడం మరింత షాక్‌కు గురిచేసింది. మా పర్సనల్ డివైజ్ లలో తీసిన కేవలం 3 సెకన్ల వీడియోని వాడుకున్నందుకు మీరు మమ్మల్ని ప్రశ్నించడం చూసి మేము ఆశ్చర్యపోయాము. అది కూడా సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న కొన్ని విజువల్స్ వాడినందుకు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్‌ చేసావ్. నువ్వు ఇంతలా దిగజారతావ్ అనుకోలేదు. ఇక్కడే మీ క్యారెక్టర్‌ ఏంటనేది తెలిసిపోతుంది. మీ అమాయక అభిమానుల సమక్షంలో ఆడియో ఫంక్షన్స్ వేదికలపై మీరు చెప్పే విషయాలను మీరే పాటించరని తెలుస్తోంది''


''సెట్‌లోని వ్యక్తులందరి జీవితాలను, స్వేచ్ఛను నియంత్రించే నిర్మాత ఒక చక్రవర్తి అవుతాడా? నేను మీ లీగల్ నోటీసును అందుకున్నాము. మేము చట్టబద్ధమైన మార్గాల ద్వారానే దానికి తగిన విధంగా సమాధానం ఇస్తాం. మా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం ‘నానుమ్ రౌడీ దాన్’ ఎలిమెంట్స్ ఉపయోగించడం కోసం మీరు ఎన్‌వోసీ ఇవ్వడానికి నిరాకరించడాన్ని కాపీరైట్ కోణంలో న్యాయస్థానం మిమ్మల్ని సమర్థించవచ్చు. అయితే దేవుని న్యాయస్థానంలో దీనికి నైతిక కోణం అనేది ఉంటుందని మీకు గుర్తు చేయాలనుకుంటున్నా''

''సినిమా విడుదలై దాదాపు 10 సంవత్సరాలు కావస్తున్నా ప్రపంచం ముందు ఎవరైనా ముసుగు వేసుకుని ఇంత నీచంగా ఎలా ప్రవర్తిస్తారు. నిర్మాతగా మీ బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన సినిమా గురించి, నేటికీ అందరూ ఇష్టపడే సినిమా గురించి మీరు చెప్పిన భయంకరమైన విషయాలన్నీ నేను మర్చిపోలేదు. సినిమా విడుదలకు ముందు మీరు చెప్పిన మాటలు మాకు ఇప్పటికే మానిపోని గాయాలను మిగిల్చాయి. సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మీ ఇగో బాగా దెబ్బ తిన్నదని ఫిల్మ్ సర్కిల్స్ ద్వారా తెలుసుకున్నాను. ఆ సినిమా విజయంపై మీ అసంతృప్తి సామాన్యులకు కూడా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2016 ద్వారా అర్థమయ్యేలా చేసింది''

''ప్రజా జీవితంలో ప్రముఖ వ్యక్తులు ఎక్కువగా ఇతరుల వ్యక్తిగత జీవితాలను తారుమారు చేయాలని అనుకోరు. తమిళనాడు ప్రజలు, సరైన మనస్సాక్షి ఉన్న ఎవరైనా ఇలాంటి దౌర్జన్యాన్ని మెచ్చుకోరని నేను నమ్ముతున్నాను. ఈ లేఖ ద్వారా నేను కొన్ని విషయాలను మీకు తెలియజేయాలనుకుంటున్నా. మీకు తెలిసిన కొంతమంది వ్యక్తుల విజయాల గురించి అసూయ పడకుండా, శాంతిని పొందాలని మాత్రమే నేను ప్రార్థిస్తున్నాను. ప్రపంచం ఒక పెద్ద ప్రదేశం, ఇది అందరికీ ఉద్దేశించబడింది. మీకు తెలిసిన వ్యక్తులు జీవితంలో పైకి వచ్చినా.. సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేని సాధారణ వ్యక్తులు ఇండస్ట్రీలో పైకి వచ్చినా తప్పు లేదు. కొంతమంది సంబంధాలు పెట్టుకుని సంతోషంగా ఉన్నా ఫర్వాలేదు. దాన్ని మీ నుండి తీసుకోలేరు. ఇది వాళ్ళ పని, ప్రజల ఆశీర్వాదం ద్వారానే వస్తుంది అనే విషయాన్ని గ్రహించండి''

''మీరు ఈ విషయంలో కొన్ని కట్టుకథలు అల్లి, పంచ్‌ డైలాగులు చేర్చి, మీ తదుపరి ఆడియో ఫంక్షన్స్ లో మీరు మాట్లాడవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. నిజంగా ఈ ప్రపంచంలో ఇతరులను తక్కువగా చూడటం సులభం. కానీ ఇతరుల ఆనందాలలో కూడా మన ఆనందం ఉంది. ఇతరుల ఆనందంలో మన సంతోషాన్ని వెతుక్కోవాలి. ఇతరుల కథల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ వెనుక మెయిన్ కారణం అదే. మీరు కూడా దీన్ని చూడాలని నేను సూచిస్తున్నాను. బహుశా అది మీ మనసును మార్చవచ్చు. ప్రేమను పంచండి. ఏదో ఒక రోజు మీరు మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించాలని ప్రార్థిస్తున్నాను'' అని నయనతార తన లెటర్ లో రాసుకొచ్చారు. మరి దీనిపై ధనుష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News