నిహారిక సంపాదన వారానికి రూ.1000
మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలు, ఆడ వారిలో నిహారిక శైలి విభిన్నంగా ఉంటుంది.
మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలు, ఆడ వారిలో నిహారిక శైలి విభిన్నంగా ఉంటుంది. నాగబాబు కూతురు అయినప్పటికీ తను సొంతంగా ఏదో సాధించాలని, తన సొంత ఇమేజ్ కోసం ఎప్పుడూ తాపత్రయ పడుతూ ఉంటుంది. చిన్న వయసులోనే బుల్లి తెరపై సందడి చేసింది. ఒక ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్ లో ఉద్యోగం చేసింది. ఆ తర్వాత నటిగా, ఇప్పుడు నిర్మాతగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్ మరియు వెబ్ సిరీస్ లు మాత్రమే నిర్మించిన నిహారిక మొదటి సారి 'కమిటీ కుర్రాళ్లు' అనే ఒక సినిమాను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది.
మెగా ఫ్యామిలీ మొత్తం కూడా కమిటీ కుర్రాళ్ల కోసం సపోర్ట్ గా నిలిచారు. దానికి తోడు సినిమా కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కడంతో మంచి వసూళ్లు నమోదు అయ్యాయని, నిహారిక కి మంచి లాభాలు వస్తున్నాయని బాక్సాఫీస్ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఆ విషయం పక్కన పెడితే ఇటీవల సినిమా ప్రమోషన్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో నిహారిక తన మొదటి జాబ్ మరియు మొదటి సంపాదన గురించి మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా చిన్న మొత్తం కు తాను మొదటి ఉద్యోగం చేశాను అంటూ చెప్పుకొచ్చింది.
నిహారిక మాట్లాడుతూ... నన్ను నాన్న చిన్నప్పటి నుంచి కూడా ఎటూ పంపించలేదు. దాంతో నేను హైదరాబాద్ లోనే చదువుకున్నాను, ఇక్కడే మొదటి జాబ్ కూడా చేశాను. చదువుకునే రోజుల్లోనే నేను ఒక కేఫ్ లో జాబ్ చేశాను. అక్కడ నాకు వారం కు వెయ్యి రూపాయల చొప్పున జీతంగా ఇచ్చే వారు. నెలలో జీతం దాదాపుగా అయిదు వేల రూపాయలు వచ్చేదని నిహారిక చెప్పింది. నాగబాబు వంటి స్టార్ కిడ్, మెగాస్టార్ వంటి స్టార్ ఇంటి అమ్మాయి అంత తక్కువ జీతానికి ఉద్యోగం చేయడం ఏంటని చాలా మంది అనుకునేవారట. కానీ ఆమె మాత్రం తాను ఏదో ఒక పని చేసి సొంత కాళ్లపై నిలబడాలి అనుకుందట.
జాబ్ ఏంటి అనేది చూడకుండా, ఎంత వస్తుంది అనే విషయాన్ని గురించి పట్టించుకోకుండా కేఫ్ లో జాయిన్ అయ్యిందట. అక్కడ చేసింది కొన్నాళ్లే అయినా కూడా చాలా అనుభవాలు ఉన్నాయి అంటూ నిహారిక గతంలో చెప్పుకొచ్చింది. ఎంతో మంది స్నేహితులతో కలిసి తాను అనేక పనులు చేశాను అని, నేను ఎప్పుడు కూడా ఏదైనా పని చేయడానికి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాను అనే ఫీలింగ్ పెట్టుకోను అంది. నిర్మాతగా మొదటి సూపర్ హిట్ దక్కించుకున్న నిహారిక ముందు ముందు అన్న వరుణ్, చరణ్ లతో పాటు పెదనాన్న చిరంజీవి, బాబాయి పవన్ లతో కూడా సినిమాలు చేయాలని కొందరు కోరుకుంటున్నారు.