శుభవార్త: కోర్టు కేసులన్నీ గెలిచిన భోళాశంకర్
మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేస్తుందో అంచనా వేసేందుకు ట్రేడ్ విశ్లేషకులు సిద్ధమవుతున్నారు. కానీ ఇంతలోనే కోర్టు కేసులతో ఈ సినిమా విడుదలవుతుందా లేదా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ ఆగష్టు 11 న థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేస్తుందో అంచనా వేసేందుకు ట్రేడ్ విశ్లేషకులు సిద్ధమవుతున్నారు. కానీ ఇంతలోనే కోర్టు కేసులతో ఈ సినిమా విడుదలవుతుందా లేదా? అంటూ అభిమానుల్లో టెన్షన్ కనిపించింది. కానీ తాజా సమాచారం మేరకు కోర్టు కేసులన్నీ గెలిచిన భోళాశంకర్ యథాతథంగా థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు. ఆ మేరకు నిర్మాతలు అధికారికంగా ఒక ప్రకటనను వెలువరించారు. అన్ని కోర్టు కేసులను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ గెలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా భోళా వచ్చేస్తున్నాడు! అంటూ ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేతలు ప్రకటించారు.
నిజానికి భోళాశంకర్ నిర్మాతలు తమ కమిట్ మెంట్ ని నెరవేర్చకుండా ఇప్పుడు సినిమాని రిలీజ్ చేస్తున్నారని ఆర్థిక లావాదేవీల్లో సమస్యలు పరిష్కరించకుండానే సినిమాని విడుదల చేసుకుంటున్నారని పంపిణీదారుడు సతీష్ కోర్టులో పిటీషన్ వేసారు. ఏజెంట్ సినిమా ఫ్లాపైన సమయంలో తనకు భోళాశంకర్ నైజాం- వైజాగ్ హక్కులను ఇస్తామని ప్రామిస్ చేసారని కానీ కేవలం వైజాగ్ హక్కులు మాత్రమే కట్టబెట్టారని సతీష్ పిటిషన్ లో ఆరోపించారు. కానీ ఈ కేసును కొట్టివేసిన కోర్టు రిలీజ్ కి అడ్డంకులు లేకుండా లైన్ క్లియర్ చేసింది.
తమిళ బ్లాక్ బస్టర్ వేదాళం (2015) కి భోళాశంకర్ అధికారిక రీమేక్. యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా మెగాస్టార్ అభిమానులలోకి దూసుకెళ్లింది. అయితే 'ఒరిజినల్ స్టోరి' థీమ్ ని ఎంపిక చేసుకున్నా ఇందులో చాలా సన్నివేశాలను చిరు ఇమేజ్ కి తగ్గట్టుగా మలిచామని మెహర్ వెల్లడించారు.
భోళాశంకర్ పై ఉన్న హైప్ దృష్ట్యా డే 1 వసూళ్లు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
చిరంజీవి సినిమాపై జైలర్ ప్రభావం?
ఆగస్ట్ 10న తెలుగు రాష్ట్రాల్లోను థియేటర్లలో విడుదలైన రజనీకాంత్ తమిళ యాక్షన్ కామెడీ జైలర్ ప్రభావం భోళా శంకర్ పై పడనుందా? అంటే మెగా హవా ముందు ఆ ప్రభావం అంతగా ఉండదని అంచనా వేస్తున్నారు. రజనీ జైలర్ తో ఘనమైన కంబ్యాక్ ని చాటుకోవాలని పట్టుదలగా ఉన్నారు. కానీ భోళా హవా ముందు జైలర్ పప్పులుడకవు అంటూ మెగాభిమానుల్లో చర్చ సాగుతోంది.