ఆ ముప్పును తిప్పికొట్టాలి.. యువతకు ఎన్టీఆర్‌ విజ్ఞప్తి

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌ రహిత సమాజం కోసం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.

Update: 2024-09-25 06:22 GMT

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌ రహిత సమాజం కోసం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ విషయంలో సెలబ్రెటీలకు ఒక మంచి వివరణ కూడా ఇచ్చారు. టిక్కెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు అందించిన క్రమంలో డ్రగ్స్ నిర్ములనపై సెలబ్రెటీలు కూడా వారి వంతు సహకారం అందించాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలు ప్రముఖులు, సినీ నటులు భాగస్వామ్యమయ్యారు.

తాజాగా, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా ఈ ఉద్యమానికి తన మద్దతు ప్రకటిస్తూ, యువతకు పిలుపునిచ్చారు. దేవర సినిమాకు తెలంగాణలో చిత్ర యూనిట్ కోరికకు తగ్గట్టుగా రేట్లు పెంచుకునే అవకాశం కల్పించారు. ఇక ఎన్టీఆర్ తనదైన శైలిలో డ్రగ్స్ వల్ల జీవితాన్ని నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్టిఆర్ మాట్లాడుతూ, "మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. కానీ, కొంతమంది తాత్కాలిక ఆనందం లేదా ఒత్తిడి నుంచి బయటపడేందుకు, లేదా స్నేహితుల ప్రభావం వల్లనో డ్రగ్స్‌కి ఆకర్షితులవడం చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. జీవితం విలువైనది. తాత్కాలిక ఆనందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవడం సరికాదు," అని అన్నారు.

ఈ సందర్భంగా, ఎన్టీఆర్‌ డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుని ప్రశంసిస్తూ, "డ్రగ్స్‌ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వామ్యం అవ్వాలని యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్‌ వినియోగిస్తున్నా, విక్రయిస్తున్నా, వెంటనే యాంటీ నార్కోటిక్‌ బ్యూరోకు సమాచారం అందించాలని కోరారు.

ఎన్టీఆర్‌ తన పిలుపులో యువతకు ప్రత్యేకంగా సూచనలు చేస్తూ, "మన శక్తి, సమయం విలువైన వాటిలో వినియోగించుకోవాలి. మాదక ద్రవ్యాల వలన మానసిక ఆరోగ్యానికి, కుటుంబాలకు కలిగే నష్టాలు చాలా పెద్దవిగా ఉంటాయి. వాటిని అవగాహన చేసుకోవాలి" అని అన్నారు. ఈ సందేశం ద్వారా, ఎన్టీఆర్‌ యువతకు ఒక స్పష్టమైన విజ్ఞప్తి చేసారు. డ్రగ్స్‌ మహమ్మారిని అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను తీసుకోవాలని, సమాజం మున్ముందు పెను సంక్షోభం నుండి బయటపడాలంటే, ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆయన అన్నారు.

ఇంతటి ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వడం, యువతను ఉత్తేజపరచడం తప్పకుండా ప్రభావం చూపే అంశం. ఎవరైనా ఈ చెడు మార్గంలో అడుగుపెడుతున్నారని అనిపిస్తే, వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమివ్వడం వల్ల, వారి జీవితం సరిదిద్దబడే అవకాశాలు ఉంటాయని ఎన్టీఆర్‌ తన సందేశం ద్వారా తెలిపారు.

Tags:    

Similar News