OTTలో ఈ ప్రకటనల నసేంటి?
టీవీలో సినిమా లేదా సీరియల్ సీరియస్ గా చూస్తుంటే మధ్యలో యాడ్లు(ప్రకటనలు) వచ్చి నస పెట్టేస్తాయి
టీవీలో సినిమా లేదా సీరియల్ సీరియస్ గా చూస్తుంటే మధ్యలో యాడ్లు(ప్రకటనలు) వచ్చి నస పెట్టేస్తాయి. వాణిజ్య ప్రకటనలు వచ్చిన సమయంలో మధ్యలోంచి లేచి వెళ్లిపోతారు. ఏవైనా పనులు ఉంటే చూసుకుని వస్తుంటారు. ఐదు నిమిషాల పాటు ఈ నస భరించాకే తిరిగి సినిమాని చూడటం కుదురుతుంది. ప్రతి అరగంట, పావుగంటకు ఈ ప్రకటనలు వస్తుంటే కలిగే చిరాకు అంతా ఇంతా కాదు.
ఇప్పుడు యూట్యూబ్ లోను ఇదే పరిస్థితి. ఓవైపు సినిమా వస్తుంటే మధ్యలో ప్రకటనలు దంచేస్తుంటాయి. నిమిషాల వ్యవధిలో ప్రకటనలను ఓపిగ్గా చూసాకే.. అరగంటకు ఓసారి అంతరాయంతో మాత్రమే సినిమా మొత్తం చూడాల్సి ఉంటుంది. సినిమాలు, సీరియళ్లు లేదా ఇంకేవైనా యూట్యూబ్ లో ప్రకటనలు లేకుండా చూడలేం.
అయితే ఇప్పుడు ఇదే తంతు ఓటీటీలోకి రాబోతోందని సమాచారం. ఓటీటీలు కూడా ఇటీవల ప్రకటనల బాట పట్టాయి. 2022 చివరిలో నెట్ ఫ్లిక్స్ ప్రకటనలతో చౌకైన ప్లాన్‌ను అందించడం ప్రారంభించింది. అప్పటికే అమెజాన్ తన ప్రైమ్ వీడియోల కోసం ఇలాంటి సర్వీస్ ని అందుబాటులోకి తెచ్చింది. ఇరు కంపెనీలు మంచి సబ్ స్క్రప్షన్లను అందుకున్న తర్వాత ప్రకటనలతో ప్రయోగాలు ప్రారంభించాయి. వీడియోలు లేదా వెబ్ షోలతో ప్రకటనలు ఆదరణ పొందుతుంటే ఆ మేరకు ఆదాయం పెరుగుతుంది. ఈ తరహా ఆదాయం బిలియన్లలో ఉంది. యూట్యూబ్ తరహాలోనే ఇకపై తాము కూడా ప్రకటనల ఆదాయాన్ని ఆర్జించాలని నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి దిగ్గజ ఓటీటీలు ఆలోచిస్తున్నాయి. యూట్యూబ్ కి వచ్చే భారీ ఆదాయాన్ని తాము కూడా క్యాప్చుర్ చేయాలని పట్టుబడుతున్నాయని తెలిసింది.
అమెరికాయేతర దేశాల్లో భారతదేశం, యూరప్ దేశాల్లో ఒరిజినల్ సినిమాలు, షోలను పెంచుకోవడం ద్వారా తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలనే వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు యూట్యూబ్, టీవీ రంగం తరహాలోనే ప్రటనల ఆదాయం పెరిగితే తక్కువ వార్షిక ఫీజుతోనే సబ్ స్క్రైబర్లకు అందుబాటులోకి వచ్చేందుకు కూడా ఆస్కారం ఉందని ఓటీటీ దిగ్గజాలు యోచించడం కొసమెరుపు. ప్రకటనలతో ఆర్జించడమే కాకుండా మంచి కంటెంట్ తో యంగేజ్ చేస్తేనే ఓటీటీలకు మనుగడ. అందుకు తగ్గట్టే వారు ప్రతిదీ ఆలోచిస్తారని కూడా అంచనా వేస్తున్నారు.