400 మందిలో పవన్ ఓ వారియర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా `హరిహర వీరమల్లు` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా `హరిహర వీరమల్లు` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం, కొంత కాలంగా పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈనేపథ్యంలో తాజాగా నేడు సినిమా షూటింగ్ విజయవాడలో ప్రారంభ మైంది. వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అంటూ సెట్స్ కివెళ్లారు. మొదలవ్వడమే భారీ యుద్ధ సన్నివేశాలతో షూటింగ్ మొదలైంది.
హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కళా దర్శకుడు తోట తరణి ఆధ్వర్యంలో నిర్మించిన భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది ఫైటర్లతో పాటు, భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టుల మధ్య చిత్రీకరిస్తున్నారు. వాళ్లందరి మధ్య పవన్ ఓ వారియర్ లా పోరాటం మొదలు పెట్టారు. ఇంతవరకూ పవన్ ఇలాంటి పాత్ర గానీ...ఇలాంటి యాక్షన్ సన్నివేశాల్లో గానీ పాల్గొనలేదు.
దీంతో ఆయన కూడా ఎంతో ఎగ్జైట్ మెంట్ తోనే షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. షూట్ లో నాజర్, రఘుబాబు, అయ్యప్ప పి. శర్మ లతో పాటు, సునీల్, నర్రా శ్రీను, నిహార్ వంటి నటులంతా పాల్గొంటున్నారు. మనోజ్ పరమహాసం అద్భుతమైన ఛాయాగ్రాహణంతో ఈ సీన్స్ కి మరింత హైప్ వస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ఈ షెడ్యూల్ కి సంబంధించి యూనిట్ ఎంతో పకడ్భందీగా ముందుకెళ్తుంది.
మనోజ్ పరమహంస, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్‌లతో కలిసి దర్శకుడు జ్యోతి కృష్ణ ఎంతో ఎఫెర్ట్ పెట్టి పనిచేస్తున్నారు. సాంకేతికంగాను సినిమాను హైలైట్ చేస్తున్నారు. బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.