పవన్ కళ్యాణ్.. షూటింగ్స్ కోసం రెండే రోజులు..?

దీని ద్వారా పవన్ కళ్యాణ్ ఇప్పుడు మెజారిటీ సమయం పరిపాలన కార్యకలాపాల కోసం వెచ్చించబోతున్నాడని అర్ధమవుతోంది.

Update: 2024-06-20 05:14 GMT

పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే కీలకమైన మంత్రిత్వ శాఖలకి సంబందించిన పూర్తిగా బాధ్యతలు తీసుకోవడంతో పాటు అధికారులతో సమీక్షలు కూడా మొదలు పెట్టారు. కీలకమైన బిల్లులపైన కూడా పవన్ కళ్యాణ్ సంతకాలు చేశారు. దీని ద్వారా పవన్ కళ్యాణ్ ఇప్పుడు మెజారిటీ సమయం పరిపాలన కార్యకలాపాల కోసం వెచ్చించబోతున్నాడని అర్ధమవుతోంది.

పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం అభిమానులకి ఒకింత ఆనందాన్ని ఇచ్చే అంశమే. అయితే ఆయన ఆయన కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కి సంబందించిన షూటింగ్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఫ్యాన్స్ ఈ సినిమాలని కూడా చూడాలని కోరుకుంటున్నారు. అలాగే వందల కోట్ల పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉండటంతో నిర్మాతలు అయితే ధైర్యంగా సినిమాలు పూర్తి చేయమని అడగలేని పరిస్థితి. కానీ ఇప్పటికే సగానికి పైగా కంప్లీట్ అయ్యి ఉన్న ఆ సినిమాలు పూర్తి చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉంది. వీటి తర్వాత సినిమాలు చెయ్యడం, చెయ్యకపోవడం పవన్ కళ్యాణ్ ఇష్టం. కానీ వీటిని మాత్రం కంప్లీట్ చేస్తే అటు నిర్మాతలు సేఫ్ అవుతారు. అలాగే అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.

దీనిని దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ ఈ సినిమాల కోసం డేట్స్ అడ్జస్ట్ చేయడానికి రెడీ అయ్యారంట. వారంలో రెండు రోజులు షూటింగ్ కోసం కేటాయిస్తానని నిర్మాతలకి మాట ఇచ్చారంట. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు ఆల్ మోస్ట్ చివరి దశలో ఉన్నాయి. అయితే వీటిలో ఈ సినిమా షూటింగ్ ముందుగా స్టార్ట్ చేస్తాడనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో ఏఎం రత్నం అయితే హరిహర వీరమల్లు షూటింగ్ షెడ్యూల్ కి ప్లాన్ చేసుకుంటున్నారంట.

డిసెంబర్ లో మూవీ రిలీజ్ చేస్తానని కూడా నిర్మాత ఎనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పడంతోనే ఆయన ఈ ప్లానింగ్ అంతా చేసుకొని ఉంటాడనే మాట వినిపిస్తోంది. ఇది కంప్లీట్ అయ్యాక ఓజీ పూర్తి చేసే ఛాన్స్ లు ఉన్నాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ 2025లోనే ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది ఆయా నిర్మాతల నుంచి క్లారిటీ వచ్చే వరకు తెలియదు.

Tags:    

Similar News