పవన్ కళ్యాణ్ రేపటి నుంచి రిలాక్స్!
తీవ్రమైన ఎండలోనే ప్రచారం చేయడంతో అనారోగ్యానికి గురి కావడం...డీహైడ్రేషన్ సమస్యలు వంటివి తలెత్తి బాగా నీరసించారు.
పవర్ స్టార్..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నుంచి కొన్నిరోజుల పాటు విరామంలో ఉంటారని తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పవన్ గత ఆరు నెలలుగా ప్రజల్లోనే ఉన్నారు. పార్టీ పనులు..ప్రచారం పనులంటూ బిజీ బిజీగా గడిపారు. ఎన్నికల తేదీ సమీపించిన కొద్ది మరింతగా శ్రమించారు. తీవ్రమైన ఎండలోనే ప్రచారం చేయడంతో అనారోగ్యానికి గురి కావడం...డీహైడ్రేషన్ సమస్యలు వంటివి తలెత్తి బాగా నీరసించారు. అయినా మహా సంగ్రామంలో గెలుపు కోసం తాను చేయాల్సిన దంతా చేసారు.
చివరిగా ఎన్నికల తంతు నేటితో ముగిసింది. గెలుపు గుర్రం ఎవరెక్కుతారు? అన్నది పక్కనబెడితే రేపటి నుంచి నాయకులంతా రిలాక్స్ అవుతారు. ఇకపై వాడి వేడి చర్చ అంతా? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైనా? తుది ఫలితాలపైనా ఉంటుంది? ఇదంతా రిలాక్స్ గా కూర్చునే చేసే పని. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి కూడా విశ్రాంతి దొరుకుతుంది. ఎండలో ప్రచారం చేయడంతో పవన్ రూపంలో మార్పులొచ్చాయి. తిరిగి మళ్లీ సినిమా సెట్స్ కి వెళ్లాలంటే గ్లామర్ పెంచాలి. జనసేనాని పక్కనబెట్టి పవర్ స్టార్ అనే మోత మోగాలంటే ఇవన్నీ తప్పవు. కొన్ని రోజుల విరామం అనంతరం మళ్లీ తిరిగి షూటింగ్ లకు హాజరవుతారని తెలుస్తోంది.
ముందుగా ఆయన `ఓజీ` షూట్ని పూర్తి చేయాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ చిత్రాన్నిసెప్టెంబర్లో రిలీజ్ చేస్తామని ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే. అభిమానులు కూడా ఫిక్సై పోయారు. రాజకీయంగా సేనానికి కావాల్సిన అన్నిరకాల సహకారం అభిమానుల నుంచి దొరికింది. ఇక అభిమానులకు ఆయన ఇవ్వాల్సిందే బాకీ ఉండిపోయింది. సెప్టెంబర్లో `ఓజీ`ని రిలీజ్ చేస్తే అటుపై...పెండింగ్ పడిన `హరిహర వీరమల్లు` కూడా పూర్తి చేస్తారు.
మరోవైపు అదే పవన్ కోసం హరీష్ శంకర్ కూడా ఎదురు చూస్తున్నారు. `ఉస్తాద్ భగత్ సింగ్` కూడా కొంచెం షూటింగ్ చేసి ఆపేసారు. ఆ సినిమాషూటింగ్ కూడా పూర్తి చేయాలి. నిర్మాతలంతా పీకే కోసం సెట్స్ లో ఎదురు చూస్తున్నారు. ఇంకా పవన్ కి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు కొంత మంది ఉన్నారు. వాళ్లు కూడా తమ చిత్రాల్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆశిస్తున్నారు. కాబట్టి జూన్ 4 తర్వాత పవన్ మళ్లీ మ్యాకప్ తప్పనిసరి.