తెలుగు పలకడం రాదంటూ పవన్ బ్రో క్లాస్
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ-''ఒక విషయంలో నేను సముద్రఖని గారికి అభిమానిని అయ్యాను.
''మనలో చాలామందికి తెలుగుభాష సరిగా చదవడం పలకటం రాదు. ఇంగ్లీష్ పదాలు లేకుండా తెలుగు మాట్లాడలేకపోతున్నాం. మన మాతృభాష బలంగా ఉండాలని ఎప్పటికప్పుడు నన్ను నేను సరిదిద్దుకుంటూ ఉంటాను'' అని అన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన నటించిన 'బ్రో' థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుండగా ప్రీరిలీజ్ వేడుకలో పవర్ ఫుల్ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన 'బ్రో' ప్రమోషనల్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలుగు వారు తెలుగు మాట్లాడేందుకు ఎంతగా ఇబ్బందిపడుతున్నారో వెల్లడిస్తూ.. దానిని సరిదిద్దుకోవాలని సూచించారు.
పొరుగు రాష్ట్రానికి చెందిన దర్శకుడు సముద్రకని తెలుగు నేర్చుకుని మరీ స్పష్ఠంగా మాట్లాడుతూ తనకు స్ఫూర్తినిచ్చారని.. అతడు అలా చేసినప్పుడు నేను తమిళం నేర్చుకుని తమిళంలోనే స్పీచ్ ఇస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ-''ఒక విషయంలో నేను సముద్రఖని గారికి అభిమానిని అయ్యాను.
మనలో చాలామందికి తెలుగుభాష సరిగా చదవడం పలకటం రాదు. ఇంగ్లీష్ పదాలు లేకుండా తెలుగు మాట్లాడలేకపోతున్నాం. మన మాతృభాష బలంగా ఉండాలని ఎప్పటికప్పుడు నన్ను నేను సరిదిద్దుకుంటూ ఉంటాను. అలాంటిది సముద్రఖనిది మన భాష కాదు.. మన యాస కాదు.
అయినా తెలుగు స్పష్ఠంగా మాట్లాడుతున్నారు. స్పష్ఠంగా చదువుతున్నారు. మొదటిరోజు నేను స్క్రిప్ట్ రీడింగ్ కి వెళ్తే ఆయన స్క్రిప్ట్ చదువుతూ కనిపించారు. తమిళ్ లోనో ఇంగ్లీష్ లోనో రాసుకొని చదువుకుంటున్నారు అనుకున్నాను. వెళ్లి చూస్తే అది తెలుగు స్క్రిప్ట్. మీకు తెలుగు వచ్చా అని అడిగితే ఈ సినిమా కోసం కొన్ని నెలల నుంచి నేర్చుకుంటున్నాను అని చెప్పారు. ఆయన మన తెలుగు నేర్చుకున్నారు కాబట్టి నేను ఆయనకు మాట ఇస్తున్నాను.
నేను తమిళ్ నేర్చుకొని ఏదో ఒకరోజు తమిళ్ లో స్పీచ్ ఇస్తాను. సముద్రఖని గారు ఇంత తెలుగు నేర్చుకుంటే తెలుగు మాతృభాషగా ఉన్న మనం ఇంకెంత తెలుగు నేర్చుకోవాలి అని కనువిప్పు కలిగేలా చేశారు'' అని అన్నారు.
అలాగే నేటితరం ఔత్సాహికులు .. గొప్ప రచయితలు, దర్శకులు కావాలంటే మాతృభాష మీద పట్టుండాలని... మాతృభాష మీద మన సాహిత్యం మీద పట్టుంటే గొప్ప గొప్ప సినిమాలు వస్తాయని పవన్ కల్యాణ్ సూచించారు. పవన్ కల్యాణ్- సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని తెరకెక్కించిన బ్రో ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇందులో కేతిక శర్మ- ప్రియా ప్రకాష్ వారియర్ - ఊర్వశి రౌతేలా తదితరులు నటించారు.