300 మందిని విదేశాల నుంచే దించారా?
భారీ తారాగణంతో పాటను చిత్రీకరించడానికైతే వారం రోజులకు పైగానే సమయం పడుతుంది.
ఒక పాటలో వంద మంది డాన్సర్లు కనిపిస్తే ఎక్కువ. వాళ్లను కూడా కూడగట్టడం అన్నది చిన్న పని కాదు. పక్క ఇండస్ట్రీల నుంచి అదనంగా డాన్సర్లు తీసుకొస్తే గానీ పని పూర్తికాదు. అలాంటి పాటని కంపోజ్ చేయడానికి సమయం ఎక్కువే పడుతుంది. భారీ తారాగణంతో పాటను చిత్రీకరించడానికైతే వారం రోజులకు పైగానే సమయం పడుతుంది. ఇప్పుడు మేకర్స్ అంతా పాటల్ని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు.
అంతా శంకర్ రేంజ్ ల్లోనే కంపోజ్ చేయిస్తున్నారు. తాజాగా ఓ పాట కోసం ఏకంగా విదేశాల నుంచే మూడు వందల మందిని దిగుమతి చేసారు. ప్రస్తుతం నితిన్ కథనాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో `ఎక్స్ ట్రా ఆర్డినరీ` అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం శంషాబాద్ లో వేసిన ఓ భారీ సెట్ లో నితిన్-శ్రీలీలపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు.
ఈ పాట కోసం 300 మంది డాన్సర్లను విదేశాల నుంచి తీసుకొచ్చారుట. జానీ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరిస్తున్నారు. ఇలా ఓ పాట కోసం విదేశాల నుంచి ఇంతమంది డాన్సర్లను తీసుకురావడం అన్నది బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఇంతకుముందెన్నడు సౌత్ సినిమా షూటింగ్ లో భాగంగా స్థానికంగా ఇంతమందిని దిగుమతి చేయలేదు.
అలాంటి పాటలచిత్రీకరణ ఉంటే నేరుగా విదేశాల్లోనే ప్లాన్ చేస్తున్నారు తప్ప! భారత్ కి తరలించడం అన్నది జరగలేదు. కానీ ఎక్స్ ట్రా ఆర్డినరీ కోసం ఇండియాకే రప్పించడం అన్నది ప్రత్యేకతే. పాట మొత్తం సెట్ లోనే చిత్రీకరించాల్సి ఉండటంతో దిగుమతి చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇంత భారీ కాన్వాస్ పై పాటలు చిత్రీకరించడం అన్నది శంకర్ సినిమాల్లోనే కనిపిస్తుంది.
ఆయన కూడా విదేశాల నుంచి దిగుమతి చేసింది చాలా తక్కువ మందినే. స్థానిక టాలీవుడ్.. కోలీవు డ్..శాండిల్ వుడ్ డాన్సర్లనే వీలైనంత వరకూ తన పాటలో ఉండేలా చూసుకుంటారు. విదేశాల్లో ఆయన పాటలు షూటింగ్ అనుకుంటే హీరో-హీరోయిన్ మధ్యనే ఉంటుంది.